ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్న బంధువులు, మృతి చెందిన శిశువు
సాక్షి, ఖమ్మం: వైద్యం వికటించి చిన్నారి మృతి చెందిన సంఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకుంది. శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే... నగరంలో రమణగుట్ట ప్రాంతానికి చెందిన దారా అఖిల గత నెల 18న జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రెండో కాన్పులో పాపకు జన్మనిచ్చింది. శిశువు ఆరోగ్యం సరిగా లేకపోవటంతో 19న ఎన్నెస్టీ రోడ్‌లోని జనని పిల్లల ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు పాపకు వైద్య సేవలు అందించారు. 18 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేయటంతో ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం రెండు రోజుల కే శిశువుకు జ్వరం రావటంతో మంగళవారం మళ్లీ అదే ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు మందులు రాసిచ్చి పంపారు. బుధవారం శిశువు ఆరోగ్యం మరింత దిగజారటంతో మళ్లీ శిశువును జనని ఆస్పత్రికి తీసుకొచ్చారు. శిశువును పరీక్షించిన వైద్యులు వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించటంతో.. నగరంలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వరంగల్‌కు తీసుకెళ్లి చూపించారు. వైద్య సేవలు పొందుతూ అక్కడే శిశువు మృతి చెందింది. శిశువు మృతికి జనని ఆస్పత్రి వైద్యులే కారణమని ఆగ్రహం చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. పాప పరిస్థితి గురించి రోజూ వైద్యుడిని వివరాలు అడుగుతున్నప్పటికీ ఏమీ చెప్పకుండా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. హైదరాబాద్ తీసుకెళ్లి వైద్యం చేయిస్తామని అడిగినా వినకుండా ఇక్కడే ఉంచి ప్రాణాన్ని బలిగొన్నారని కన్నీరుమున్నీరై విలపించారు. తమకు న్యాయం చేసేవరకు ఇక్కడి నుంచి కదలబోమని భీష్మించారు. టూటౌన్ పోలీసులు ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ సందర్భంగా ఆస్పత్రి యజమాన్యం, శిశువు బంధువులతో చర్చలు జరిపింది.
Comments
Please login to add a commentAdd a comment