
ఆకుకూరగా కుసుమ సాగు!
నూనెగింజల పంటగా కుసుమను రబీలో సాగు చేస్తున్నారు. అయితే, కుసుమను ఆకుకూర పంటగా కూడా సాగు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏడాదంతా ఏ కాలంలోనైనా సాగుకు అనుకూలంగా ఉండటం, మంచి పోషకాలను కలిగి ఉండటం వల్ల ఆకుకూరగా కుసుమ పంట సాగుతో రైతులు మంచి ఆదాయం ఆర్జించవచ్చంటున్నారు. మన దేశంలో వందలాది ఏళ్లుగా కుసుమ ఉత్పత్తులను రంగులు, ఔషధాల తయారీలో వాడుతున్నారు. కుసుమ నూనె అత్యుత్తమమైన వంట నూనె. ఈ నూనెలో బహుళ సంతృప్త కొవ్వు ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్స్ చాలా ఎక్కువ. కొన్ని రకాల కేన్సర్లు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారి నుంచి ఇవి కాపాడతాయి.
ఆకుకూరగా కుసుమ మంచి సమతులాహారం. ఆకుకూరలను సలాడ్ల తయారీలో వాడతారు. పీచు, ఖనిజాలు, మాంసకృత్తులు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్–ఎ, సీ, ఇనుము, కాల్షియం పాళ్లూ అధికమే. పూత దశ పూర్తయ్యేవరకు కుసుమ మొక్క అడుగు భాగంలో ఉన్న ఆకులను కూరకు ఉపయోగించవచ్చు. కుసుమ ఆకుతో చేసే టీతో పలు ప్రయోజనాలున్నాయి. ఆకలిని పెంచుతుంది. పులియబెట్టిన కుసుమ ఆకులతో చేసిన ద్రావణానికి మహిళల్లో వంధ్యత్వాన్ని, గర్భస్రావాలను నిరోధించే శక్తి ఉందని సంప్రదాయ వైద్యులు విశ్వసిస్తారు.
గోంగూర, తోటకూరకు మల్లే కుసుమను కూడా రైతులతో సాగు చేయించేందుకు మహారాష్ట్ర సతారా జిల్లా పాల్తాన్‌లోని నింబార్కర్ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఎన్.ఏ.ఆర్.ఐ.– నారి) కృషి చేస్తోంది. కుసుమను ఏడాదంతా ఆకుకూరగా సాగు చేయవచ్చని ఈ సంస్థ చెబుతోంది. కుసుమ ప్రతికూల పరిస్థితులను తట్టుకొని పెరుగుతుంది. ఆకుకూర పంటగా సాగు చేయటం వల్ల రైతులకు మంచి ఆదాయం, వినియోగదారులకు మంచి పోషకాహారం లభిస్తాయని ఎన్.ఎ.ఆర్.ఐ. తెలిపింది.
కుసుమ సాగుకు ఏ కాలమైనా అనువైనదేనని, ప్రతికూల వాతావరణ పరిస్థితులలో సైతం అధిక దిగుబడులు వస్తాయని క్షేత్రస్థాయి అధ్యయనంలో తేలింది.ఇతర ఆకుకూరలతో పోల్చితే కుసుమలో అధిక పోషక విలువలు ఉన్నట్టు ఎన్.ఎ.ఆర్.ఐ. తెలిపింది. మెంతి, బచ్చలికూర కన్నా కుసుమలోనే కొవ్వు, మాంసకృత్తులు, విటమిన్ సీ, పెనోలిక్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉన్నాయి.
ఇప్పటి వరకు శీతాకాలంలో నూనెగింజల పంటగా సాగు చేస్తున్నారు. పంటను విత్తుకున్న 30–35 రోజుల దశలో సాళ్లలో ఎక్కువగా ఉన్న మొక్కలను తొలగిస్తారు. ఇలా పీకిన కుసుమ మొక్కలను ఆకుకూరగా రైతు కుటుంబాలు తినవచ్చు. మార్కెట్లో అమ్ముకోవచ్చు లేదా పశువుల మేతగానూ వాడవచ్చు. కుసుమ పంట నూర్చిన తర్వాత విత్తనాలు, పువ్వుల ద్వారా మంచి ఆదాయం లభిస్తుంది. కుసుమ సాగుతో కలిగే ప్రయోజనాల గురించి, కుసుమ ఆకుకూర వాడకం ద్వారా లభించే ఆరోగ్యపరమైన ప్రయోజనాల గురించి విస్తృతంగా ప్రచారం చేయటం అవసరం.
30 రోజుల్లోపలే ఆకుకూరగా వాడాలి
కుసుమను సాగు చేసే రైతులు సాళ్లలో ఒత్తుగా ఉన్న మొక్కలను పీకి ఆకుకూరగా వాడుకోవటమే తప్పించి ఆకుకూర పంటగా మాత్రం సాగులో లేదు. ఇప్పుడు సాగులో ఉన్న రకాల్లో 30 రోజులు దాటితే ముళ్లు వస్తాయి. నారి–6 రకం కుసుమ మొక్కలకు ముళ్లు రావు. కానీ 30 రోజులు దాటాక ఆకులు గిడసబారతాయి. కాబట్టి ఆకుకూరగా 30 రోజుల్లోగానే వాడుకోవాలి. కుసుమ విత్తనాలు కావలసిన రైతులకు మేం సరఫరా చేస్తాం. కిలో విత్తనాల ధర రూ. 90.
– డాక్టర్ సి. సుధాకర్ ( 98496 26312), సీనియర్ శాస్త్రవేత్త,
అఖిల భారత సమన్వయ కుసుమ పరిశోధన కార్యక్రమం,
వ్యవసాయ పరిశోధనా స్థానం, తాండూరు, వికారాబాద్ జిల్లా
– దండేల కృష్ణ, సాగుబడి డెస్క్