‘శ్రీ’ పద్ధతిలో సాగు చేసిన వరి పంట
సాక్షి,జగిత్యాల అగ్రికల్చర్: వరి పంటను రకరకాల పద్ధతుల్లో సాగు చేస్తున్నప్పటికీ ‘శ్రీ’ పద్ధతిలో వరిని సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. ఇంగ్లిష్‌లో ‘శ్రీ’ అంటే ఎస్‌ఆర్‌ఐ (సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్). ఈ పద్ధతిని 1983లో మడగాస్కర్‌లో అభివృద్ధి చేశారు. శ్రీ పద్ధతిలో వరిని సాగు చేస్తే ఖర్చు లేకుండా ఎలా దిగుబడులు సాధించవచ్చనే విషయాల గురించి జగిత్యాలకు చెందిన క్రిషి సంస్థ ప్రతినిధి నర్సింగరావు(94410 35869) వివరించారు.
ఎలాంటి నేలలు అనుకూలమంటే..
శ్రీ పద్ధతిలో సాగు చేయడానికి చౌడు నేలలు పనికి రావు. నీరు బాగా ఇంకే భూములు, చదునుగా ఉండే భూములు అనుకూలం. నీరు పెట్టినప్పుడు అవి పొలమంతా సమానంగా పారాలి. పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగను వరినాట్ల కంటే 40 రోజుల ముందు విత్తుకొని, పూతకొచ్చే సమయానికి నీరు పెట్టి ట్రాక్టర్‌తో దమ్ము చేయాలి. 10 రోజులు మురిగిన తర్వాత నాట్లు వేయడానికి నేలను సిద్ధం చేసుకోవాలి. అలాగే 2500 కిలోల నాడెప్ కంపోస్టు వేయాలి. నాటే రోజు 125 కిలోల ఘన జీవామృతం వేయాలి. 30 రోజుల తర్వాత 125 కిలోల ఘన జీవామృతం వేయాలి. 45, 60 రోజులకొకసారి 200 లీటర్ల ద్రవజీవామృతాన్ని పారించాలి.
నారును ఎలా పెంచాలంటే..
శ్రీ పద్ధతిలో 8 నుంచి 12 రోజుల నారును నాటుతారు. ఒక ఎకరానికి కావాల్సిన నారుకు 400 చదరపు అడుగుల నారుమడి కావాలి. నారుమడి తయారు చేసేటప్పుడు.. ఒకటవ పొరలో ఒక అంగుళం బాగా చివికిని పశువుల ఎరువు, 2వ పొరలో ఒకటిన్నర అంగుళాల మట్టి, 3వ పొరలో ఒక అంగుళం బాగా చివికిని పశువుల ఎరువు, 4వ పొరలో రెండున్నర అంగుళాల మట్టి.. ఇలా పొరలన్నింటినీ బాగా కలపాలి. నారుమడి చుట్టు కాలువ తీయాలి. వరి విత్తనాన్ని 12 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత గోనెసంచిలో పోసి 24 గంటల పాటు గాలి తగలకుండా ఉంచాలి. మొలకెత్తిన 2 కిలోల విత్తనాలకు 100 గ్రాముల అజోస్పైరిల్లంతో విత్తన శుద్ది చేయాలి. ఈ విత్తనాన్ని నారుమడిలో చల్లాలి. అలా చల్లిన విత్తనంపై వరి గడ్డి కప్పి ఉదయం, సాయంత్రం నీరు పోయాలి. దీనివల్ల విత్తనం ఎండకు, వానకు నేరుగా గురికాకుండా ఉంటుంది. పక్షులు తినకుండా ఉంటాయి.
ప్రధాన పొలం తయారీ
పొలం దున్నడంలో మామూలు పద్ధతికి, శ్రీ పద్ధతికి ఏమి తేడా లేదు. పొలం చదునుగా ఉండాలి. నాట్లు వేసేటప్పుడు నీరు అసలు ఉండకూడదు. వరుసకు, వరుసకు, మొక్కకు మొక్కకు మధ్య 25 సెం.మీ. ఉండే విధంగా నాటాలి. చదరపు మీటర్‌కు 16 మొక్కలు పడతాయి. మొక్క బతుకుతుందో.. లేదో అనుకుంటే ఒక్కో చోట 2 మొక్కలు నాటవచ్చు. జంబు చేసిన పొలంలో మార్కర్‌ను ఉపయోగించి నాటాలి. వరిలో ప్రతి 2 మీటర్లకు 200 సెంమీ వెడల్పుతో కాలి బాటలను వదలాలి. వరి మొక్కలను పైపైన వేర్లు ఉండే విధంగా నాటాలి. నాటు వేయడానికి ఎకరానికి 10 మంది కూలీలు అవసరమవుతారు.
కలుపు, నీటి యాజమాన్యం
శ్రీ పద్ధతిలో నీరు ఎక్కువగా నిల్వ ఉండకపోవడం వల్ల కలుపు ఎక్కువగా ఉంటుంది. కలుపును చేతితో తీయడానికి బదులు దానిని భూమిలోకి కలిపి వేసేలా, కోనోవీడర్ పరికరాన్ని ఉపయోగించాలి. కలుపు పచ్చిరొట్టలా పనికొస్తుంది. నాటు వేసిన 10 రోజులకు మొదటి కలుపు తీయాలి. తర్వాత 10 రోజులకు ఒకసారి చొప్పున 5 సార్ల వరకు తీయాలి. పం టలో రెండు వైపులా వీడర్ నడిపితే కలుపు సమస్య చాల వరకు పరిష్కారమవుతుంది. ఇలా కలుపు తీయడం వల్ల వరి మొక్కల వేర్లు గాలి పోసుకుని బలంగా పెరుగుతాయి. పిలకలు బాగా పెడతాయి. భూమి, వాతావరణాన్ని బట్టి ఎన్ని రోజులకు ఒక తడి ఇవ్వాలో రైతులు నిర్ణయించుకోవాలి. ఒక రోజు ముందు పలుచగా నీరు పెట్టి వీడర్ నడపాలి. వరి పంట పొట్టదశకు వచ్చి నప్పటి నుంచి ఒక అంగుళం మేర నీరు నిలబెట్టాలి. గింజ 70 శాతం గట్టిపడే వరకు పొ లంలో నీరు పెట్టి ఆ తర్వాత తీసివేయాలి.
పురుగులు, తెగుళ్ల యాజమాన్యం
ఈ పద్ధతిలో పురుగులు, తెగుళ్ల బెడద సహజంగా తక్కువగా ఉంటుంది. ముందుజాగ్రత్తగా వరి నాటిన 10 రోజులకు నీమాస్త్రం, 30 రోజులకు బ్రహ్మాస్త్రం, 45 రోజులకు అగ్నిస్త్రం పిచికారి చేయడం వల్ల అన్ని రకాల పురుగులను నివారించొచ్చు. రసాయన ఎరువులు, కలుపు మందులు, పురుగుమందులు ఏవీ వాడరాదు.
Comments
Please login to add a commentAdd a comment