సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలపాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్రంలో లాక్‌డౌన్ ఈనెల 7వ తేదీతో ముగియనుండగా.. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈనెల 21 వరకు దానిని పొడిగించాలని భావిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, లాక్‌డౌన్ పొడిగింపు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ప్రగతిభవన్‌లో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. మే 17 వరకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ గడువును పొడిగించిన నేపథ్యంలో రాష్ట్రంలో కూడా మరో రెండువారాల పాటు లాక్‌డౌన్ కొనసాగించాలని ఈ సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. రాష్ట్రంలో కొత్తగా గుర్తించిన కంటైన్మెంట్ జోన్లలో క్వారంటైన్ గడువు ఈ నెల 21న ముగియడాన్ని ఇందుకు పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది.
లాక్‌డౌన్ సడలింపులకు సంబంధించి ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలను రాష్ట్రంలో ఎంత మేర పాటించవచ్చనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. వలస కార్మికులను స్వస్థలాలకు పంపించే విషయంలో కేంద్రం తాజాగా యూ టర్న్ తీసుకోవడంపైనా చర్చ జరిగింది. అనుకోని పరిస్థితుల్లో రాష్ట్రానికి వచ్చి చిక్కుకుపోయిన వారిని మాత్రమే తిరిగి స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతించాలంటూ కేంద్రం జారీ చేసిన తాజా మార్గదర్శకాల వల్ల తలెత్తే పరిణామాలపై చర్చించినట్టు తెలుస్తోంది. దీంతో పాటు గ్రీన్ జోన్లలో నియమిత సామర్థ్యంతో ప్రజా రవాణా, మద్యం షాపులను తెరవడం వంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం.
సడలింపులు, మార్గదర్శకాలు సిద్ధం చేయండి..
మంగళవారం జరిగే రాష్ట్ర కేబినెట్ భేటీలో చర్చించాల్సిన ఎజెండాను ఖరారు చేసేందుకు సోమ వారం మరోసారి సమావేశం కావాలని సీఎం నిర్ణయించినట్లు తెలిసింది. లాక్‌డౌన్ పొడిగింపు, ఏయే రంగాలకు సడలింపు ఇవ్వాలనే అంశంతో పాటు పాటించాల్సిన మార్గదర్శకాలను కూడా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల వల్ల రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గినా, ప్రస్తుత పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహిస్తే మరింత ప్రబలే అవకాశముందనే అభిప్రాయం కూడా ఈ సమావేశంలో వ్యక్తమైనట్లు తెలిసింది. వైరస్ సోకిన వారిని క్రమం తప్పకుండా పర్యవేక్షించడంతో పాటు లాక్‌డౌన్‌ను ప్రజలందరూ పాటించేలా చూడాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
జిల్లాల వారీగా పరిస్థితితో పాటు కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్ నిబంధనల అమలు తీరును కూడా సమీక్షించారు. అలాగే లాక్‌డౌన్ పొడిగింపుపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవాలని ఆయన ఆదేశించినట్టు తెలిసింది. ఈ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా అభిప్రాయ సేకరణ నిర్వహించాలని సూచించినట్టు సమాచారం. అయితే, చాలామంది లాక్‌డౌన్‌ను పొడిగించాలనే కోరుకుంటున్నారని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఈ భేటీలో మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్‌రావు, శాంత కుమారి, జనార్దన్‌రెడ్డి, రామకృష్ణారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment