సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో తాత్కాలికంగా 50వేల మంది వైద్యులను నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అటు వైద్యారోగ్య సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గించడం, ఇటు ప్రజలకు మరింత మెరుగ్గా సేవలు అందించడం కోసం వైద్యులతోపాటు నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారామెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించుకోవాలని అధికారులను ఆదేశించారు. రెండుమూడు నెలల కాలానికి నియ మించుకొని, గౌరవప్రదమైన రీతిలో జీతాలు అందించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50వేల మంది ఎంబీబీఎస్ పూర్తిచేసి సిద్ధంగా ఉన్న అర్హులైన వైద్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించాలని సూచించారు. కరోనా వంటి కీలక సమయంలో రాష్ట్రం కోసం పనిచేస్తున్నందున.. వారి సేవలకు గుర్తింపుగా భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వెయిటేజీ ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుత కష్టకాలంలో ప్రజల కోసం సేవచేయడానికి ముందుకు రావాలని డాక్టర్లు, నర్సులు,ఫార్మాసిస్టులకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆసక్తి ఉన్నవారు వెబ్‌సైట్ https://odls. telangana.gov.in/ medicalrecruit ment/Home.aspxలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వరంగల్, ఆదిలాబాద్‌లలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు
వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను తక్షణమే ప్రారంభించాలని.. వాటిలో వైద్య సిబ్బందిని నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్మించిన ఎంజీఎంకు చెందిన 250 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను, ఆదిలాబాద్ జిల్లా రిమ్స్‌లో మరో 250 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. పీఎంఎస్‌ఎస్‌వై పథకం కింద నిర్మిస్తున్న ఈ ఆస్పత్రులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా.. వరంగల్ హాస్పిటల్‌కు రూ.8కోట్లు, ఆదిలాబాద్ హాస్పిటల్‌కు రూ.20 కోట్లు కలిపి రూ.28 కోట్లను తక్షణమే విడుదల చేయాలని ఆర్థికశాఖను సీఎం ఆదేశించారు. వరంగల్ దవాఖానా కోసం 363 వైద్య సిబ్బందిని, ఆదిలాబాద్ దవాఖానా కోసం 366 మంది వైద్య సిబ్బంది నియామకానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదు
రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై ఆదివారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, కోవిడ్ సీఎంవో ప్రత్యేక అధికారి రాజశేఖర్‌రెడ్డి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, టెక్నికల్ అడ్వైజర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్లు, బెడ్లు, ఇతర కరోనా సౌకర్యాల పరిస్థితిపై సీఎం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని, రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులోనే ఉన్నాయని, ఇతర మందులన్నింటినీ సిద్ధంగాగా ఉంచామని వైద్యారోగ్య శాఖ అధికారులు సీఎంకు వివరించారు. ప్రభుత్వ దవాఖానాలలో మెత్తం 7,393 బెడ్లు అందుబాటులో ఉన్నాయని, 2,470 ఆక్సిజన్ బెడ్లు, 600 వెంటిలేటర్ బెడ్లు కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మందులతోపాటు వైద్య బృందాలు ఎల్లవేళలా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అయితే ప్రైవేటు దవాఖానాల్లో రెమిడెసివిర్ ఇంజక్షన్లను మరింతగా అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లు చేయాని అధికారులకు సీఎం సూచించారు.
వారికి ముందుగా వ్యాక్సిన్లు వేద్దాం..: కేసీఆర్
సమీక్ష సందర్భంగా కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌తో సీఎం కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. కరోనాను నియంత్రించే క్రమంలో తీసుకోవాల్సిన చర్యల గురించి పలు సూచనలు చేశారు. కరోనా వ్యాప్తిని పెంచే అవకాశం ఉన్నవారిని గుర్తించి, వారికి ముందు టీకాలు వేస్తే బాగుంటుందని చెప్పారు. ఆటోడ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, కండక్టర్లు, గ్యాస్ డెలివరీ బాయ్స్, స్ట్రీట్ వెండార్లు, కార్మికులతో కరోనా వ్యాపించే అవకాశాలు ఎక్కువకాబట్టి.. వారిని ప్రత్యేక కేటగిరీ కింద గుర్తించి వాక్సిన్లు వేసేలా నిబంధనలను సడలించాలని కోరారు. ఈ వెసులుబాటు కల్పిస్తే చాలావరకు కరోనా వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు. ఈ సూచనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలో ప్రధానితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బదులిచ్చారు.
►ఆటోడ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, కండక్టర్లు, గ్యాస్ డెలివరీ బాయ్స్, స్ట్రీట్ వెండార్లు, కార్మికులతో కరోనా వ్యాపించే అవకాశాలు ఎక్కువకాబట్టి.. వారిని ప్రత్యేక కేటగిరీ కింద గుర్తించి వ్యాక్సిన్లు వేసేలా నిబంధనలను సడలించాలి. ఈ వెసులుబాటు కల్పిస్తే చాలావరకు కరోనా వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉంటుంది. – కేంద్ర మంత్రితో ఫోన్‌లో సీఎం కేసీఆర్
►మీది మంచి ఆలోచన. మీ సూచనలు బాగున్నాయి. వాటిని తప్పకుండా ఆచరణలో పెడతాం. మీ సూచనలకు అభినందనలు. రాష్ట్రానికి మరింత ఆక్సిజన్, రెమిడెసివర్ సరఫరాకు చర్యలు చేపడతాం. – సీఎం కేసీఆర్‌తో ప్రధాని మోదీ
Comments
Please login to add a commentAdd a comment