బొడ్డుతాడు కోయబోతే పీక తెగింది!
పసికందు ప్రాణాలు బలిగొన్న వైద్యుల నిర్లక్ష్యం
కర్నూలు పెద్దాసుపత్రిలో ఘటన
కర్నూలు (జిల్లా పరిషత్) : ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యుల నిర్లక్ష్యం మరో పసికందు ప్రాణం బలిగొంది. బొడ్డుతాడు కోయబోయి ఏకంగా పీక కోసి పసికందు మృతికి వైద్యులు కారణమయ్యారు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యుల పనితీరును దుయ్యబట్టారు. వెల్దుర్తికి చెందిన నబీరసూల్ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య షబానా, నలుగురు సంతానం. ఐదో కాన్పు కోసం షబానా ఈ నెల 16న కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని గైనిక్ విభాగంలో చేరింది. శనివారం ఆమె ఐదో సంతానంగా మగబిడ్డను ప్రసవించింది.
అయితే ఆ బిడ్డ బొడ్డుతాడు మెడలో మూడు చుట్లు చుట్టుకుని ఉండటంతో దానిని తొలగించేందుకు ప్రయత్నించారు. ఇదే క్రమంలో కత్తిగాటు కాస్తా పీకపై పడటంతో ఆ శిశువుకు తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే వైద్యులు చిన్నపిల్లల విభాగానికి తీసుకెళ్లి చికిత్స చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ శిశువు కన్నుమూసింది. శిశువు గొంతుపై కత్తి గాటు ఉండటం చూసిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ కన్నుమూసిందని ఆరోపించారు. ఇదిలాఉంటే ఇలాంటి కష్టతరమైన కేసుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ దగ్గరుండి పీజీలచేత చికిత్స చేయిం చాలి. కానీ పీజీ వైద్యులే స్వయంగా బొడ్డుతాడు తొలగించే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది.