
సిబ్బందితో మాట్లాడుతున్న మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ కిషన్‌నాయక్
అనంతగిరి : నేడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెరిగాయి. కాని డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల గర్భిణులు హైద్రాబాద్‌లో, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవం అయ్యే దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ఇది వికారాబాద్‌లోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఎదురవుతున్న దుస్థితి. వికారాబాద్‌లోని వెంకటపూర్ తండాకు చెందిన గర్భిణి రెండు రోజుల కిందట ప్రసవం కోసం వచ్చింది.
ఆమె ప్రతి నెలా రెగ్యులర్‌గా ప్రభుత్వ ఆస్పత్రిలోనే చెక్ చేయించుకుంది. అక్కడికి వచ్చిన ఆమెకు నీవు ఇక్కడ కాన్పు చేయించుకోవడం కష్టం అవుతుంది. వెంటనే హైదరాబాద్‌లోని ప్రసూతి ఆస్పత్రికి (జజ్గిఖానా)కు వెళ్లాలని సిబ్బంది సూచించారు. దీంతో ఆమె కుటుంబీకులు భయపడి వెంటనే హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన అనంతరం డాక్టర్లు పరిక్షించి ఇక్కడికి ఎందుకు వచ్చారు.
వికారాబాద్‌కే వెళ్లండి నార్మల్ డెలివరీ అవుతుంది. ఎలాంటి సమస్య లేదనడంతో వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి గురువారం వచ్చారు. అక్కడ ఉన్న సిబ్బందితో డాక్టర్లు చెప్పిన విషయాన్ని వివరించారు. అయినా ఆమె మాటలు పట్టించుకోకుండా డాక్టర్లు లేరు బయట ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకోమని సిబ్బంది సమాధానం చెప్పారు.
దీంతో సదరు గర్భిణి బంధువులు ఇదేం పద్ధతి ప్రభుత్వ దవాఖానాలో డాక్టర్లు లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, శివారెడ్డిపేట పీఏసీఎస్ చైర్మన్ కిషన్ నాయక్ వచ్చి ఇదేం పద్ధతి దవాఖానకు వచ్చేది పేదవాళ్లు, వాళ్లను బయటకు వెళ్లమంటే వారి వద్ద అన్ని డబ్బులు ఉంటాయా అని సిబ్బందిని ప్రశ్నించారు.
డ్యూటీలో డాక్టర్లు ఎవరూ లేకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లా కేంద్రం ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో నిరాక్షరాస్యులు ఎక్కువగా ఉండడంతో వచ్చిన రోగులను సిబ్బంది సముదాయించి చెప్పాలి తప్ప కోపగించుకోకూడదని సూచించారు. ఈ విషయమై వారు కలెక్టర్‌కు ఇక్కడ ఉన్న పరిస్థితిని తెలియజేయగా వెంటనే ఆస్పత్రి ఇన్‌చార్జి డాక్టర్‌కు ఫోన్ చేశారు.
ఆయన అక్కడికి వచ్చి డాక్టర్లను పిలిపించి వైద్య సేవలు అందించారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు కొన్ని జరిగాయి. కాగా గురువారం బాధితురాలితో పాటు రావులపల్లికి చెందిన మరో గర్భిణి కూడా కాన్పుకోసం వస్తే ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించింది. ఆస్పత్రిలో గర్భిణులు ప్రసవం కోసం వస్తే వారినుంచి డబ్బులు సైతం డిమాండ్ చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయంలో పలువురు జిల్లా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈమధ్యలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఆస్పత్రి పనితీరు సక్రమంగా కొనసాగడంలేదని రోగులు, వారి కుటుంబీకులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment