నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం | Whole life cost of negligence | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం

Published Fri, Sep 11 2015 3:50 AM | Last Updated on Sun, Sep 3 2017 9:08 AM

నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం

నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం

అనంతపురం మెడికల్ :  వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం ‘అనంత’ వాయువుల్లో కలిసిపోయింది. చెల్లెలికి పసుపు, చీర ఇద్దామని వెళుతూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి అనంతపురం సర్వజనాస్పత్రి వైద్యులు సకాలంలో చికిత్స అందించలేదు. దీంతో అతను మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చెన్నేకొత్తపల్లి మండలం కనుముక్కలకు చెందిన లక్ష్మయ్య (55), లక్ష్మమ్మ భార్యాభర్తలు.  స్థానికంగా ఉపాధి లేక బెంగళూరుకు వలస వెళ్లారు. టెంకాయల పండగ (వినాయక చవితి) సందర్భంగా ఆడబిడ్డలకు పసుపు, కుంకుమ ఇవ్వాలని బుధవారం స్వగ్రామానికి వచ్చారు.

గురువారం లక్ష్మయ్య తన చెల్లెలి కొడుకు హరీష్ (25)తో కలిసి ద్విచక్రవాహనంపై ధర్మవరం మండలం బిలవంపల్లికి పసుపు, కుంకుమ, చీర తీసుకుని బయలుదేరాడు. యర్రగుంట్ల వద్ద ట్రాక్టర్ ఢీకొనడంతో ఇద్దరూ గాయపడ్డారు. వెంటనే ధర్మవరం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స తర్వాత అనంతపురం సర్వజనాస్పత్రికి రెఫర్ చేశారు. ఉదయం 11.55 గంటలకు ఆస్పత్రి క్యాజువాలిటీకి వచ్చారు.  డ్యూటీ డాక్టర్ మల్లీశ్వరి వారిని పరీక్షించారు. లక్ష్మయ్య తలకు తీవ్ర గాయమైందని గుర్తించారు.

కుడి కాలు విరిగినట్లు, ఛాతీ, కడుపు భాగంలో గాయాలైనట్లు నిర్ధారించి ఆర్థోవార్డుకు రాశారు. 12.30 గంటలకు వార్డుకు తీసుకెళ్లగా డ్యూటీ డాక్టర్లు ఎవరూ లేరు. నర్సులు మాత్రమే ఉన్నారు. వార్డులోని ఓ గదిలో అడ్మిట్ చేశారు. తల భారంగా ఉందని, ఛాతీ వద్ద నొప్పిగా ఉందని లక్ష్మయ్య చెప్పడంతో కుటుంబ సభ్యులు వెంటనే డాక్టర్లు ఉంటున్న గది వద్దకు వెళ్లి పరిస్థితి వివరించారు.  ఫలితం లేకపోవడంతో డిశ్చార్జ్ చేస్తే వేరే ఆస్పత్రికి వెళతామని వారు చెప్పారు.  డాక్టర్లు వచ్చి చూశాక డిశ్చార్జ్ చేస్తామన్నారు.

అప్పటి నుంచి నిమిష నిమిషానికి లక్ష్మయ్య పరిస్థితి విషమించింది. తీరా సాయంత్రం 4.45కు డాక్టర్ కిరణ్, సీనియర్ రెసిడెంట్ శ్యాం వచ్చారు. లక్ష్మయ్యను చూసిన డాక్టర్  పరిస్థితి విషమించినట్లు గుర్తించి ‘ఒకవేళ చనిపోతే డాక్టర్లకు సంబంధం లేదు’ అని కుటుంబ సభ్యులతో రాయించుకున్నారు. ఆ తర్వాత పది నిమిషాలకు లక్ష్మయ్య మృతి చెందాడు.

 ‘అసలు మీరు మనుషులేనా?
 మృతదేహాన్ని వార్డు నుంచి మార్చురీకి తరలించాలని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అసలు మీరు మనుషులేనా.. బతికున్నప్పుడు రాలేదు.. లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటున్నారు. కనీస మానవత్వం లేదా? ఈ డాక్టర్లను సస్పెండ్ చేసే దాకా మృతదేహాన్ని తీసేది లేదు’ అంటూ లక్ష్మయ్య తమ్ముడి కుమారుడు నరేంద్ర, అల్లుడు ఎర్రిస్వామి, చెల్లెలి కుమార్తె శ్రావణి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకుని వార్డు వద్దకు వచ్చిన సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్ వైవీ రావుతో వాగ్వాదానికి దిగారు.  చివరకు బాధ్యులైన డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని రాతపూర్వకంగా ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
 
 రోగులకు ‘పరీక్ష’
 అనంతపురం మెడికల్ : అనంతపురం సర్వజనాస్పత్రిలో వైద్య పరీక్షల కోసం రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం ఓడీచెరువు మండలం జంబులవాండ్లపల్లికి చెందిన రంగప్ప(65) ఆస్పత్రికి వచ్చాడు. ఇతడికి గతంలోనే కాలు విరిగింది. ప్రస్తుతం గొంతు వద్ద గడ్డలు ఉండడంతో ఎంఎస్-2లో అడ్మిట్ అయ్యాడు. పరీక్ష చేయించుకోవాలని రాసిచ్చారు. నడవలేని అతణ్ని వీల్‌చైర్‌లో పై అంతస్తు నుంచి కిందకు తీసుకొచ్చారు. అయితే అక్కడ సిబ్బందెవరూ లేరు.ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా మెడికల్ కళాశాలలో జరిగిన ర్యాలీకి వెళ్లారు. దీంతో రంగప్పతో పాటు మరికొంత మంది రోగులు వార్డు బయటే 2 గంటలు నిరీక్షించాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement