Health Tips: 6 Essential Nutrients And Why Your Body Needs Them - Sakshi
Sakshi News home page

మీరు తినే ఆహారంలో పోషకాలెన్ని? విష రసాయన అవశేషాలతో భద్రం!

Published Sun, Oct 16 2022 10:14 AM | Last Updated on Sun, Oct 16 2022 4:06 PM

6 Essential Nutrients and Why Your Body Needs Them - Sakshi

ఆహారమే ఔషధం అనే రోజులు పోయి, ఆహారమే రోగకారకమైన రోజులు వచ్చాయి.  ఆహారం కంటి నిండా, చేతి నిండా, గోదాముల నిండా వుంది. కానీ, అందులో పోషకాలు మాత్రం అంతకంతకూ అడుగంటి పోతున్నాయి. అరకొర పోషకాలతో పాటు విష రసాయన అవశేషాలు అదనం.

వెరసి, ఇప్పుడు మనకు అన్ని విధాలా అనారోగ్యకారకమైన ఆహారం అత్యాధునిక రూపాల్లో పుష్కలంగా అందుబాటులో వుంది! ఏదో ఒక ఆహారం పండిస్తే చాలు ఆకలి తీరుతుంది అనుకున్నాం. ఎక్కువ దిగుబడి తెస్తే చాలనుకుంటూ బోల్తా పడ్డాం.  వినాశకర సేద్యంతో భూముల్ని సర్వ నాశనం చేసుకున్నాం. 

జీవం లేని ఆ నేలల్లో పండించుకుంటున్న అరకొర పోషకాల కెమికల్‌ తిండితో  ఇదే ప్రాప్తమనుకొని సరిపెట్టుకుంటున్నాం.  ఆహారంలో 18 పోషకాలు ఉన్నాయని ఐరాసకు చెందిన  ఆహార, వ్యవసాయ సంస్థ చెబుతోంది. అయితే, రసాయన వ్యవసాయంలో పండించిన పంటలో పోషకాల సాంద్రత, సమతుల్యత లోపించి ప్రజలు రోగాల పాలవుతున్నారు. క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు, ఆటో ఇమ్యూన్‌ డిసీజెస్‌ వంటి రోగాల పంట పండించుకొని తింటున్నాం. కొని తెచ్చుకొని జీవితాంతం నెత్తిన మోస్తున్నాం. 

ఈ విపత్కర ఆహార ఆరోగ్య పర్యావరణ విధ్వంసక దుస్థితి నుంచి బయటపడే మార్గం ఉందా? 
సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని తిరిగి అందరికీ అందుబాటులోకి తెచ్చుకోగలమా? 

ఈ ప్రశ్నలన్నిటికీ ‘అవును. ప్రకృతి వ్యవసాయంతో ఇది ముమ్మాటికీ సాధ్యమే! ఇంకా చెయ్యి దాటిపోలేదంటూ’ శుభవార్త చెబుతున్నారు నిపుణులు.
ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆహారోత్పత్తుల్లో 50కి పైగా పోషకాలు వుంటాయని, రసాయనాలతో పండించిన ఆహారంలో కన్నా ఈ సహజాహారంలో పోషకాల సాంద్రత రెండు రెట్లు ఎక్కువగా వుంటుందని సూచిస్తున్నారు. 
∙∙ 
ప్రపంచ జనాభా 798 కోట్లు. ప్రజలందరికీ అవసరమైన దానికన్నా ఎక్కువగానే ఇప్పుడు తిండి గింజలు పండించుకుంటున్నాం. గోదాములు కిటకిటలాడుతున్నాయి. ఆ మేరకు ఆహార భద్రత వుంది. అయితే పేదరికం వల్ల అందరికీ ఆహారం అందటం లేదు. దాదాపు 310 కోట్ల మందికి నాణ్యమైన ఆహారం తినే ఆర్థిక స్థోమత లేదు. మరో 82.8 కోట్ల మంది నిరుపేదలు అనుదినం అర్ధాకలితో ఈసురో మంటున్నారు.  

సామాజిక, ఆర్థిక అసమానతలతో సతమతం అవుతున్న వీరి సంగతి అటుంచితే, పుష్కలంగా ఆహారం తింటున్నప్పటికీ ఆహార సంబంధమైన జబ్బుల పాలవుతున్నవారు చాలామంది వున్నారు. ఈ సమస్యనే ‘హిడెన్‌ హంగర్‌’ అంటారు. ‘హిడెన్‌ హంగర్‌’ మూలంగా 200 కోట్ల మంది క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు, ఆటో ఇమ్యూన్‌ డీసీజెస్‌ వంటి ప్రాణాంతక జబ్బుల పాలవుతున్నారని ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌.ఏ.ఓ.) అంచనా. అంతేకాదు, ప్రతి 8 మందిలో ఒకరు స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఈ సమస్య ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోనూ అంతకంతకూ పెరుగుతోంది. 

గత ఏడు దశాబ్దాల్లో మన ఆహారంలో విటమిన్లు, పోషకాల సాంద్రత అడుగంటడమే ఇందుకు మూల కారణమని ఎఫ్‌.ఏ.ఓ. అధినేత క్యూ డోంగ్యు వాపోయారు. ఇప్పటి పండ్లు, కూరగాయలు, ధాన్యాలు దశాబ్దాల క్రితం పెరిగిన వాటి కంటే తక్కువ ప్రోటీన్, కాల్షియం, భాస్వరం, ఇనుము, రిబోఫ్లావిన్, విటమిన్‌ సి కలిగి ఉన్నాయని అనేక శాస్త్రీయ అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి.
అందువల్ల, మనం తింటున్న ఆహారంలో ఆరోగ్యం ఎంత? పోషకాల సాంద్రత ఎంత? అన్నవే ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఇప్పుడు చర్చనీయాంశాలయ్యాయి.  


అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా?
అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు. ఇది పూర్వకాలపు మాట. ఇప్పటి ఆహారంలో క్యాలరీలు ఉంటున్నాయి గానీ పోషకాల సాంద్రత, సమతుల్యత లోపించాయి. ఇప్పటికి ఆకలి తీర్చుతూనే మనల్ని రోగగ్రస్తులుగా మారుస్తోంది. ప్రసిద్ధ సాయిల్‌ ఎకాలజిస్ట్‌ డాక్టర్‌ క్రిస్టీన్‌ జోన్స్‌ (ఆస్ట్రేలియా) చెప్తున్నదేమంటే, 1940లో తిండి పదార్థాల్లో వున్నన్ని పోషకాలు ఇప్పుడు మనం పొందాలంటే మాంసం అయితే ఎప్పటికన్నా రెట్టింపు తినాలి. పండ్లయితే మూడింతలు, కూరగాయలైతే ఏకంగా నాలుగైదు రెట్లు తినాల్సిన దుస్థితి నెలకొంది.  

అమెరికాలోని ఫిలడెల్ఫియాలో రొడేల్‌ ఇన్‌స్టిట్యూట్‌ 70 ఏళ్లుగా సేంద్రియ, రసాయన సేద్యం, ఆహారంలో వస్తున్న మార్పులపై తులనాత్మక పరిశోధన చేస్తోంది. ‘పారిశ్రామిక వ్యవసాయం ప్రపంచవ్యాప్తంగా నేలలను క్షీణింపజేసింది. సంకుచిత దృష్టితో దిగుబడుల పెంపుదల గురించి మాత్రమే సాగు చేస్తున్నారు. పోషకాలపై దృష్టి లేదు. ఈ రోజు మనం తినే ఆహారంలో అర్ధ శతాబ్దం క్రితం పండించిన ఆహారం కంటే తక్కువ ప్రోటీన్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, రిబోఫ్లావిన్, విటమిన్‌–సి ఉన్నాయ’ని రొడేల్‌ ఇన్‌స్టిట్యూట్‌ పేర్కొంది.

మనుషులు 1950కు ముందు కన్నా ఇప్పుడు దీర్ఘకాలం జీవిస్తున్నారు, అయితే ఆహారంలో పోషకాల సాంద్రత బాగా తగ్గిపోవటంతో జీవన నాణ్యత తగ్గిపోయింది. క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు, ఆటో ఇమ్యూన్‌ డీసీజెస్‌ వంటి జబ్బులు పెచ్చరిల్లటానికి రసాయనిక పురుగుమందుల అవశేషాలతో పాటు పోషకాల సాంద్రత తగ్గిపోవటం కూడా ఓ ముఖ్య కారణం. ఈ జబ్బులతో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 71% మంది ప్రాణాలు కోల్పోతున్నారు అని పేర్కొంది రొడేల్‌ ఇన్‌స్టిట్యూట్‌ కార్యనిర్వాహక సంచాలకుడు జాన్‌ మేయర్‌ అన్నారు.


ఆహారం రోగ కారకంగా ఎలా మారింది?
ఆహార సమస్య మూలాలను అర్థం చేసుకోవాలంటే భూమి లోపలికి తొంగి చూడాల్సిందే. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ భూముల్లోకి రసాయనిక ఎరువులు, పురుగు/ తెగుళ్లు/ కలుపు మందులు వచ్చి చేరాయి. అవి ఆహారం గుణగణాలను, స్వరూప స్వభావాలను గుణాత్మకంగా మార్చేశాయి. పంట భూములను విష రసాయనాలతో నింపేయటం మొదలు పెట్టిన తర్వాత మట్టిలో సహజ సేంద్రియ పోషక వ్యవస్థ నాశనమవ్వటం ప్రారంభమైంది.

నేల ఉత్పాదక శక్తిని కోల్పోయింది. మొక్కలకు, తద్వారా మన ఆహారానికి పోషకాలు అందించే శిలీంద్రాలు, సూక్ష్మజీవులు, వానపాములు సహా జీవ పర్యావరణ వ్యవస్థ అంతా నిర్జీవం అయిపోయింది. సహజసిద్ధంగా పోషకాలు పంటలకు అందే మార్గం బాగా పరిమితం అయిపోయింది. రసాయనిక వ్యవసాయం చేసే భూముల్లో మట్టి గట్టి పడిపోతుంది.

పంట మొక్కల వేర్లు 10–20 సెంటీమీటర్ల వరకే చొచ్చుకు వెళ్ళ గలుగుతాయి. ఆ మేరకు పోషకాల లభ్యత కూడా తగ్గిపోతుంది. రసాయనిక ఎరువుల ద్వారా నత్రజని, భాస్వరం, పొటాష్‌తో పాటు అతికొద్ది రకాల పోషకాలను మాత్రమే అందిస్తుండటంతో.. ఆ పొలాల్లో పండిన పంట దిగుబడుల్లో పోషకాల సమగ్రత లోపించింది.    

ప్రాకృతిక పుష్కలత్వం నుంచి రసాయనిక పరిమితత్వంలోకి వ్యవసాయం దిగజారిపోయింది. ఈ పరిణామమే మన ఆహారాన్ని అతికొద్ది రకాల పోషకాలకే పరిమితం చేసేసింది. ఆలా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కాలంలో మన ఆహారం ‘అరకొర పోషకాల’తో పోషకాల సమగ్రత, సమతుల్యతను కోల్పోయింది. మూలిగే నక్క మీద తాటి పండు మాదిరిగా రసాయనాల అవశేషాలు కూడా తోడవటంతో.. అమృతాహారం ‘రోగకారక ఆహారం’గా మారిపాయింది.      

ఎఫ్‌.ఏ.ఓ. సమాచారం ప్రకారం.. ప్రకృతిలో 92 రసాయన మూలకాలు ఉంటాయి. మొక్కలకు భూమి నుంచి 15 (6 స్థూల, 9 సూక్ష్మపోషకాలు) అందుతున్నాయి. మరో మూడింటిని మొక్కలు వాతావరణం నుంచి గ్రహిస్తున్నాయని ఎఫ్‌.ఏ.ఓ. చెబుతోంది. గత 70 ఏళ్లలో ఆహారంలో విటమిన్లు, పోషకాల సాంద్రత బాగా తగ్గిందని కూడా సెలవిచ్చింది. 

సహజాహారంలో 50+ పోషకాలు  
అడవిలో లేదా ప్రకృతి వ్యవసాయం ద్వారా పునరుజ్జీవింపజేసిన భూముల్లో పండించిన ఆహారోత్పత్తుల్లో రసాయనిక సేద్యంలో పండించిన ఆహారంలో కన్నా పోషకాల సాంద్రత రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని ఆస్ట్రేలియాకు చెందిన ప్రసిద్ధ సాయిల్‌ మైక్రోబయాలజిస్ట్, రీజెనెరేటివ్‌ అగ్రికల్చర్‌ నిపుణుడు డాక్టర్‌ వాల్టర్‌ ‘సాక్షి’కి ఇచ్చిన జూమ్‌ ఇంటర్వ్యూలో తెలిపారు. రసాయన వ్యవసాయ భూమి బండబారి ఉంటుందని, సీజనల్‌ పంట మొక్కల వేర్లు 10–20 సెంటీమీటర్ల కన్నా లోతుకు వెళ్ళలేవని అన్నారు. 

ప్రకృతి వ్యవసాయ భూముల్లో పంటల వేర్లు 2 మీటర్ల వరకూ చొచ్చుకు వెళ్లగలవు. ఆ మేరకు పోషకాల సాంద్రతతో పాటు ఉత్పాదకత కూడా పెరుగుతాయి. ఈ ఆహారంలో సుమారు 50కి పైగా పోషకాలు ఉంటాయి. చాలా సూక్ష్మపోషకాలు అతి తక్కువ పాళ్లలోనే ఉన్నప్పటికీ.. పోషకాల సమతుల్యత, సమగ్రతలో ఇవి చాలా కీలకం అన్నారాయన.

ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆహారంలో వున్న పోషకాలలో మూడింట ఒక వంతు కన్నా తక్కువ పోషకాలు మాత్రమే రసాయన వ్యసాయంలో పండించిన ఆహారంలో వుంటాయని పరిశోధనల్లో తేలిందన్నారు డాక్టర్‌ వాల్టర్‌.  రసాయనాలు వేయని ప్రకృతి వ్యవసాయ భూమిలో సేంద్రియ కర్బన నిల్వలతో కూడిన వ్యవస్థ (సాయిల్‌ ఆర్గానిక్‌ స్పాంజ్‌) ఏర్పడుతుంది. సహజ పోషక పునర్వినియోగ చక్రం పునరుద్ధరణకు ఇదే మూలం. 98% పోషకాలు దీని ద్వారానే పంట మొక్కలకు అందుతాయి. 


శిలీంద్రాలు, సూక్ష్మజీవుల పాత్ర కీలకం 
ఆహారంలో పోషకాల సాంద్రత ఒక్కటే కాదు.. ఆ పోషకాలు తగిన నిష్పత్తిలో సమతుల్యంగా ఉండటం అతి ముఖ్యమైన విషయం. ఏయే పోషకాన్ని ఎంత నిష్పత్తిలో స్వీకరించాలో ఎంపిక చేసుకునే సెలెక్టివ్‌ మెకానిజం సజీవమైన భూమిలో శిలీంద్రాలు, సూక్ష్మజీవుల వ్యవస్థకు ఉంటుంది. శిలీంద్రపు పోగులు తమ ఆహారపు అవసరాల కోసం చేసే ఈ పని వల్ల మొక్కల వేర్లకు కూడా పోషకాలు సమతుల్యంగా అందుతాయి. 

సాధారణంగా మట్టిలో వుండే ముడి పోషకాలను నేరుగా మొక్కల వేర్లు తీసుకోలేవు. అందుకే వీటి రూపం మార్చి వేర్లకు అందించేందుకు ప్రకృతిలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటైంది. సకల పోషకాలను అందించే ఈ పని మైకోరైజా వంటి ఇంటెలిజెంట్‌ శిలీంద్రాలకు, అశేష సూక్ష్మజీవ రాశి, వానపాములకి ప్రకృతి అప్పగించింది.

చదరపు మీటరుకు 25 వేల కిలోమీటర్ల పొడవున విస్తరించి వుండే శిలీంద్రపు పోగులు, సూక్ష్మజీవులు, వానపాములు ఈ బృహత్‌ కార్యం చేస్తూ ఉంటాయి. ఈ సహజ జీవరసాయన ప్రక్రియల ద్వారా మొక్కల వేర్లకు సకల పోషకాలు అందుతాయి. శిలీంద్రాలు, సూక్ష్మజీవరాశులు చేసే ఈ సేవకు మొక్కలు ప్రతిసేవ చేస్తాయి.

మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తాము తయారుచేసుకున్న పోషక ద్రవం (సుగర్స్‌)లో నుంచి 30–40 శాతాన్ని వేర్ల ద్వారా మట్టిలోకి జారవిడుస్తూ ఉంటాయి. ఈ సుగర్స్‌ను సూక్ష్మజీవులు, శిలీంద్రాలు తీసుకుంటూ మనుగడ సాగిస్తాయి. ఈ సుగర్స్‌ను ‘రూట్‌ ఎక్సుడేట్స్‌’ అంటారు. మొక్కలు తయారు చేసుకునే పోషక ద్రవాహారంలో ఇంకో 30% కాండం, ఆకులు, గింజలు, కాయలు, పూల పెరుగుదలకు.. మిగతా 30%ని వేరు వ్యవస్థ పెరుగుదలకు చెట్లు, మొక్కలు ఉపయోగిస్తాయి. 

మన ఆహారంలోనూ తగ్గుతున్న పోషకాలు 
సీఎస్‌ఏ అధ్యయనంలో వెల్లడి   
ఆహారోత్పత్తుల్లో పోషకాల సాంద్రత బాగా తగ్గటం, సాగు భూములు నిస్సారం కావడానికి మధ్య సంబంధం వుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామమే మన దేశంలో కూడా జరుగుతున్నట్లు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సుస్థిర వ్యవసాయ కేంద్రం నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది.

మన దేశంలో ఆహారోత్పత్తుల్లో పోషకాలపై జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌.ఐ.ఎన్‌.) 1987, 2017 సంవత్సరాల్లో వెలువరించిన ఇండియన్‌ ఫుడ్‌ కంపోజిషన్‌ టేబుల్స్‌ ఆధారంగా ప్రధానంగా ఈ అధ్యయనం చేశారు. ఈ 30 ఏళ్ళ కాలంలో శక్తి, రిబోఫ్లావిన్, నియాసిన్‌ భారీగా తగ్గాయి. కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, ప్రోటీన్, థయామిన్‌ తదితర పోషకాల్లో కూడా తగ్గుదల కనిపించింది.

వ్యవసాయంలో రసాయనాల వాడకం వల్ల ఆహారంలో పోషకాలు తగ్గుతున్న సంగతిని గుర్తించి పాలకులు, పరిశోధన సంస్థలు విధానాల రూపకల్పనలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డా. జీవీ రామాంజనేయులు అన్నారు. ఈ అధ్యయనం వివరాలు ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌లో ప్రచురితం అయ్యాయి. 

జన్యుమార్పిడితో పోషకాల సమతుల్యతకు భంగం  

రెండో ప్రపంచ యుద్ధానికి ముందు స్థాయితో పోల్చితే ఆహారంలో ఇప్పుడు మూడో వంతు పోషకాలు మాత్రమే మిగిలాయి. జన్యుమార్పిడి వంటి టెక్నాలజీల ద్వారా ఎక్కువ ఇనుము, మాంగనీస్‌ వాటి పోషకాలను టొమాటోల్లోకి జొప్పించటం వల్ల ప్రయోజనం ఉండదు. అందులో పోషకాల సమతుల్యతకు భంగం కలగవచ్చు.

కాబట్టి మనుషుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించటానికి ఇది సహాయం చేయదు. సమస్యలకు దగ్గరి దారిలో పరిష్కారం వెతికే క్రమంలో సహజ సమతుల్యతలకు భంగం కలిగిస్తున్నాం. ఆ క్రమంలో మరిన్ని సమస్యలను సృష్టిస్తున్నామని మనం గుర్తించాలి. బియ్యానికి అదనపు ఇనుము జోడించి గోల్డెన్‌ రైస్‌ తయారు చేస్తున్నారు. ఈ విధంగా అదనపు పోషకాలను కృత్రిమంగా జోడించడం వలన సహజ ఆహారంలో మాదిరిగా పోషకాల సమగ్రతను గానీ, పోషకాల మధ్య కూర్పును గానీ, సమతుల్యతను గానీ సాధించలేం.

ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ ద్వారా చాలా సమయాన్ని, చాలా శ్రమను వృథా చేసుకుంటున్నాం. ఈ శక్తి యుక్తులను ప్రకృతి వ్యవసాయాన్ని సర్వవ్యాప్తం చేసే దిశగా ఖర్చు చేయటం మేలు.  ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయ, రసాయనిక వ్యవసాయాల ద్వారా పండించిన ఆహారోత్పత్తుల మధ్య వ్యత్యాసాన్ని అంచనా వేసేటప్పుడు వాటి బరువును బట్టి కాకుండా వాటి పోషకాల సమగ్రతను, వాటి ఆరోగ్యపరమైన విలువను గుర్తించాలి. మనం తినే ఆహారంలోని పోషకాల సమగ్రతపైనే మన దేహంలో జరిగే జీవ రసాయన ప్రక్రియలు, రోగ నిరోధక శక్తి 90 శాతం వరకూ ఆధారపడి ఉంటుంది.
– డాక్టర్‌ వాల్టర్‌ యన, ప్రసిద్ధ సాయిల్‌ మైక్రోబయాలజిస్ట్, 
రీజెనరేటివ్‌ అగ్రికల్చర్‌ నిపుణుడు, ఆస్ట్రేలియా  

ఔషధ గుణాలు ఎలా వచ్చాయి?
సహజ ఆహారానికి ఔషధ గుణాలు ఎలా వస్తాయి అనేది ఆసక్తికరమైన ప్రశ్న. ప్రకృతిసిద్ధంగా పెరిగే పంటల ఆహారంలో ఏయే పోషకాలు ఏయే నిష్పత్తిలో ఉండాలో ఎంపిక చేసే ఇంటెలిజెంట్‌ శిలీంద్ర వ్యవస్థ ఉంటుందని తెలుసుకున్నాం కదా! చాలా ముఖ్యమైన ఇంకో విషయం ఏమిటంటే, మట్టిలో నుంచి పోషకాలను సమతుల్యంగా ఎంపిక చేసి సంగ్రహించటంతో పాటు (అల్యూమినియం, లెడ్‌ వంటి హెవీ మెటల్స్‌) హానికరమైన విషతుల్యాలను గుర్తించి పక్కనపెట్టేసే విజ్ఞతతో కూడిన నాణ్యత నియంత్రణ శక్తి కూడా శిలీంద్ర వ్యవస్థకు ఉంది.

ఈ కారణంగానే పూర్తిగా సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించినప్పుడు ఆ ఆహారం పోషకాల సాంద్రత, సమగ్రత, సమతుల్యతలతో పాటు ఔషధ గుణాలనూ కలిగి సంతరించుకుంటుంది. ఈ ఆహారంలో క్యాన్సర్‌ కణాలను మట్టుబెట్టే సెలీనియం ఉంటుంది. అందుకే ఆర్గానిక్‌ ఆహారాన్ని ‘డిసీజ్‌ ప్రివెంటెటివ్‌ ఫుడ్‌’ అని వ్యవహరిస్తున్నారు.    
సాగు భూముల్లో సేంద్రియ కర్బనం 0.5%–03%కి తగ్గిపోయింది. ఇప్పటికే 33% వ్యవసాయ భూమి వ్యవసాయ యోగ్యం కాకుండా పోయింది. దీనికి మూలం రసాయనిక సేద్యమే. పాలకులు, ప్రజలు ఇప్పటికైనా మేల్కొని భూముల్ని పునరుజ్జీవింపజేసే ప్రకృతి సేద్యం వైపు మళ్లితే ఆహారం పోషకాల సాంద్రతను, సమతుల్యతను మళ్ళీ సంతరించుకుంటుంది. పనిలో పనిగా భూతాపోన్నతిని కూడా గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 60% మంది ప్రజలు ఇంకా గ్రామాల్లో నివసించే భారత్‌ వంటి దేశాలకు పునరుజ్జీవ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లటం సులభమని డాక్టర్‌ వాల్టర్‌ అంటున్నారు. 

ప్రకృతి వ్యవసాయాన్ని అనుభవం వున్న రైతుల ద్వారా మిగతా రైతులకు నేర్పించటంలో ఆంధ్రప్రదేశ్‌ అద్భుత ప్రగతి సాధిస్తోంది. కొన్నేళ్లలోనే రాష్ట్రంలో పొలాలన్నీ ప్రకృతి సేద్యంలోకి మారిపోయి పోషకాల సాంద్రతతో కూడిన అమృతాహారాన్ని ప్రజలకు అందించే సుదినం రానుంది. పోషకాల సాంద్రత, సమగ్రత సాధన కృషిలో దేశీ వంగడాలు, సిరిధాన్యాలకున్న ప్రాధాన్యాన్ని కూడా గుర్తించటం అవసరం.         

పర్యావరణ అనుకూల వ్యవసాయ, పోషకాహార, ఆరోగ్య గొలుసును పునర్నిర్మించుకోవటానికి ‘ప్రకృతిని తిరిగి తలదాల్చటం’ తప్ప ఏ ఇతర ఖరీదైన అత్యాధునిక ఉపకరణలూ, టెక్నాలజీలూ  అక్కరలేదని కూడా అనుభవాలు తెలియజెపుతున్నాయి. ‘ప్రపంచ ఆహార దినోత్సవం’ సందర్భంగా మన భూముల్ని, మన ఆహారారోగ్యాలను తిరిగి సుసంపన్న  పోషకవంతంగా మార్చుకోవటానికి పునరంకితమవుదాం.
– పంతంగి రాంబాబు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement