కడప రిమ్స్ వైద్యుల పని తీరు వివాదస్పదమవుతోంది. విధి నిర్వహణలో వారి నిర్లక్ష్యం రోజురోజుకు మితిమీరుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కడప అర్బన్, న్యూస్‌లైన్ : కడప రిమ్స్ వైద్యుల పని తీరు వివాదస్పదమవుతోంది. విధి నిర్వహణలో వారి నిర్లక్ష్యం రోజురోజుకు మితిమీరుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల శేషాద్రి అనే యువకుడు ఆపరేషన్ కోసం వచ్చి ప్రాణాలొదిలిన సంఘటన మరవకనే, తాజాగా మరో రోగి ప్రాణాల మీదికి వచ్చింది. ఇందుకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... చింతకొమ్మదిన్నె మండలం గుర్రంగుంపు తాండాకు చెందిన బోరుగోవింద సుబ్బరాయుడు(45) కడుపునొప్పితో కొంతకాలంగా బాధపడుతున్నాడు. ఆపరేషన్ చేయించుకుందామని అతను ఈ నెల 14న రిమ్స్‌లో చేరారు. అయితే డాక్టర్ నారాయణ, డాక్టర్ మల్లికార్జున, డాక్టర్ బాలాజీ శనివారం మధ్యాహ్నం 2 గంటలకు అతనికి ఆపరేషన్ చేశారు. అదే రోజు రాత్రి రోగి ముఖం వాచిపోగా, కడపు ఉబ్బినట్లుగా ఉందని భావించి తిరిగి రెండోసారి మరోసారి ఆపరేషన్ చేశారు. రెండు ఆపరేషన్లకు దాదాపు పది యూనిట్ల రక్తాన్ని వినియోగించారు.
రోగి బంధువులు, గ్రామస్తులు తమవంతు రక్తాన్ని ఇస్తామని కూడా ముందుకొచ్చారు. రెండు ఆపరేషన్లు చేయడంతో తీవ్ర రక్తస్రావం జరుగుతూనే ఉంది. ప్లేట్‌లెట్ల కౌంటింగ్ తగ్గిందని, అందుకే రక్తస్రావం జరుగుతోందని వైద్య సిబ్బంది తెలిపారు. ఒకానొక దశలో ఇక్కడి నుంచి అత్యవసర చికిత్స నిమిత్తం వేరే ప్రాంతాలకు తరలించాలని రోగి బంధువులకు చెప్పేందుకు వైద్యులు ప్రయత్నించారు.
డాక్టర్ల పొరపాటు వల్లే సుబ్బరాయుడుకు ప్రాణాపాయ స్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదే గ్రామానికి చెందిన ఈశ్వర్‌నాయక్ మాట్లాడుతూ... రోగి బంధువుతో కలసి తాము రిమ్స్ డెరైక్టర్‌తో మాట్లాడితే ఆయన ‘అమెరికాలో లేని పరికరాలు, మందులు ఇక్కడ(రిమ్స్)లో ఉన్నాయంటూ చెప్పుకొచ్చారని’ తెలిపారు. అదే నిజమైతే రోగుల పరిస్థితి ఇలా ఎందుకు తయారవుతుందని ఆయన ప్రశ్నించారు.