
లావణ్య (ఫైల్)
సాక్షి, హైదరాబాద్(కీసర): వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండు గర్భిణీ మృతి చెందిందని ఆరోపిస్తూ ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎదుట మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. బొమ్మలరామారం మండలం తూంకుంటకు చెందిన రాధిక అలియాస్ లావణ్య(22)కు పదినెలల క్రితం కీసరకు చెందిన పూండ్రు శేఖర్‌తో వివాహం జరిగింది. ఆమె 5 నెలల గర్భిణీ కాగా.. ఆమెకు కడుపు నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఈనెల 16న కీసరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
వైద్యురాలు చికిత్స చేసి ఇంటికి పంపించారు. నొప్పి తగ్గకపోవడంతో అదే రోజు భువనగిరిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు వెంటనే నగరంలోని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించారు. గాంధీలో పరీక్షించిన వైద్యులు కడుపులో బిడ్డ పరిస్థితి బాగాలేదని తొలగించారు. ఆ తర్వాత ఆమె పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందింది. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి నుంచి సదరు ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చి ఆందోళనకు దిగారు.
మృతురాలి కుటుంబీకులు ఆసుపత్రి అద్దాలు, ఫర్నీచర్‌ను సైతం ధ్వసం చేశారు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు మృతురాలి కుటుంబసభ్యులతో మాట్లాడారు. గర్భిణీ అయిన తన భార్యను వైద్య పరీక్షల కోసం తీసుకొచ్చినప్పుడు పచ్చ కామెర్లు వచ్చాయని చెప్పలేదని ముందే చెబితే జాగ్రత్త పడేవారమని భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.
చదవండి: (హైదరాబాద్‌లో కోటి విలువ చేసే వజ్రాభరణాలు చోరీ.. దొంగలను పట్టించిన భూతద్దం)
Comments
Please login to add a commentAdd a comment