మిల్లెట్ డైట్.. ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతోంది. వీటిలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.ఇందులో పిండి పదార్థాలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఎన్నో వ్యాధులకి దివ్య ఔషధం అని చెప్పొచ్చు.విభిన్న రంగులు,రుచులు,రూపాల్లో ఇవి దొరుకుతాయి. ఇందులో ఫాస్పరస్, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటాయి. పురాతన కాలంలో వీటిని ఎక్కువగా వాడేవాళ్లు.. మళ్లీ సోషల్ మీడియా పుణ్యమా అని జనాలకు ఆరోగ్యంపై గత 3-4 ఏళ్లుగా మరింత శ్రద్ధ పెరిగింది. ఇప్పుడు హెల్తీ డైట్ అంటూ మిల్లెట్స్ అనేంతగా జనాల్లో ప్రాచుర్యం పొందింది.
చిరుధాన్యాలు.. సిరిధాన్యాలు.. చిన్న చిన్న విత్తనాలతో కూడిన గడ్డి జాతి పంటల సమూహానికి చెందిన పంటలే ఈ చిరుధాన్యాలు. మనుషుల ఆహార అవసరాలతో పాటు పశువులు, చిన్న జీవాలకు మేత కోసం వీటిని ప్రపంచం అంతటా పండిస్తారు. ఇవి చాలా ప్రాచీనమైన పంటలు. మన పూర్వీకులు మొట్టమొదటిగా సాగు చేసిన పంటలు చిరుధాన్యాలే.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కొద్దిపాటి వర్షాలకే పండే పంటలివి. వీటిని మొట్టమొదటగా భారత్‌లో సాగైన అనేక రకాల చిరుధాన్యాలు తదనంతరం పశ్చిమ ఆఫ్రికాతోపాటు చైనా, జపాన్ తదితర 130 దేశాలకు విస్తరించాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక నాగరికతల్లో ఆహార ధాన్యపు పంటలుగా విస్తరించాయి. ప్రాచీన సాహిత్యంలో కూడా వీటి ప్రస్తావన ఉంది. మన దేశంలో చిరుధాన్యాల వినియోగం కాంస్య యుగం కన్నా ముందు నుంచే ఉన్నదని చరిత్ర చెబుతోంది.
మిల్లెట్స్ రకాలు..
పోషకాల గనులైన చిరుధాన్యాలను ప్రాథమికంగా రెండు విధాలుగా విభజించ వచ్చు. జొన్నలు, సజ్జలు, రాగులు.. గింజలపై పొట్టు తియ్యాల్సిన అవసరం లేని పెద్ద గింజల పంటలు. మేజర్ మిల్లెట్స్. కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, ఒరిగలు, అండుకొర్రలు.. గింజలపై నుంచి పొట్టు తీసి వాడుకోవాల్సిన చిన్న గింజల పంటలు. మైనర్ మిల్లెట్స్. పొట్టు తీసి బియ్యం తయారు చేసుకోవాల్సి రావటం వల్ల మైనర్ మిల్లెట్స్ ప్రాసెసింగ్ క్లిష్టతరమైన పనిగా మారింది. అందువల్లనే ఇవి కాలక్రమంలో చాలా వరకు మరుగున పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అధికంగా సాగవుతున్న పంట జొన్న.
డయాబెటిస్, బీపీలకు చెక్
►ప్రొటీన్లు, ఎసెన్షియల్ అమినో ఆమ్లాలు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల చిరుధాన్యాలు పోషక సంపన్న ఆహారంగా గుర్తింపు పొందాయి. వరి, గోధుమలతో పోల్చితే డైటరీ ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉండటం వల్ల డయాబెటిస్, గుండె జబ్బులతో బాధపడే వారికి చిరుధాన్యాలు అనువైనవి.
► ఆరోగ్యాన్ని పెంపొందించే ఫెనోలిక్ కాంపౌండ్స్‌తో కూడి ఉన్నందున అనేక జీవన శైలి సంబంధమైన వ్యాధులను ఎదుర్కోవడానికి మిల్లెట్స్‌కు మించిన ఆహారం లేదంటే అతిశయోక్తి కాదు. మైనర్ మిల్లెట్స్‌ను రోజువారీ ప్రధాన ఆహారంగా తినగలిగితే ఏ జబ్బయినా కొద్ది కాలంలో తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
► వీటిని ఆహారంగా తీసుకుంటే రక్తంలో గ్లూకోస్ శాతం తగ్గుముఖం పడుతుంది. దీని వల్ల మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. క్రమంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది.
► కాల్షియం వీటిలో చాలా అధికంగా ఉంటుంది. దీని వల్ల దంతాలు, ఎముకలు గట్టిగా ఉంటాయి. సిరిధాన్యాలు పీచుని అధికంగా కలిగి ఉంటాయి.
► వీటిలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కొవ్వు తగ్గుతుంది. ఇప్పటికే అసిడిటీ ఉన్నవారు వీటిని తింటే చాలా మంచిది.
► ఊబకాయం, కాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు వీటిని రోజు తింటే మంచిది. కాన్సర్ వ్యాధి బారిన పడకుండా మనల్ని కాపాడుతాయి. రక్త పోటు ఉన్నవారు వీటిని తీసుకోవటం వల్ల అది అదుపులో ఉంటుంది. శ్వాసకోశ సమస్యలు సైతం తగ్గుతాయి.
Comments
Please login to add a commentAdd a comment