
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం
గుంటూరు : గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి మరోసారి వార్తల్లో నిలిచింది. బతికున్న శిశువు చనిపోయిందంటూ వైద్యులు చెప్పిన సంఘటన మంగళవారం జీజీహెచ్లో చోటుచేసుకుంది. శిశువు మృతి చెందినట్లు చెప్పడటంతో తీసుకు వెళుతుండగా, బిడ్డలో కదలికలను తండ్రి గుర్తించాడు.
ఈ విషయాన్ని అతడు వైద్యుల దృష్టికి తీసుకు వెళ్లడంతో చికిత్స నిమిత్తం శిశువును ఐసీయూకు తరలించారు. దీంతో బతికుండగానే చనిపోయినట్లు చెప్పిన వైద్యుల అలక్ష్యంపై శిశువు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా ఈ ఘటనపై మంత్రి కామినేని శ్రీనివాస్ డీఎం అండ్ హెచ్వో, సూపరింటెండెంట్ కు ఫోన్ చేసి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మరోవైపు వైఎస్ఆర్ సీపీ కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి జీజీహెచ్ను సందర్శించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలోనూ జీజీహెచ్లో ఎలుకలు దాడి చేయగా శిశువు మృతిచెందిన విషయం తెలిసిందే.