సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మే 5న ఉండే పరిస్థితుల ఆధారంగా లాక్‌డౌన్ ఎత్తివేతపై నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు. లాక్‌డౌన్ సందర్భంగా నిత్యావసరాలు కొనుగోలు చేసుకునేందుకు సడలింపులిస్తే కొందరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని తప్పుబట్టారు. నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఇచ్చిన సమయాన్ని కుదించాలని పాతబస్తీ ఎమ్మెల్యేలు సైతం కోరారని తెలిపారు. అయితే పాతబస్తీ, న్యూ సిటీ తేడా లేకుండా అన్ని చోట్లా పరిస్థితి నియంత్రణలోనే ఉందన్నారు.
లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో వలస కార్మికులు సొంత ప్రాంతాలను వెళ్లేందుకు అనుమతించబోమని స్పష్టంచేశారు. లాక్‌డౌన్ సడలింపుల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం లేదని, అనవసర వివాదాల జోలికి వెళ్లట్లేదని పేర్కొన్నారు. పసుపు కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలపై వడ్డీలను ఆర్బీఐ మాఫీ చేయాలని, రుణ వాయిదాల చెల్లింపులను వాయిదా వేయాలని, ఎఫ్‌ఆర్‌బీఎం రుణపరిమితి పెంచాలని ప్రధానికి ఆదివారం కూడా విజ్ఞప్తి చేశానని, ఆయన సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ర్యాపిడ్ టెస్టులు చేయాల్సిన అవసరం లేదని పునరుద్ఘాటించారు. ఇబ్బడిముబ్బడిగా టెస్టులు చేసేందుకు ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఎఫ్‌ఆర్‌బీఎం రుణాలు, పన్నులు, పన్నేతర ఆదాయం కలిపి ఏప్రిల్‌లో రాష్ట్రానికి రూ.1,500 కోట్లు రావాల్సి ఉండగా, రూ.150 కోట్ల ఆదాయమే వచ్చిందని కేసీఆర్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment