కొర్రలు.. సామలు.. అండుకొర్రలు.. అరికెలు.. ఊదలు.. వరిగ.. ఈ పేర్లు ఒకప్పుడు ప్రతి ఇంట్లో వినిపించినా, కొన్నేళ్ల క్రితం కనుమరుగయ్యాయి. ఆధునిక జీవనశైలితో ఈ పంటలు ఎక్కడో కానీ కనిపించని పరిస్థితి. ఉరుకులు పరుగుల జీవితంలో వ్యాధులు చుట్టుముట్టడంతో జీవితం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
మారిన వాతావరణం, పరిస్థితుల్లో ఆరోగ్యం, ఆహార అలవాట్లపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో సంప్రదాయ పంటలకు ఇప్పుడిప్పుడే ప్రాధాన్యత పెరుగుతోంది. అనారోగ్య సమస్యలను అడ్డుకునేందుకు సరిధాన్యాల వాడకం అధికమవుతోంది. ప్రభుత్వం కూడా సాగును ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తుండటం విశేషం.
2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్ ఇయర్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మిల్లెట్ సాగుకు ప్రోత్సాహం, చిరుధాన్యాల వినియోగాన్ని పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించడం విశేషం. అందులో భాగంగా గత ఏడాది ఖరీఫ్‌లో 7,012 ఎకరాల్లో చిరుధాన్యాల పంటలు సాగయ్యాయి. 2023 ఖరీఫ్‌లో చిరుధాన్యాల సాగు 21,825 ఎకరాలకు పెరిగినట్లు తెలుస్తోంది. ధర లేనప్పుడు రైతులు నష్టపోకుండా ప్రభుత్వం మద్దతు ధర కూడా నిర్ణయిస్తోంది. సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేస్తోంది. రాయితీతో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. పదేళ్ల క్రితం చిరుధాన్యాల వినియోగం 10 శాతం వరకు ఉండగా.. మారుతున్న పరిస్థితులతో వీటి వినియోగం 40–50 శాతం పైగా పెరిగింది.
చిరుధాన్యాల సాగుకు చేయూత
∙ ఆహార, పోషక భద్రత(ఫుడ్ అండ్ న్యూట్రీషియన్ సెక్యూరిటీ) కింద కొర్ర, సజ్జ, జొన్న, వరిగ సాగును ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 3,450 ఎకరాలకు ప్రభుత్వం రూ.82.80 లక్షల విలువైన ఇన్‌పుట్స్ సరఫరా చేస్తోంది.
∙ రూ.1.25 లక్షల సబ్సిడీతో ఏడు మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటికి అదనంగా వర్షాధార ప్రాంత అభివృద్ధి కింద రూ.2 లక్షల సబ్సిడీతో దాదాపు 15 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే కర్నూలు, నంద్యాల తదితర ప్రాంతాల్లో ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు కావడం విశేషం. షాపింగ్ మాల్స్ సిరిధ్యాన్యాలను ప్రత్యేకంగా విక్రయిస్తున్నాయి. వరి బియ్యంతో పోలిస్తే మిల్లెట్ రైస్ ధరలు కూడా ఎక్కువే. కిలో అండుకొర్రల(వాక్యుమ్ ప్యాకింగ్) ధర రూ.289 పలుకుతోంది.
మిల్లెట్ కేఫ్‌కు విశేష స్పందన
సిరిధాన్యాలు పోషకాలను అందించడమే కాకుండా రోగ కారకాలను శరీరంలో నుంచి తొలగించి దేహాన్ని శుద్ధి చేస్తాయి. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ విత్తన రైతు సేవా సంఘం ఏర్పాటు చేసిన మిల్లెట్ కేప్‌కు విశేషమైన స్పందన లభిస్తోంది. రోజు 160 మందికిపైగా మిల్లెట్ కేఫ్‌ను సందర్శిస్తున్నారు. ఇక్కడ చిరుధాన్యాల అన్నం, మిక్చర్, మురుకులు, లడ్డు, బిస్కెట్లు, చిరుధాన్యాల ఇడ్లీరవ్వ లభిస్తాయి. చిరుధాన్యాల బ్రెడ్‌కు ప్రత్యేక ఆదరణ ఉంటోంది.
సిరిధాన్యాల విశిష్టత
తక్కువ నీటితో రసాయన ఎరువులు, పురుగుమందుల అవసరం లేకుండా పండగలిగిన అత్యుత్తమ పోషక విలువలు కలిగిన పంటలు సిరిధాన్యాలు. మూడుపూటలా తిన్నప్పుడు, ఆ రోజుకు మనిషికి అవసరమైన పీచుపదార్థం ( ప్రతి ఒక్కరికి రోజుకు 38 గ్రాముల పీచుపదార్థం కావాలి) ఈ ధాన్యాల నుంచే లభిస్తుంది. తక్కిన 10 గ్రాములు కూరగాయలు, ఆకు కూరల నుంచి పొందవచ్చు.
25 ఎకరాల్లో చిరుధాన్యాల సాగు
చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ విత్తన రైతు సేవా సంఘాన్ని ఏర్పాటు చేశాం. కొర్రలు, సామలు, ఊదలు, అరికలు, అండుకొర్రలు 25 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసు చేసున్నాం. పంటను ఆంధ్రప్రదేశ్ విత్తన రైతు సేవా సంఘం ద్వారా కొనుగోలు చేస్తాం. ఇప్పటికి చిరుధాన్యాల ప్రాసెసింగ్ సెంటర్ కూడ ఏర్పాటు చేశాం. కలెక్టరేట్ ప్రాంగణంలో మిల్లెట్ కేఫ్ కూడా నిర్వహిస్తున్నాం.
– వేణుబాబు, చిరుధాన్యాల రైతు
బీపీ, షుగర్ తగ్గాయి
నాకు 79 ఏళ్లు. గతంలో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. బీపీ, షుగర్ కూడా ఉండింది. బరువు 65 కిలోలు. ఏడాదిన్నరగా కేవలం సిరిధాన్యాలైన సామలు, అరికలు, అప్పుడప్పుడు ఊదల ఆహారం తీసుకుంటున్నా. వీటికి తోడు జొన్న రొట్టె తింటున్నా. ప్రస్తుతం ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. బీపీ, షుగర్ కంట్రోల్‌లో ఉన్నాయి.
– పిచ్చిరెడ్డి, విశ్రాంత ఏడీఏ,
వెంకటరమణ కాలనీ, కర్నూలు
చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నాం
రాష్ట్ర ప్రభుత్వం చిరుధాన్యాలకు మద్దతు ధర ప్రకటించింది. ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. ఈ పంటల సాగులో పెట్టుబడి వ్యయం తక్కువగా ఉంటుంది. రసాయన ఎరువులు వాడాల్సిన అవసరం ఉండదు. డయాబెటిస్ తదితర వ్యాధులకు చిరుధాన్యల ఆహారం దివ్య ఔషధం. గతంతో పోలిస్తే ఈ ఏడాది మిల్లెట్ సాగు భారీగా పెరుగుతోంది.
– పీఎల్ వరలక్ష్మి, డీఏఓ, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment