పత్తి.. దళారుల కత్తి .. ! | Cotton Farmers Losing With Cotton Brokers: Telangana | Sakshi
Sakshi News home page

పత్తి.. దళారుల కత్తి .. !

Published Sun, Mar 2 2025 9:23 AM | Last Updated on Sun, Mar 2 2025 9:23 AM

Cotton Farmers Losing With Cotton Brokers: Telangana

పత్తి కొనుగోళ్లలో అధికారులు, దళారుల కుమ్మక్కు

సీసీఐని బురిడీ కొట్టించిన వైనం 

4,072 టీఆర్‌లు జారీ.. పలు చోట్ల ఏఈవోల సంతకాలు ఫోర్జరీ 

23 సీసీఐ కేంద్రాల ద్వారా 1.20 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తి కొనుగోలు 

ఇప్పటికే ఒక మార్కెట్‌ కార్యదర్శి,  ఏవోలు సస్పెండ్‌  

విజిలెన్స్‌ విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి..

సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వం రైతులకు కల్పించిన వెసులుబాటును ఆసరాగా చేసుకొని కొంతమంది అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై అక్రమ దందాకు తెరలేపారు. వ్యవసాయ, మార్కెటింగ్, వ్యాపారులు కలిసి కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ)(CCI)ని బురిడీ కొట్టించారు. దళారులు రైతుల దగ్గర తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు సీసీఐకి విక్రయించారు. అధికారులు, దళారులు కుమ్మక్కైనట్లు తెలియడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. దీంతో తీగ లాగితే డొంక కదిలినట్లు ఒక్కొక్కటిగా అక్రమాలు బయటకు వస్తున్నాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా 4,072 టీఆర్‌లు జారీ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ఓ మార్కెట్‌ కార్యదర్శి, మండల వ్యవసాయ అధికారిపై శాఖారమైన చర్యలు తీసుకున్నారు. 

1.20లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తి కొనుగోలు 
రైతుకు మద్దతు ధర కల్పించాలని ఉద్దేశంతో సీసీఐ ప్రతి సంవత్సరం పత్తిని కొనుగోలు చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా 23 సీసీఐ నోటిఫైడ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 12శాతం కంటే లోపు తేమ ఉన్న పత్తికి క్వింటాలుకు రూ.7,521 ధరను ప్రకటించారు. వ్యవసాయ అధికారులు క్రాప్‌ బుకింగ్‌ సమయంలో నమోదు చేయించుకున్న రైతుల వారీగా కొనుగోలు చేశారు. రైతుల ఫొటోను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. బ్యాంక్‌ ఖాతాలలో డబ్బులను జమ చేశారు. ఇప్పటి వరకు సీసీఐ వారు 1,20,766 మెట్రిక్‌ టన్నుల పత్తిని కొనుగోలు చేశారు. 

దిగుబడికి మించి కొనుగోలు 
జిల్లా వ్యాప్తంగా 1,08,050 ఎకరాల్లో పత్తిని రైతులు సాగు చేశారని వ్యవసాయ అధికారులు నిర్థారించారు. ఒక్కో ఎకరానికి సుమారుగా 8 నుంచి 12 క్వింటాళ్ల వరకు నేల స్వాభవాన్ని బట్టి దిగుబడి వస్తుంది. పత్తి దిగుబడి సగటున 11 క్వింటాళ్లు వస్తే.. 1,18,855 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుంది. సీసీఐ 1,20,766 మెట్రిక్‌ టన్నులు, ప్రైవేట్‌ వ్యాపారులు 15,766 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయగా.. మొత్తం 1,36,532 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. ఈ లెక్కన 16,941 మెట్రిక్‌ టన్నులు దిగుబడికి మించి సీసీఐ కేంద్రాలకు వచ్చిందన్నమాట.  

ప్రైవేట్‌లో తక్కువగా ధర 
బయట మార్కెట్‌లో పత్తి క్వింటాల్‌కు దళారులు రూ5 నుంచి 6వేలకు మాత్రమే కొనుగోలు చేశారు. సీసీఐ రూ7,521 పెట్టి కొనుగోలు చేసింది. రైతుల వద్ద తక్కువ ధరకు పత్తిని కొని.. దళారులు ఎక్కువ రేటుకు కొని రైతుల పేరిట సీసీఐకి విక్రయించారు. ఒక్కో క్వింటాల్‌కు రూ1,500 నుంచి రూ2,500 వరకు గోల్‌మాల్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా రూ.లక్షలు చేతులు మారినట్లు తెలుస్తోంది. భద్రాచలం, మహారాష్ట్ర నుంచి పత్తిని ఎక్కువగా ప్రత్యేక వాహనాల్లో తీసుకొచ్చి సీసీఐకి విక్రయించినట్లు తెలుస్తోంది.

పత్తి విక్రయించగా వచ్చిన డబ్బులకు సంబంధించి ముందుగానే ఆయా రైతుల దగ్గరి నుంచి చెక్కులు, పాస్‌ బుక్‌లను తీసుకున్నారు. ఇలా సహకరించిన రైతులకు ఒక్కో క్వింటాల్‌ పత్తి రూ100 చొప్పున కమీషన్‌ సైతం ఇచ్చినట్లు సమాచారం. అలాగే వ్యవసాయ అధికారికి ఒక్కో టీఆర్‌కు దాదాపు రూ10వేలు ముట్టచెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాలపై విజిలెన్స్‌ అధికారులతో విచారణ జరిపిస్తేనే వాస్తవాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

విచారణ నివేదిక అందజేశాం|
టెంపరరీ రిజిస్ట్రేషన్‌ (టీఆర్‌) పత్రాలపై విచారణ చేసి కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు నివేదిక అందజేశాం. ఫోర్జరీ సంతకాలతో టీఆర్‌లు జారీ అయినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – నాగరాజు, మార్కెటింగ్‌ అధికారి

పత్తి దళారులపై చర్యలేవి...?
విజిలెన్స్‌ విచారణ జరిపించాలి 
హుస్నాబాద్‌రూరల్‌: హుస్నాబాద్‌ కాటన్‌ మిల్లుల్లో ఏర్పాటు చేసిన నాలుగు సీసీఐ కేంద్రాల్లో బోగస్‌ రైతుల పేరున పత్తి విక్రయించిన దళారులపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ నాయకుడు అయిలేని మల్లికార్జున్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. హుస్నాబాద్‌లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ...బోగస్‌ టీఆర్‌లను జారీచేసిన మండల వ్యవసాయ అధికారిని సస్పెండ్‌ చేసిన ప్రభుత్వాధికారులు, వ్యవసాయాధికారితో చేతులు కలిపి రైతుల పేరున సీసీఐలో పత్తి అమ్మిన వ్యాపారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బోగస్‌ రైతుల పేరున సీసీఐలో విక్రయించి లాభాలు పొందిన వ్యాపారులను గుర్తించి వారి లైసెన్స్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. - అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకుడు

ఇది కనిపిస్తున్నది టెంపరరీ రిజిస్ట్రేషన్‌ (టీఆర్‌)పత్రం. ఓ మహిళా రైతు పేరు మీద హుస్నాబాద్‌ మండల మీర్జాపూర్‌ ఏఈవో సంతకం ఫోర్జరీ చేసి పత్రం జారీ చేశారు. సదరు మహిళా రైతుది ఉమ్మాపూర్‌. అయితే ఈ గ్రామం మహ్మదాపూర్‌ క్లస్టర్‌ పరిధిలోకి వస్తుంది. సర్వే నంబర్‌ ఒకటి.. గ్రామం మరొకటి రాసి టీఆర్‌ను జారీ చేశారు. ఈ రైతు గత వానాకాలంలో ఎక్కువగా వరినే సాగు చేసినట్లు వ్యవసాయ అధికారులు గుర్తించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఫోర్జరీ సంతకాలతో పాటు, పత్తి సాగు చేయని వారి పేరు మీద తప్పుడు టీఆర్‌ల ద్వారా సీసీఐకి దళారులు పత్తిని విక్రయించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement