చిన్నారి అక్షరతో తల్లిదండ్రులు
సనత్‌నగర్: కాలికి గాయమైన తమ కుమార్తెను చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకువస్తే ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆమె శాశ్వతంగా కాలును కోల్పోవాలి వచ్చిందని ఆరోపిస్తూ బాధితురాలి తల్లిదండ్రులు సనత్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.ఎస్‌ఆర్‌నగర్ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్, పావని దంపతుల కుమార్తె అక్షర (5) గత నెల 13న ఇంట్లో ఆడుకుంటుండగా కబోర్డు మీద పడటంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబసభ్యులు ఆమెను సనత్‌నగర్‌లోని నీలిమ ఆస్పత్రికి తీసుకువెళ్లగా పాప కాలిని ఎక్స్‌రే తీయించిన వైద్యులు.. పాపకు ఎలాంటి ప్రమాదం లేదు..కాలికి ఫ్రాక్చర్ అయినందున ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.
అప్పటికి తాత్కాలికంగా సిమెంట్ పట్టీ వేసి మరుసటి రోజు మే 14న ఉదయం ఆపరేషన్ చేస్తామని తెలిపారు. దీంతో తల్లిదండ్రులు మర్నాడు ఉదయం పాపను తీసుకుని ఆస్పత్రికి వెళ్లగా ఆపరేషన్ థియేటర్‌లోకి అక్షరను తీసుకువెళ్లిన వైద్యులు రెండు గంటల తర్వాత పాపను బయటికి తీసుకువచ్చి సీటీ స్కాన్ చేయించాలని సూచించారు. సీటీస్కాన్ చేయగా కాలికి రక్తప్రసరణ జరగడం లేదని, సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. దీంతెఓ వారు పాపను తీసుకుని యశోద ఆస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి పాప కాలికి ఇన్‌ఫెక్షన్ సోకిందని ఆరు గంటల్లో ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని, ఇప్పటికే చాలా ఆలస్యం జరిగినందున కాలు తీసేయాల్సి ఉంటుందని, లేని పక్షంలో పాప ప్రాణానికే ప్రమాదమని తేల్చి చెప్పారు.
దీంతో వారు సెకండ్ ఒపీనియన్ కోసం సన్‌షైన్ ఆస్పత్రికి వెళ్లగా అక్కడ చిన్న పిల్లలను చేర్చుకోరని చెప్పడంతో కిమ్స్ ఆస్పత్రికి వెళ్లగా. అక్కడి వైద్యులు కూడా కాలు తీయాల్సిందేనని స్పష్టం చేయడంతో గత్యంతరం లేక ఆపరేషన్‌కు అంగీకరించడంతో వైద్యులు శస్త్ర చికిత్స చేసి కాలును తొలగించారు. నీలిమ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె కాలిని కోల్పోవాల్సి వచ్చిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సకాలంలో సరైన రీతిలో స్పందించి ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చి ఉండేది కాదన్నారు. వైద్యుల నిర్లక్ష్యంపై సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితురాలి తండ్రి చంద్రశేఖర్ తెలిపారు. అయితే పోలీసులు నీలిమ ఆస్పత్రి యాజమాన్యానికే కొమ్ము కాస్తున్నారని, తమ ఫిర్యాదును పట్టించుకోలేదని ఆరోపించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.
వైద్యుల నిర్లక్ష్యం లేదు
చిన్నారి అక్షర కేసులో ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం లేదు. చిన్నారిని తీసుకువచ్చినప్పుడు తగిన చికిత్స అందించాం. అయితే పాప తల్లిదండ్రులకు న్యాయం చేస్తాం, వారితో చర్చలు జరుపుతున్నాం...–నీలిమ ఆస్పత్రి డైరెక్టర్ శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment