తెలుగు రాష్ట్రాలు వేగంగా మిల్లెట్స్ గొడుగు కిందకు చేరుతున్నాయి. ఇది అన్ని ట్రెండ్స్‌లా ఇలాగ వచ్చి అలాగ వెళ్లిపోరాదు.ఎన్నో వసంతాల పాటు మనతో పాటు చిగురించాలి. మిల్లెట్స్ ఆహారంలో భాగమవుతున్నంత వేగంగా కనుమరుగయ్యే ప్రమాదమూ ఉంది.
ఎందుకంటే మనం మిల్లెట్స్ వాడకంలో చూపిస్తున్న అత్యుత్సాహం వాటిని అర్థం చేసుకోవడంలో చూపించడం లేదంటున్నారు ఇక్రిశాట్‌లో అగ్రానమిస్ట్‌గా ఉద్యోగవిరమణ చేసి, హైదరాబాద్, బోయిన్‌పల్లి, ఇక్రిశాట్ కాలనీలో విశ్రాంత జీవనం గడుపుతున్నసీనియర్ సైంటిస్ట్ మేకా రామ్మోహన్ రావు.
ఇదీ నా పరిచయం!
మాది కృష్ణాజిల్లా, పాగోలు గ్రామం పరిధిలోని మేకావారి పాలెం. బాపట్ల అగ్రికల్చరల్ కాలేజ్‌లో ఏజీ బీఎస్సీ. హైదరాబాద్, రాజేంద్రనగర్‌లోని ఆచార్య ఎన్‌జీ రంగా (ఇప్పుడది ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ) అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ. ఢిల్లీలోని ఐఏఆర్‌ఐ (ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్)లో వ్యవసాయ పద్ధతుల మీద పరిశోధన చేశాను. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఇక్రిశాట్‌లో ఒకడినయ్యాను.
ఒక మోస్తరు వ్యవసాయ కుటుంబం మాది. మా కుటుంబంలో తొలితరం విద్యావంతుడిని కావడంతో ఏ కోర్సులు చదివితే ఎలాంటి ఉన్నత స్థితికి చేరవచ్చని మార్గదర్శనం చేయగలిగిన వాళ్లెవరూ లేరు. ఢిల్లీకి వెళ్లి పీహెచ్‌డీ చేయడం కూడా మా ప్రొఫెసర్ గారి సూచనతోనే. మా నాన్న చెప్పిన మాట నాకిప్పటికీ గుర్తే. కాలేజ్ ఖర్చులు భరించి చదివించగలనంతే. డొనేషన్‌లు కట్టి చదివించాలని కోరుకోవద్దు’ అన్నారాయన.
ఆ మాట గుర్తు పెట్టుకుని విస్తరణకు ఉన్న అవకాశాలను వెతుక్కుంటూ సాగిపోయాను. నా ప్రాథమిక విద్య ఏ మాత్రం స్థిరంగా సాగలేదంటే నమ్ముతారా! ఐదవ తరగతి లోపు మూడుసార్లు స్కూళ్లు మారాను. హైస్కూల్ కూడా అంతే. చల్లపల్లి స్కూల్‌లో పన్నెండవ తరగతి వరకు చదివాను. జాతీయ పతాక ఆవిష్కర్త పింగళి వెంకయ్యగారు కూడా చల్లపల్లి స్కూల్‌లోనే చదివారు.
– మేకా రామ్మోహన్‌రావు,
సీనియర్ సైంటిస్ట్ (రిటైర్డ్), ఇక్రిశాట్
జ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకున్నాం!
‘‘ఇప్పుడు నేను చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం గురించి పని చేస్తున్నాను. కానీ నా అసలు వృత్తి చిరుధాన్యాల సాగు. పటాన్‌చెరులో మా పరిశోధన క్షేత్రం. మనదేశంలో వర్షాధార నేలలను సమర్థంగా సాగులోకి తీసుకురావడానికి మిల్లెట్స్ మీద విస్తృతంగా పరిశోధనలు చేశాను. ఆ తర్వాత కామెరూన్, బ్రెజిల్, నైజీరియా, కెన్యాల్లో పని చేశాను. ప్రధాన పంటతో పాటు అంతర పంటగా మిల్లెట్స్‌ను సాగు చేయడం, అలాగే మిశ్రమ సాగు విధానాన్ని వాళ్లకు అలవాటు చేశాం. మన మిల్లెట్స్‌ని ఆయా దేశాలకు పరిచయం చేశాం. ఆ దేశాలు సమర్థంగా అనుసరిస్తున్నాయి.
ఇన్ని దేశాలూ తిరిగి మన జ్ఞానాన్ని వాళ్లకు పంచి, వాళ్ల నుంచి నేర్చుకోవాల్సిన మెళకువలను మనదేశానికి తీసుకు వచ్చిన తర్వాత పరిశీలిస్తే... మనదేశంలో వ్యవసాయం సరికొత్త రూపు సంతరించుకుని ఉంది. ఒకప్పుడు పాడి–పంట కలగలిసి సమాంతరంగా సాగుతుండేవి. పంట సాగు చేసే రైతు ఇంట్లో పాడి కూడా ఉండేది. ఆ పశువుల ఎరువుతో సాగు చేసుకుంటూ అవసరానికి కొంత మేర పై నుంచి రసాయన ఎరువులను వాడేవాళ్లు. ఇప్పుడు పాడి రైతు వేరు, పంట రైతు వేరయ్యారు. దాంతో పంట సాగు ఆరోగ్యంగా లేదు, పాడి రైతు కూడా సౌకర్యంగా లేడు.
జరిగిన పొరపాటును సరి చేసుకోవడానికి సేంద్రియ సాగును వెనక్కి తెచ్చుకుంటున్నాం. అలాగే ఆహారంలో కూడా ఇప్పుడు మిల్లెట్స్ రూపంలో ఆరోగ్యాన్ని వెతుక్కుంటున్నాం. చిరుధాన్యాలు, వరిధాన్యం తగు పాళ్లలో తీసుకునే రోజుల నుంచి జొన్నలు, రాగులను పూర్తిగా మర్చిపోయాం. ఇప్పుడు చిరుధాన్యాల పరుగులో వరిధాన్యాన్ని వదిలేస్తున్నారు. మిల్లెట్ మెనూ ప్రాక్టీస్‌లో మనవాళ్లు చేస్తున్న పొరపాట్లు చూస్తుంటే వాటిని అలవాటు చేసుకున్న నెల రోజుల్లోనే మిల్లెట్స్‌కు దూరమైపోతారేమోననే ఆందోళన కూడా కలుగుతోంది. అందుకే అవగాహన కల్పించే బాధ్యతను నాకు చేతనైనంత చేస్తున్నాను.
టేబుల్ మార్చినంత సులువు కాదు!
పుట్టినప్పటి నుంచి కొన్ని దశాబ్దాలుగా అన్నం తినడానికి అలవాటు పడిన దేహాన్ని ఒక్కసారిగా మారమంటే సాధ్యం కాదు. మనం డైనింగ్ టేబుల్ మీద పదార్థాలను మార్చేసినంత సులువుగా మన జీర్ణవ్యవస్థ మారదు, మారలేదు కూడా. అందుకే మొదటగా రోజులో ఒక ఆహారంలో మాత్రమే మిల్లెట్స్ తీసుకోవాలి. జొన్న ఇడ్లీ లేదా రాగి ఇడ్లీతో మొదలు పెట్టాలి. ఒక పూట అన్నం తప్పకుండా తినాలి. రాత్రికి రొట్టె లేదా సంగటి రూపంలో మిల్లెట్స్ అలవాటు చేసుకుంటే ఈ తరహా జీవనశైలిని కలకాలం కొనసాగించడం సాధ్యమవుతుంది. దేహం మొదట మిల్లెట్స్‌ను అడాప్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత వాటిని అబ్జార్బ్ చేసుకోవడం మొదలవుతుంది.
దేహానికి ఆ టైమ్ కూడా ఇవ్వకుండా ఆవకాయతో అన్న్రప్రాశన చేసినట్లు మెనూ మొత్తం మార్చేస్తే ఓ నెల తర్వాత ఆ ఇంటి టేబుల్ మీద మిల్లెట్స్ మాయమవుతాయనడం లో సందేహం లేదు. మరో విషయం... వరి అన్నం తీసుకున్నంత మోతాదులో మిల్లెట్ ఆహారాన్ని తీసుకోకూడదు. పావు వంతుతో సరిపెట్టాలి. అలాగే అరవై దాటిన వాళ్లు జావ రూపంలో అలవాటు చేసుకోవాలి. సాయంత్రం మిల్లెట్ బిస్కట్‌లను తీసుకోవాలి. ఇక అనారోగ్యానికి గురయిన వాళ్లు తిరిగి కోలుకునే వరకు మిల్లెట్స్‌కి దూరంగా ఉండడమే మంచిది.
ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ కుష్వంత్ సింగ్ అనుభవాన్నే ఉదాహరిస్తాను. గట్టి ఆహారం తీసుకునే పంజాబీ కుటుంబంలో పుట్టిన ఆయన వార్ధక్యంలో ‘దక్షిణాది ఆహారం సులువుగా జీర్ణమవుతోందని, ఇడ్లీ, అన్నానికి మారినట్లు’ రాసుకున్నారు. మిల్లెట్స్ మనదేహానికి సమగ్రమైన ఆరోగ్యాన్ని చేకూరుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. నిదానంగా జీర్ణమవుతూ, నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తుంది. ఊబకాయం సమస్య ఉండదు. ఈ వివరాలన్నీ చెబుతూ మెనూతో పాటు మోతాదును కూడా గమనింపులో పెట్టుకోవాలని మహిళలకు వివరిస్తున్నాను.
వాళ్లకు చక్కగా అర్థమైతే చాలు, ఇక ఆ వంటగది నుంచి మిల్లెట్ ఎప్పటికీ దూరం కాదు’’ అన్నారు రామ్మోహన్‌రావు. రోజూ ఓ గంటసేపు నడక, పాలిష్ చేయని బియ్యంతో అన్నం, మిల్లెట్ బిస్కట్ తీసుకుంటారు. ‘మిల్లెట్స్‌తో ఎన్ని రకాల వంటలు చేసుకోవచ్చో వివరించడానికి కాలనీల్లో మిల్లెట్ మేళాలు నిర్వహిస్తుంటాం. కానీ నేను మాత్రం వాటిలో ఒక్క రకమే తింటాను’’ అన్నారాయన నవ్వుతూ.
– వాకా మంజులారెడ్డి,
ఫొటోలు : మోర్ల అనిల్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment