కరోనా ఆగట్లేదు.. జర జాగ్రత్త | CM KCR To Hold Review Meeting On Corona Virus Pandemic | Sakshi
Sakshi News home page

కరోనా ఆగట్లేదు.. జర జాగ్రత్త

Published Sun, Apr 19 2020 1:01 AM | Last Updated on Sun, Apr 19 2020 2:05 PM

CM KCR To Hold Review Meeting On Corona Virus Pandemic - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘‘దేశంలో, రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. హైదరాబాద్‌లో ఎక్కువ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నందున అక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. కంటైన్మెంట్ల నిర్వహణ బాగా జరగాలి. ఆ ప్రాంతాల నుంచి ఎవరినీ ఎట్టి పరిస్థితుల్లో బయటకు రానీయొద్దు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకినవారు నివసిస్తున్న ఇతర ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికక్కడ వ్యూహం రూపొందించుకోవాలి.

వైరస్‌ సోకినవారి ద్వారా ఇంకా ఎవరికి సోకవచ్చు అనే విషయాలను కచ్చితంగా నిర్ధారించి పరీక్షలు జరపాలి. ఎంత మందికైనా పరీక్షలు జరపడానికి, ఎంత మందికైనా చికిత్స చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. వైరస్‌ వ్యాప్తి నివారణ, రోగులకు అందుతున్న చికిత్స, లాక్‌డౌన్‌ అమలు తదితర అంశాలపై ప్రగతి భవన్‌లో శనివారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఆదివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలను చర్చించారు. 

అందరికీ సహాయం అందాలి...
కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి అమలు చేస్తున్న పద్ధతులను యథావిధిగా అమలు చేయాలని, లాక్‌డౌన్‌ వల్ల ఏ ఒక్కరు ఆకలితో అలమటించే పరిస్థితి రాకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. ‘‘లాక్‌డౌన్‌ వల్ల పేదలకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దు. అందుకే ప్రభుత్వం తెల్ల రేషన్‌ కార్డుదారులకు నగదు, బియ్యం ఉచితంగా పంపిణీ చేసింది. వలస కూలీలు, రోజువారీ కార్మికులు ఇంకా ఎవరైనా మిగిలినా సరే, వారిని గుర్తించి తగిన సహాయం అందించాలి. వ్యవసాయ కార్యక్రమాలు యథావిధిగా జరిగేట్లు చూడాలి.

కొనుగోలు కేంద్రాలను కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలి. ఈ సమయంలో ఎవరికి ఏ ఆపద, ఇబ్బంది కలిగినా వెంటనే స్పందించే విధంగా ప్రభుత్వంలోని అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి’’అని ఆయన సూచించారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారక రామారావు, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్, సీఎస్‌ సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శులు శాంత కుమారి, నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, కాళోజి హెల్త్‌ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. చదవండి: మోదీ.. ప్రజల్ని గెలిపించగల నాయకుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement