keesara
-
HYD: ఫుల్లుగా తాగి కారు నడిపి.. చెట్టును ఢీ కొట్టి..
సాక్షి, మేడ్చల్: వాళ్లు మైనర్లు.. పైగా మద్యం మత్తులో కారు అతివేగంగా నడిపి ఘోర ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలతో ముగ్గురు ఆస్పత్రి పాలయ్యారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కీసర చౌరస్తా నుండి యాధ్గార్ పల్లి వైపు వెళ్తున్న బెలీనో కార్ (TS 10 ES 7428) అదుపు తప్పి గోశాల వద్ద చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భువేష్ (17 ), తుషార (18) అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్ని అల్వాల్ బొల్లారం ప్రాంతం కు చెందిన వారుగా గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా.. అందులో ఓ యువతి కూడా ఉండడం గమనార్హం. ప్రమాదానికి గురైన కారు నుంచి మద్యం సీసాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫుల్లుగా తాగిన మత్తులో డ్రైవ్ చేసే ప్రమాదానికి వాళ్లు గురైనట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గాయపడిన పిలిప్స్, రుబిన్‌లతో పాటు వాళ్లతో ఉన్న యువతిని స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు చికిత్స అందిస్తున్నారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి.. దర్యాప్తు చేపట్టారు పోలీసులు. -
హైదరాబాద్- విజయవాడ రహదారిపై స్తంభించిన రాకపోకలు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తెలుగు రాష్ట్రాలను వానలు వదలడం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ ఇక్కడ అని కాకుండా దాదాపుగా అన్ని చోట్ల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్థంభించింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎన్టీఆర్ జిల్లాలో మున్నేరు నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామసమీపంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై(హైదరాబాద్-విజయవాడ)అడుగు మేర వరద నీరు చేరింది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు స్తంభించాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వన్‌వేలోనే ట్రాఫిక్‌ను పోలీసులు మళ్లిస్తున్నారు. వందలాది వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొందరు వాహనదారులు వరద నీటిలోనే తమ వాహనాలను ముందుకు నడిపిస్తున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐతవరం వద్ద పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు. కంచికచర్ల మండలం కీసర వద్ద మున్నేరు, వైరా ఏరు, కట్టలేరు వరద ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై కీసర వంతెన వద్ద ఈ మూడు నదులు కలిసి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అయితే సమయం గడుస్తున్నా కొద్ది వరద మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఐతవరం దగ్గర పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో ముందస్తుగా టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను పోలీసులు నిలిపివేశారు. చదవండి: రెడ్ అలర్ట్.. మరో 24 గంటలు అతి భారీ వర్షాలు -
ప్రజల భాగస్వామ్యం ఉంటే విజయవంతం
కీసర: స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేస్తే విజయవంతమవుతాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీర్ హరీశ్‌రావు అన్నారు. సోమవారం రాంపల్లిదాయరలో బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అభివృద్ధి కమిటీల మహాసభకు హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. జన నిర్మాణంతోనే సమాజం నిర్మితమవుతుందని, ఇందుకు బాలవికాస సంస్థ చేపడుతున్న పనులే నిదర్శనమన్నారు. బాలవికాస నీటి శుద్ధి ప్లాంటు ఏర్పాటుచేస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఆ స్ఫూర్తితో మిషన్ భగీరథను తెచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఈ సంస్థ గ్రామాల్లో సేవాగుణం గలవారిని కమిటీలుగా నియమించి వారికి శిక్షణ ఇచ్చి కార్యక్రమాలను నడిపించడం గొప్పవిషయమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, చామకూర మల్లారెడ్డి, బాలవికాస వ్యవస్థాపకుడు ఆండ్రూ జింగ్రాస్, సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరీరెడ్డి పాల్గొన్నారు. బాల వికాస సంస్థ 23 బ్రాంచీలు ఏర్పాటుచేసి 8 వేల గ్రామాల్లో కార్యక్రమాలు చేపడుతోంది. -
Hyderabad: వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతి!
సాక్షి, హైదరాబాద్(కీసర): వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండు గర్భిణీ మృతి చెందిందని ఆరోపిస్తూ ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎదుట మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. బొమ్మలరామారం మండలం తూంకుంటకు చెందిన రాధిక అలియాస్ లావణ్య(22)కు పదినెలల క్రితం కీసరకు చెందిన పూండ్రు శేఖర్‌తో వివాహం జరిగింది. ఆమె 5 నెలల గర్భిణీ కాగా.. ఆమెకు కడుపు నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఈనెల 16న కీసరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యురాలు చికిత్స చేసి ఇంటికి పంపించారు. నొప్పి తగ్గకపోవడంతో అదే రోజు భువనగిరిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు వెంటనే నగరంలోని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించారు. గాంధీలో పరీక్షించిన వైద్యులు కడుపులో బిడ్డ పరిస్థితి బాగాలేదని తొలగించారు. ఆ తర్వాత ఆమె పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందింది. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి నుంచి సదరు ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబీకులు ఆసుపత్రి అద్దాలు, ఫర్నీచర్‌ను సైతం ధ్వసం చేశారు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు మృతురాలి కుటుంబసభ్యులతో మాట్లాడారు. గర్భిణీ అయిన తన భార్యను వైద్య పరీక్షల కోసం తీసుకొచ్చినప్పుడు పచ్చ కామెర్లు వచ్చాయని చెప్పలేదని ముందే చెబితే జాగ్రత్త పడేవారమని భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. చదవండి: (హైదరాబాద్‌లో కోటి విలువ చేసే వజ్రాభరణాలు చోరీ.. దొంగలను పట్టించిన భూతద్దం) -
చిగురిస్తున్న మెట్రో ఆశలు.. ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ మెట్రో హారం...
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో పలు మార్గాల్లో మెట్రో మార్గం ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవల రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎక్స్‌ప్రెస్ మెట్రో ప్రాజెక్టుకు పునాదిరాయి పడిన నేపథ్యంలో.. తాజాగా పలు ప్రాంతాల నుంచి మెట్రో డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. వీటికి అధికార, విపక్ష పార్టీలు, వివిధ వర్గాల వారు మద్దతునిస్తుండడంతో నూతనంగా చేపట్టాల్సిన మెట్రో మార్గాలపై అధ్యయనానికి హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ శ్రీకారం చుట్టింది. ప్రతి కిలోమీటరు మెట్రో పూర్తికి సుమారు రూ.300 కోట్లు అంచనా వ్యయం అవుతుంది. ఈ స్థాయిలో నిధులు వ్యయం చేసే స్థితిలో రాష్ట్ర సర్కారు లేదన్న విషయం సుస్పష్టమే. ఈ నేపథ్యంలో పబ్లిక్– ప్రైవేటు భాగస్వామ్యం, లేదా కేంద్ర సహకారంతో పలు రూట్లలో ప్రాజెక్టులు చేపట్టడం.. తొలుత ప్రైవేటు సంస్థలు చేసే వ్యయంతో పూర్తిచేసి ఆ తర్వాత వాయిదా పద్ధతిలో సదరు సంస్థకు వడ్డీతో సహా చెల్లించడం (హైబ్రిడ్ యాన్యుటీ ) తదితర విధానాలపై సర్కారు దృష్టి సారించడం విశేషం. (క్లిక్ చేయండి: ఇక ఈజీగా ఆధార్ అప్డేట్) ఔటర్ చుట్టూ మెట్రో హారం... మహానగరానికి మణిహారంలా 158 కి.మీ మేర విస్తరించిన ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ మెట్రో మార్గం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా తాజాగా తెరమీదకు వచ్చింది. ఇటీవల సీఎం కేసీఆర్ ఇదే అంశాన్ని ప్రస్తావించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సుమారు 190 గ్రామాలు, 30కి పైగా నగరపాలక సంస్థలు ఔటర్ రింగ్‌రోడ్డు లోపలున్నాయి. ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో రూటు ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాలకు కనెక్టివిటీ మరింత మెరుగవడంతో పాటు వివిధ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ప్రధానంగా ఐటీ, హార్డ్‌వేర్, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలకు మెట్రో రూటు మరింత ఊపునిస్తుందన్న అంచనాలు సైతం వ్యక్తమవుతున్నాయి. -
బీసీలు పోరుబాట పట్టాలి: ఎంపీ ఆర్.కృష్ణయ్య
కీసర: రాజ్యాధికారం కోసం బీసీలు పోరుబాట పట్టాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. కీసర మండలంలోని రాంపల్లి పూలపల్లి బాలయ్య ఫంక్షన్హాల్లో మంగళవారం జరిగిన కురుమల రాష్ట్ర స్థాయి సమావేశానికి ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ ఉమతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. అప్పుడే రాజకీయాల్లో బీసీలకు ప్రాముఖ్యత పెరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యం నేడు ధనస్వామ్యంగా మారిందని, ఎన్నికల్లో ధనమే కీలకమైందని తెలిపారు. బీసీలు విద్యావంతులు కావాలంటే.. బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. కార్యక్రమంలో కురుమ యువజన నాయకుడు శ్రీకాంత్, ఆలేరు కాంగ్రెస్ ఇన్చార్జ్ బీర్ల అయిలయ్య, కార్పొరేటర్ కృష్ణ పాల్గొన్నారు. -
పక్కింటి మహిళతో వివాహేతర సంబంధం.. భార్యకు తెలిసి..
సాక్షి, హైదరాబాద్ (మేడ్చల్): వివాహిత మహిళతో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి దారుణ హత్యకు దారితీసింది. ఆ మహిళ భర్త ఇద్దరు కొడుకులు కలిసి వ్యక్తిని అత్యంత కిరాతకంగా హతమార్చారు. కీసర ఇన్స్పెక్టర్ రఘువీర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామానికి చెందిన రుద్రబోయిన బాలరాజ్‌గౌడ్(36) నాలుగేళ్ల క్రితం సొంత గ్రామం నుంచి భార్య మమత ఇద్దరు పిల్లలతో వ్యాపార రీత్యా ఉప్పల్‌లో ఉంటున్నాడు. రియల్ ఎస్టేట్‌తో పాటు మద్యం వ్యాపారం చేస్తున్నాడు. వీరి ఇంటి పక్కనే ఉండే రమేష్ భార్య మంజులతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. మొదటి సారి హెచ్చరించి దాడి.. ►విషయం తెలియడంతో మంజుల భర్త రమేష్ పలుమార్లు బాల్‌రాజ్‌గౌడ్‌ను హెచ్చరించాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో రమేష్ ఒకసారి బాలరాజ్గౌడ్పై దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టాడు. సదరు మహిళను తీసుకొని వెళ్లిపోయిన బాలరాజ్‌గౌడ్ బాలరాజ్‌గౌడ్ వ్యవహారం నచ్చక అతడి భార్య మమత ఇద్దరు పిల్లలను తీసుకొని అమ్మగారింటికి వెళ్లిపోయింది. బాలరాజ్‌గౌడ్ మంజులను తీసుకొని వెళ్లిపోయి కొన్ని రోజలు మేడ్చల్‌లో ఉన్నారు. ఆ తర్వాత కీసర మండలం గోధుమకుంట మైత్రినగర్‌లో ఓ ఇంటినిఅద్దెకు తీసుకొని ఉంటున్నారు. చదవండి: (పెళ్లయి ఇద్దరు పిల్లలు.. ఇంజనీరింగ్ విద్యార్థితో జంప్) ఆచూకీ తెలియడంతో ఆదివారం రాత్రి... వీరున్న ఆచూకి తెలుసుకున్న రమేష్ ఎలాగైనా బాలరాజ్‌గౌడ్‌ను హతమార్చాలని పథకం వేశాడు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఓ ఆటోలో తన ఇద్దరు కొడుకులు అరుణ్, తరుణ్‌తో పాటు మంజుల ఇద్దరు సోదరులతో కలిసి బాల్‌రాజ్‌గౌడ్ అద్దెకు ఉండే ఇంటికి వచ్చారు. ►కొద్దిసేపు బాలరాజ్గౌడ్తో వాగ్వాదానికి దిగారు. గొడవ తీవ్రమై కర్రతో పాటు ఇటుకతో బాలరాజ్‌గౌడ్ తలపై కొట్టారు. రమేష్ పెద్ద కొడుకు అరుణ్ బయట ఉండగా.. చిన్న కొడుకు తరుణ్ కలిసి అతను కింద పడిపోగానే పక్కనే ఉన్న బట్టతో ఊపిరి ఆడకుండా చేసి కత్తి, స్క్రూడ్రైవర్‌తో విచక్షణ రహితంగా పొడిచి చంపారు. ►అక్కడే ఉన్న మంజుల వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడి ఉన్న బాలరాజ్‌గౌడ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని మంజులతో పాటు ఆమె భర్త రమేష్, ఇద్దరు కుమారులు, మంజుల సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రఘువీర్‌రెడ్డి తెలిపారు. -
తల్లి మృతిని తట్టుకోలేక..
కీసర: తల్లి మృతిని తట్టుకోలేక తీవ్ర మానసిక వ్యధతో ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాంపల్లిదాయర గ్రామంలో ఈ ఘటన జరిగింది. కీసర సీఐ రఘువీర్‌రెడ్డి కథనం ప్రకారం గ్రామానికి చెందిన సుశీల భర్త మరో వివాహం చేసుకొని ఇంటినుంచి వెళ్లిపోవడంతో తన ముగ్గురు పిల్లలతో కలసి ఉంటోంది. ఇటీవల పెద్ద కుమారుడు మాధవరెడ్డికి వివాహం కాగా అతని భార్య విడాకులు తీసుకొని వెళ్లిపోయింది. అప్పటినుంచి ఆయన గండిపేటలో ప్రైవేటు ఉద్యోగంచేస్తూ అక్కడే ఉంటున్నారు. అతని సోదరులు యాదిరెడ్డి(30) మహిపాల్‌రెడ్డి (28) దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ సంగీత పాఠశాలలో పనిచేస్తున్నారు. వారానికోసారి తల్లి వద్దకు వచ్చివెళ్లేవారు. కాగా, వీరి తల్లిసుశీల ఎనిమిది నెలల క్రితం కేన్సర్ వ్యాధితో మృతిచెందింది. తల్లి చనిపోయిన తర్వాత ఇంటిని వదిలేసి ఇద్దరు సోదరులు దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్లిపోయారు. యాదిరెడ్డి, మహిపాల్‌రెడ్డి ఈనెల 21న ఇంటిని శుభ్రం చేసేందుకు రాంపల్లిదాయరకు వచ్చారు. అయితే గండిపేటలో ఉన్న అన్న మాధవరెడ్డి తన సోదరులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వకపోవడంతో పక్కింటి వారికి ఫోన్‌చేసి చెప్పారు.వారు వెళ్లి కిటికిలో నుంచి చూడగా యాదిరెడ్డి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఉండటం, మహిపాల్‌రెడ్డి పురుగు మందుతాగి కిందపడి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులకు ఇంట్లో మృతులు రాసిన సూసైడ్ నోట్ లభించింది. అందులో తమ తల్లి చనిపోవడం తట్టుకోలేక మానసిక వ్యధతో ఆత్మహత్య చేసుకుంటున్నామని రాసి ఉందని పోలీసులు తెలిపారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసును కీసర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.3 వేలకు కొని రూ.12 వేలకు విక్రయం.. 410 కిలోల గంజాయి స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: భద్రాచలం, ఏజెన్సీ ప్రాంతంలో కిలో గంజాయి రూ.3 వేల చొప్పున కొనుగోలు చేసి... అక్రమంగా ముంబైకి తరలించి రూ.12 వేలకు విక్రయిస్తున్న గంజాయి ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 410 కిలోల గంజాయి, రెండు కార్లు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) డీసీపీ కే మురళీధర్‌తో కలిసి రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ బుధవారం వివరాలు వెల్లడించారు. ♦నాగర్‌కర్నూల్ జిల్లా, బైరాపూర్ గ్రామానికి చెందిన గుడ్లనారం వెంకట్ నారాయణ తుర్కయాంజల్‌లోని ఏబీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. గత మూడేళ్లుగా గంజాయి వ్యాపారం ఇతనికి పలు రాష్ట్రాల్లోని గంజాయి కొనుగోలుదారులతో సంబంధాలు ఉన్నాయి. భద్రాచలం, ఏజెన్సీ ప్రాంతాల నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ధరకు విక్రయించేవాడు. ఈ దందాలో అతడికి మండలి శ్రీనివాస్, దబ్బడి రజనీకాంత్, యాచహరం నాగరాజు సహకరించేవారు. ♦ ముంబైకి చెందిన షాహీన్, మాజిద్ నుంచి ఆర్డర్ అందడంతో వీరు నలుగురు కలిసి ఈనెల 20న రెండు వాహనాలతో ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ సత్తిబాబు అనే వ్యక్తి నుంచి 410 కిలోల గంజాయి కొనుగోలు చేసి వాటిని కారు లోపల సీట్ల కింద దాచిపెట్టారు. పోలీసుల తనిఖీల నుంచి త ప్పించుకునేందుకు వెరిటో కారును పైలట్ వా హనంగా వినియోగిస్తూ భద్రాచలం నుంచి ఓఆర్ఆర్ మీదుగా ముంబై బయలుదేరారు. ♦ బుధవారం దీనిపై సమాచారం అందడంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ, కీసర పోలీసులు కీసర టోల్గేట్ వద్ద వాహనాలను అడ్డగించి తనిఖీ చేశారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి 410 కిలోల గంజాయి, రెండు కార్లు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వెంకట్‌పై పాత కేసులు కూడా.. ఈ కేసులో ప్రధాన నిందితుడు వెంకట్ నారాయణపై గతంలో రెండు పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. 2019లో విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్లో గంజాయి కేసు ఉంది. నల్లగొండ జిల్లా, చిట్యాల పోలీస్ స్టేషన్లో నమోదైన మరో గంజాయి కేసులో వెంకట్‌తో పాటు ఏఓబీ ప్రాంతానికి చెందిన సత్తి బాబు నిందితులుగా ఉన్నారు. వెంకట్‌ను పాత కేసుల్లో కూడా రిమాండ్‌కు తరలించి, కోర్టు ఎదుట హాజరుపరుస్తామని సీపీ తెలిపారు. వారిపై పీడీ యాక్ట్‌లు నమోదు చేస్తామన్నారు. -
125 గజాల వరకు ఉచితం... ఆపై పైకం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను 125 చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేయనున్నారు. అందు కోసం గత నెల 21 నుంచి మీ–సేవ కేంద్రాల ద్వారా ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తోంది. మార్చి 31తో దరఖాస్తు గడువు ముగియనుంది. ఆయితే అధికారులు ఇప్పటి వరకు దీనిపై స్పష్టమైన ఆదేశాలు రాకపోవడం.. పేదలకు క్రమబద్ధీకరణ జీఓ పై సరైన సమాచారం లేకపోవడంతో దరఖాస్తులు చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. జవహర్‌నగర్ కార్పొరేషన్లో ప్రత్యేక సమావేశం జీఓ.58, 59 దరఖాస్తు అవగాహన కోసం మేయర్ మేకల కావ్య అధ్యక్షతన కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం కీసర ఆర్డీవో రవి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జవహర్‌నగర్‌లో కార్పొరేషన్, రెవెన్యూ సంయుక్తంగా చేయాల్సిన పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కాప్రా తహసీల్దార్ అనిత, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. కేవలం వీరికే వర్తిస్తుంది.. 2014 జూన్ 2వ తేదీ నాటికి ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. 2014 డిసెంబర్ 30న ప్రభుత్వం జారీ చేసిన 58, 59 జీఓల్లోని నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరణకు మరోమారు అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం గత నెల 14వ తేదీన కొత్త జీఓ జారీ చేసింది. 250 గజాలు దాటితే మార్కెట్ విలువ చెల్లించాల్సిందే.. ప్రభుత్వం తాజాగా తెచ్చిన జీఓ ప్రకారం 125 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించనున్నారు. 250 గజాల వరకు ప్రభుత్వం నిర్ధారించిన మార్కెట్ విలువలో 50శాతం, 250 నుంచి 300 చదరపు గజాలు దాటితే 75శాతం, 500 నుంచి 1000 గజాల్లో నిర్మాణాలు చేసుకుంటే 100 శాతం మార్కెట్ విలువ చెల్లించాలి. ఈసారైనా ముందుకొచ్చేనా? జవహర్‌నగర్ కార్పొరేషన్లో దాదాపు 2 లక్షల మంది పేదలు ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్నారు. 2014 క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించినా చాలా మంది ముందుకు రాలేదు. ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించి ప్రభుత్వ రికార్డుల్లో అధికారికంగా వివరాలు లేకపోవడంతో మౌలిక సదుపాయాలు కల్పించడం అధికారులకు ఇబ్బందిగా మారింది. (క్లిక్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు తప్పని నిరాశ) అడ్డదారుల్లో వెళ్తే క్రిమినల్ కేసులు: ఆర్డీవో జీఓ.58, 59 దరఖాస్తుల కోసం అడ్డదారుల్లో వెళ్లి నకిలీ ధ్రువపత్రాలు అందజేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కీసర ఆర్డీవో రవి హెచ్చరించారు. గ్రామపంచాయితీ పేరున గతంలో తీసుకున్నట్లు బిల్లులు తీసుకువస్తే వాటిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇళ్లక్రమబద్ధీకరణ కోసం కొన్ని చోట్ల 2014 సంవత్సారానికి ముందు తేదీలలో నకిలీ ధ్రువపత్రాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. అలాంటి వాటిని గుర్తించి వాటిపై దర్యాప్తు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జవహర్‌గనర్‌లో గతంలో జీఓ.58 ప్రకారం 5,546, జీఓ 59 ప్రకారం 1,666 మంది దరఖాస్తులు చేసుకున్నారని వీటికి సంబంధించి మరో 10 రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. ఈనెల 31 వరకు మీ–సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుకు కావాల్సినవి.. ► 2014 జూన్ 2వ తేదీకి ముందున్న నిర్మాణాలను మాత్రమే క్రమబద్ధీకరణ చేస్తారు. ► ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేసిన వారు మీ సేవా కేంద్రాల ద్వారా తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ► రూ. వెయ్యి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ►ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి సమర్పించాలి. ► ఆధార్‌కార్డు, రిజిస్టర్ డాక్యుమెంట్, ఆస్తిపన్ను రసీదు, విద్యుత్, నీటి బిల్లులు దరఖాస్తులతో సమర్పించాలి. ► ఎంత స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టారన్న వివరాలు తెలియజేయాలి. ► గతంలో అధికారులు ఏదైనా నోటీస్ జారీ చేస్తే అది కూడా జత చేయాలి. ► కోర్టు కేసులు ఉంటే వివరాలు తెలియజేయాలి. -
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు దుర్మరణం
సాక్షి, మేడ్చల్: కీసర: ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్)పై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఔటర్ డివైడర్‌ను కారు బలంగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మృతుల్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ సతీమణితో పాటు సమీప బంధువులు ఉన్నారు. శుభకార్యం కోసం చీరాలకు... సైబర్ క్రైమ్ విభాగం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసుగా పని చేస్తున్న కార్యంపూడి వెంకట మురళీధర్ ప్రసాద్ తన కుటుంబంతో మూసాపేటలో నివాసముంటున్నారు. ఈయన భార్య శంకరమ్మ (48) ప్రభుత్వ టీచర్. శంకరమ్మతో పాటు ప్రసాద్ అన్న కుమారుడు కార్యంపూడి బాలకృష్ణమూర్తి (48), ఈయన భార్య రేణుక (42), కుమారుడు భాస్కర్లు (జేఎన్టీయూ ఇంజినీరింగ్ విద్యార్థి) ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన బంధువుల వివాహానికి హాజరయ్యారు. ఆదివారం రాత్రి 10.30 గంటలకు కారులో తిరుగు ప్రయాణమయ్యారు. వీరితో పాటు బాలకృష్ణమూర్తి సోదరుడు కూడా వీరితో కలిసి తిరుగు ప్రయాణమయ్యారు. అప్పుడే డ్రైవింగ్ అప్పగించిన భాస్కర్... చీరాల నుంచి పెద్ద అంబర్‌పేట వరకు ఈ వాహనాన్ని భాస్కర్ డ్రైవ్ చేశారు. అక్కడ ఎల్బీనగర్ వైపు వెళ్లాల్సి ఉండటంతో బాలకృష్ణ మూర్తి సోదరుడు దిగిపోయారు. ఆ తరువాత బాలకృష్ణమూర్తి డ్రైవింగ్ సీటులోకి వచ్చారు. ముందు సీట్లో భాస్కర్, వెనుక సీటులో శంకరమ్మ, రేణుక కూర్చున్నారు. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ వాహనం కీసర ఓఆర్ఆర్ ఎగ్జిట్ దాటి యాద్గార్పల్లి వరకు వెళ్లింది. అక్కడ ఎదురుగా వెళ్తున్న లారీ మరో లైన్ నుంచి వీరు ప్రయాణిస్తున్న లైన్లోకి వచ్చింది. గమనించిన బాలకృష్ణమూర్తి ప్రమాదాన్ని తప్పించుకోవడానికి కుడి వైపునకు తిప్పారు. కారు వేగంగా ఉండటంతో అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీ కొంది. ఈ ప్రభావంతో వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. వెనుక సీట్లలో కూర్చున్న శంకరమ్మ, రేణుకలు పైకి ఎగిరడంతో వారి తలలకు కారు టాప్ బలంగా తగిలింది. ఈ దుర్ఘటనలో వారిద్దరూ కారులోనే ప్రాణాలు వదిలారు. డ్రైవింగ్ చేస్తున్న బాలకృష్ణమూర్తి సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పటికీ స్టీరింగ్ బలంగా ముఖానికి తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఇతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సీట్ బెల్ట్ పెట్టుకున్న భాస్కర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను మూసాపేట ఆంజనేయనగర్‌లో కేవీఎం ప్రసాద్ నివాసానికి తరలించారు. అక్కడకు వచ్చిన నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, అదనపు సీపీ షికా గోయల్, సంయుక్త సీపీ అవినాష్ మహంతి నివాళుల్పించారు. చదవండి: Khammam: చిన్నారిపై బాలుడు అఘాయిత్యం -
కీసర ఔటర్ రింగ్‌రోడ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం
-
కీసరలో విషాదం: అవమానం భరించలేక కుటుంబం ఆత్మహత్య
సాక్షి, కీసర: ఓ వివాదం.. దాడి.. అవమానం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అవమానం భరించలేనంటూ జీవితంపై విరక్తి చెందాడు. భార్యా, ఇద్దరు కన్నబిడ్డలకు ఉరిపోశాడు. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయానికి ఓ కుటుంబం బలైంది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన శుక్రవారం కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కుషాయిగూడ అడిషనల్ డీసీపీ శివకుమార్, కీసర సీఐ నరేందర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా రాజపేట మండలం రేణిగుంటకు చెందిన భిక్షపతి (37), ఉష (33) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు అక్షిత (11) యశ్వంత్ (7). కొన్నేళ్లుగా నాగారంలోని వెస్ట్‌గాంధీనగర్‌లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. భిక్షపతి ఆటోనడుపుతూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఇంటి సమీపంలోని ఫిల్టర్ వాటర్ కంపెనీలో పనిచేస్తున్న ఓ మహిళ తన 15 ఏళ్ల కూతురుతో ఉంటోంది. ఆ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఆ బాలిక బంధువులు గురువారం సాయంత్రం భిక్షపతి ఇంటికొచ్చి గొడవకు దిగారు. అతడిపై దాడి చేశారు. ఇదే విషయమై శుక్రవారం పెద్దల సమక్షంలో మాట్లాడదామని చెప్పి భిక్షపతిని వదిలేశారు. శుక్రవారం ఉదయం భిక్షపతి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆటో తీసుకొని వెళ్తుండగా బాలిక కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భిక్షపతి ఇంట్లోకెళ్లాడు. మొదట భార్య, ఇద్దరు పిల్లలకు ఉరివేసి తర్వాత తానూ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను బాలికతో ఎంతమాత్రం అసభ్యంగా ప్రవర్తించలేదని, కొంతమంది కావాలని తనపై నింద వేసినట్లు గురువారం రాత్రి స్థానికులు, బంధువులకు భిక్షపతి చెప్పినట్లు సమాచారం. సూసైడ్‌నోట్ రాసి.. ఇరుగుపొరుగు వారి సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని భిక్షపతి ఇంట్లోకెళ్లి పరిశీలించగా భార్య, ఇద్దరు పిల్లలు విగత జీవులుగా మంచంపై పడి ఉన్నారు. భిక్షపతి ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతిచెందినట్లు గుర్తించారు. క్లూస్‌టీమ్‌ను రప్పించి ఆధారాలను సేకరించారు. ఓ సూసైడ్‌నోట్ కూడా దొరికింది. తమ చావులకు కారణమంటూ కొంతమంది పేర్లను భిక్షపతి రాసినట్లు గుర్తించారు. తర్వాత భిక్షపతి కుటుంబీకుల మృతదేహాలను తీసుకెళ్లనీయకుండా స్థానికులు, బంధువులు పోలీసులను అడ్డుకున్నారు. కారకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని, సూసైడ్‌నోట్‌లో పేర్కొన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుంటామని సీఐ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అనంతరం నాలుగు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు స్పందించి ఉంటే.. గురువారం రాత్రి భిక్షపతిపై దాడి జరిగిన సమయంలో ఆయన భార్య ఉష డయల్ 100కు ఫోన్ చేసి తన భర్తను కొడుతున్నారని చెప్పింది. దీంతో పోలీసులు అక్కడికి వచ్చారు. అప్పుడు గొడవకు దిగిన వారిలో కొందరు కులపెద్దల సమక్షంలో మాట్లాడి పరిష్కరించుకుంటామని చెప్పడంతో పోలీసులు తిరిగి వెళ్లిపోయినట్లు సమాచారం. గురువారం రాత్రే పోలీసులు సరిగ్గా స్పందించి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని స్థానికులు అన్నారు. ‘ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం. తనపై దాడి వల్లనే మనస్తాపానికి గురై భిక్షపతి ఇలా ఘాతుకానికి పాల్పడ్డాడా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తాం. నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం’అని కుషాయిగూడ అదనపు డీసీపీ శివకుమార్ చెప్పారు. -
నాగరాజు రెండో లాకర్లో భారీగా బంగారం
సాక్షి, హైదరాబాద్: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు బినామీ ఖాతాలో భారీగా బంగారం బయటపడింది. నాగరాజు బినామీ అయిన అల్వాల్‌కు చెందిన నందగోపాల్ అనే వ్యక్తి ఇంటిపై ఏసీబీ అధికారులు సోమవారం దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ దాడుల్లో నందగోపాల్ పేరిట అల్వాల్‌లోని ఐసీఐసీఐ బ్యాంకులో ఒక లాకర్, పీజే మహేందర్ కుమార్ పేరిట మేడ్చల్‌లోని ఐసీఐసీఐ బ్రాంచ్‌లో మరో లాకర్‌ను కూడా నాగరాజు, అతని భార్య స్వప్న వాడుతున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ లాకర్లను గురువారం అధికారులు తెరవగా నందగోపాల్ పేరిట ఉన్న లాకర్లో రూ.60 లక్షల విలువైన ఒక కిలో 250 గ్రాముల బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. నాగరాజుకు సంబంధించి ఇది రెండో లాకర్ కాగా, మూడో లాకర్లో రూ.4.5 లక్షల విలువచేసే 7.29 కిలోల బరువున్న 35 వెండిబిస్కట్లు బయటపడ్డాయి. వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, మొదటి లాకర్ అల్వాల్‌లోని సౌత్ ఇండియన్ బ్యాంకులో నాగరాజు సమీప బంధువు నరేందర్ పేరిట ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. సెప్టెంబర్ 2న ఈ లాకర్‌ను తెరిచిన ఏసీబీ రూ.57.6 లక్షల విలువ చేసే కిలోన్నర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. -
నాగరాజు లాకర్లలో భారీగా బంగారం
సాక్షి, మేడ్చల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కోటి రూపాయల అవినీతి కేసులో ఏసీబీ దూసుడు పెంచింది. విచారణ ఎదుర్కొంటూ ఇటీవల ఆయన ఆత్మహత్యకు పాల్పడటంలో కేసును మరింత వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే అల్వాల్ ఐసీఐసీఐ బ్యాంక్‌లో నాగరాజు లాకర్లను ఏసీబీ అధికారులు ఓపెన్ చేశారు. నాగరాజు బినామీ నందగోపాల్ పేరుతో ఉన్న ఈ లాకర్లో దాదాపు కేజీకిపైగా బంగారు ఆభరణాలను గుర్తించారు. బినామీ పేరుతో పెద్ద ఎత్తున్న ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించి ఏసీబీ... ఇతర ఖాతాలపై విచారణ చేస్తున్నారు. రెండు రోజలు క్రితం నందగోపాల్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించగా.. లాకర్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు లాకర్లు ఓపెన్ చేయగా.. పెద్ద ఎత్తున బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇంతకుముందు మరో బ్యాంక్ లాకర్లలో రెండు కేజీల బంగారాన్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే. (కీసర ఎమ్మార్వో మృతిపై సంచలన ఆరోపణలు) ఆగస్టు 14వ తేదీన నాగరాజు ఇంటిపైన దాడి చేసిన సమయంలో ఏసీబీ అధికారులకు ఓ బ్యాంకు లాకర్‌కు చెందిన తాళంచెవి లభించింది. అది నాగరాజు బంధువైన జి.జే.నరేందర్ పేరిట అల్వాల్‌లోని సౌత్ ఇండియన్ బ్యాంకు లాకర్‌గా ఏసీబీ గుర్తించింది. ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన సమయంలోనూ నాగరాజు లాకర్ విషయంలో సహకరించలేదని సమాచారం. ఎట్టకేలకు సదరు లాకర్‌ను తెరిచిన ఏసీబీ అధికారులకు అందులో 1532 గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయి. వాటిని సీజ్ చేసిన ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో డిపాజిట్ చేయనున్నారు. ప్రస్తుతం కేసులో పట్టుబడ్డ నిందితులంతా చంచల్ గూడ జైల్లోనే ఉన్నారు. -
మాజీ తహసీల్దార్ నాగరాజు వీడియో కాల్?!
సాక్షి, హైదరాబాద్: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు మృతి కేసులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. ఆయన చివరిసారిగా తన కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడారని తెలిసింది. ‘నేను ఏ తప్పు చేయలేదు.. అన్నీ ప్రాపర్‌గానే ఉన్నాయి. అన్నీ రికార్డ్స్ పరిశీలించాకే చేశాం. న్యాయవాదికి ఈ విషయాలు చెప్పి కోర్టులో తెలపాలి’అని నాగరాజు ఆ వీడియో కాల్లో కుటుంబసభ్యులను కోరినట్టు సమాచారం. బెయిల్‌పై బయటకు వచ్చాక కోర్టులో చూసుకుందామని ఆయన కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక నిన్న మీడియాతో మాట్లాడిన నాగరాజు కుటుంబ సభ్యులు, అతను ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నాగరాజు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఇది ముమ్మాటికీ హత్యేనని వారు వాదించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని శుక్రవారం తెలిపారు. కాగా, కోటి 10 లక్షల లంచం కేసులో నిందితుడిగా ఉన్న నాగరాజును నెలరోజులుగా ఏసీబీ విచారించింది. ఈక్రమంలోనే చంచలగూడ జైల్లో ఉన్న ఆయన గత బుధవారం ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించారు. నాగరాజు మృతిపై కస్టోడియల్ డెత్ కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: కీసర ఎమ్మార్వో మృతిపై సంచలన ఆరోపణలు) (చదవండి: కీసర మాజీ తాహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య!) -
కీసర నాగరాజా మజాకా!
సాక్షి, హైదరాబాద్: రూ.కోటి పది లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజుపై ఏసీబీ మరో కేసు నమోదు చేసింది. కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములను కె.ధర్మారెడ్డి అతని మనుషులకు అక్రమంగా ధారాదత్తం చేశాడన్న ఆరోపణలపై ఇటీవల విజిలెన్స్ విభాగం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా నాగరాజుపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఏసీబీ డీజీని ఆదేశించింది. దీంతో ఏసీబీ అధికారులు కుట్ర, అధికారదుర్వినిæయోగం ఆరోపణల కింద శుక్రవారం నాగరాజుతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని రాంపల్లి గ్రామపరిధిలో సర్వేనం 621లో కందాడి లక్ష్మమ్మ పేరిట 14 గుంటలు, సర్వే నం.623లో కందాడి బుచ్చిరెడ్డికి 33 గుంటలు, సర్వే నం.625లో కందాడి మీనమ్మ పేరిట 19 గుంటలు, సర్వే నం 633/ఏలో కందాడి ధర్మారెడ్డి పేరిట ఎకరం రెండు గుంటలకు జూలై 9వ తేదీన అప్పటి తహసీల్దార్‌గా ఉన్న నాగరాజు నిబంధనలకు విరుద్ధంగా డిజిటల్ సైన్లతో పాసుబుక్కులు జారీ చేశాడు. నాగరాజు మరికొందరితో కలిసి మొత్తంగా 24 ఎకరాల 16 గుంటల భూములకు నకిలీ పత్రాలు సృష్టించి, రికార్డులు తారుమారు చేసి ఈ నేరానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. ఈ విషయం కీసర ఆర్డీవో వద్ద ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నా అతనిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం.. ఈ భూముల ధర రూ.2.68 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్లో విలువ రూ.48.8 కోట్లుగా ఉంటుందని ఏసీబీ అంచనా వేస్తోంది. -
ఆ లంచం కేసుతో నాకు సంబంధం లేదు
సాక్షి, మేడ్చల్ జిల్లా: కీసర తహసీల్దార్ రూ.1.10 కోట్ల లంచం తీసుకున్న వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని సహించేది లేదన్నారు. కీసర తహసీల్దార్ విచారణ సమయంలో తనపై తప్పుడు ప్రచారం కొనసాగటంపై తీవ్రంగా స్పందించారు. శుక్రవారం ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ.. ‘మ్యుటేషన్ ప్రక్రియ తహసీల్దార్ పరిధిలోనే ఉంటుంది. కలెక్టర్ వద్దకు కనీసం ఫైలు కూడా రాదు.. ఈ కేసులో నా పాత్ర ఉందనే ఆరోపణలు మానుకోవాలి. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే న్యాయపరమైన చర్యలకు వెళ్లాల్సి వస్తుంది. ఎవరైనా కొత్త వ్యక్తులు సమస్యల తో వచ్చినప్పుడు విచారణ చేసి, నిబంధనల ప్రకారముంటేనే వాటిని పరిష్క రించాలని చెబుతాను. రోజూ విజిటింగ్ సమయంలో కలసిన ప్రతి ఆర్జీదారుకు సంబంధించిన విషయాలను సంబంధిత అధికారులకు తెలియజేస్తాం. ఆ అధి కారులూ నిబంధనల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది’అని అన్నారు. -
ఆన్లైన్ సెక్స్ రాకెట్.. నిర్వాహకుడిపై పీడీయాక్ట్
సాక్షి, హైదరాబాద్ : ఆన్లైన్లో వ్యభిచారం నిర్వహిస్తున్న కీసరకు చెందిన వంశీరెడ్డిపై రాచకొండ పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. ఉద్యోగం పేరుతో పశ్చిమ బెంగాల్ నుంచి అందమైన అమ్మాయిలను హైదరాబాద్‌కు తీసుకొచ్చి వారితో బలవంతంగా వ్యభిచారం చేయించేవాడు. ఆన్లైన్లో అమ్మాయిల ఫోటోలను పోస్ట్ చేసి విటులను ఆకర్షించేవాడు. నచ్చిన అమ్మాయిను వారి వద్దకు పంపించి రూ.వేలల్లో డబ్బు తీసుకునేవాడు. ఈ వ్యవహారం మొత్తం ఆన్లైన్లోనే సాగిపోయేది.(ఏడాదిన్నర చిన్నారి కిడ్నాప్ కేసు విషాదాంతం!) దీనిపై సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు వీరి స్థావరంపై దాడి చేసి అమ్మాయిలను రక్షించారు. వంశీరెడ్డితో పాటు అంజలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. యువతుల అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరించిన వంశీరెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశించారు. దీంతో పోలీసులు అతడిపై అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు.(పీఎన్బీ స్కాం : నీరవ్ భార్యకు రెడ్ కార్నర్ నోటీసు) -
వృద్ధాశ్రమం పేరిట చిత్రహింసలు
కీసర: మానసిక పరిస్థితి సరిగ్గా లేని వారు కొందరు.. మద్యం, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలైనవారు మరికొందరు.. పిల్లలకు దూరమైన వృద్ధులు ఇంకొందరు.. ఇలా 85 మందిని వృద్ధాశ్రమం పేరిట ఓ భవనంలో ఉంచి యజమానులు చిత్రహింసలు పెట్టేవారు. అనుమతి లేకుండానే నడుపుతున్న ఈ ఆశ్రమంలో ఇరుకు గదుల్లో అందరినీ కలిపి ఉంచి ఇబ్బందులకు గురి చేసేవారు. స్థానికుల ఫిర్యాదుతో మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారంలో సాగుతున్న ఈ ఆశ్రమ బాగోతం వెలుగులోకి వచ్చింది. నాగారంలోని శిల్పానగర్ కాలనీలో రెండు చిన్న భవనాలను జాన్ రతన్‌పాల్, కె.భారతి, అరుణాచలం, భాను అద్దెకు తీసుకొని నాలుగేళ్ల క్రితం మమత వృద్ధాశ్రమం ఆశ్రమం ఏర్పాటు చేశారు. కొన్నాళ్లకు పునరావాస కేంద్రాన్ని నెలకొల్పారు. మానసిక వికలాంగులతో పాటు మద్యం, గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడిన వ్యక్తులను వారి తల్లిదండ్రులు, బంధువులు.. నిర్వాహకులకు నెలకు రూ.4,000 నుంచి 15,000 వేల వరకు ఇచ్చి ఈ ఆశ్రమంలో చేర్పించారు. అయితే వీరికి సరిపోయే వసతులు ఇక్కడ లేకపోగా మానసిక పరిస్థితి సరిగా లేని వారిని గొలుసులతో నిర్బంధిం చారు. ఎవరైనా చెప్పినట్లు వినకుంటే నిర్వాహకులు కొట్టేవారని ఆరోపణలున్నాయి. అధికారుల విచారణ... రెండ్రోజుల క్రితం ఆశ్రమం నుంచి కేకలు వినిపించాయి. పక్కనే ఉన్న మోడీ అపార్ట్‌మెంట్‌వాసులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిం చగా నిర్వాహకులు అడ్డుకున్నారు. అక్కడి కాలనీవాసులు వారిని పక్కకు నెట్టి లోపలికి వెళ్లి చూడగా, గదుల్లో వృద్ధులు, మానసిక దివ్యాంగులు కనిపించారు. కొందరి శరీరంపై గాయాలుండటం గమనించి నిర్వాహకులను నిలదీశారు. పోలీసులకు సమాచారం అందించారు. మల్కాజ్గిరి డీసీపీ రక్షితమూర్తి, కుషా యిగూడ ఏసీపీ శివకుమార్, కీసర సీఐ నరేందర్‌గౌడ్‌తోపాటు మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారి స్వరూపరాణి, జిల్లా సఖి కేంద్రం అధికారి పద్మావతి ఆశ్రమానికి చేరుకుని విచారణ జరిపారు. ఓ భవనంలో 22 మంది మహిళలను, మరో భవనంలోని ఇరుకు గదుల్లో 63 మంది పురుషులను ఉంచడాన్ని అధికారులు పరిశీలించారు. ఆశ్రమాలకు తరలింపు... మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఎంవి. రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఆశ్రమంలోని వారిని శుక్రవారం ఇతర ఆశ్రమాలకు తరలించారు. జిల్లా వైద్యాధికారి డా.నారాయణ, మండల వైద్యాధికారి డా.సరిత వైద్య బృందంతో ఆశ్రమంలోని వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఐదుగురి మానసిక స్థితి బాగానే ఉండటంతో వారిని బంధువులకు అప్పగించా రు. ఆశ్రమ నిర్వాహకులపై కేసు నమోదు చేశామని, చర్యలు తీసుకుంటామని సీఐ నరేందర్‌గౌడ్ తెలిపారు. -
చెత్తకుప్పలో 10 సంచుల ఉత్తరాలు
సాక్షి, హైదరాబాద్ : నమ్మకంగా ఉత్తరాలను బట్వాడా చేయాల్సిన పోస్టల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆప్తులకు, అభ్యుర్థులకు చేరాల్సిన ఉత్తరాలను చెత్తకుప్పలో పడేశారు. ఈ ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణ చేపట్టారు. కీసరలోని బండ్లగూడ సమీపంలో ఉన్న ప్రజాసాయి గార్డెన్స్ గేట్ పక్కన వేలకొద్దీ ఉత్తరాలు చెత్తకుండీలో లభ్యమయ్యాయి. 10 సంచుల్లో ఉన్న లెటర్స్‌ను రాజిరెడ్డి అనే వ్యక్తి ముందుగా గుర్తించాడు. ఆయన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని అధికారులు కోరినట్లు తెలుస్తోంది. ఉత్తరాల్లో ఎక్కువ భాగం కూకట్పల్లి, షాద్‌నగర్, బాలానగర్, జగద్గిరిగుట్ట ప్రాంతాల అడ్రస్‌లతో ఉండటం గమనార్హం. ఎవరైనా కావాలని చేశారా, డ్యూటీ చేయలేక పోస్టల్ సిబ్బందే నిర్లక్ష్యంతో పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. లెటర్స్‌ను బట్వాడా చేయకపోవంతో కొందరు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని సీఐ నరేందర్ గౌడ్ అభిప్రాయపడ్డారు. -
ఫారెస్ట్ అధికారుల తీరుపై కలెక్టర్ అసహనం
సాక్షి, కీసర: కీసరగుట్ట అటవీప్రాంతాన్ని దత్తత తీసుకొని ఎంపీ సంతోష్‌కుమార్ హరితహారంలో భాగంగా ఇటీవల పెద్దఎత్తున మొక్కలు నాటిని విషయం తెలిసిందే. మంగళవారం కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆ ప్రాంతాన్నిపరిశీలించారు. మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఫారెస్టు అధికారుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మొక్కలు నాటి 15 రోజులు కావొస్తున్నా వాటికి సపోర్టు కర్రలు ఎందుకు నాటలేదని, చనిపోయిన మొక్కల స్థానంలో మళ్లీ ఎందుకు నాటలేదని అటవీశాఖ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మొక్కలను నాటినప్పటి నుంచి ఫీల్డ్‌ఆఫీసర్ ఇటు పక్కకు రాలేదని, నాటిన మొక్కలను సంరక్షించనందుకు కీసర ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా అటవీశాఖ అధికారి సుధాకర్‌రెడ్డిని ఆదేశించారు. అనంతరం గుట్టలో గల ఆర్అండ్బి అతిథిగృహంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. కీసరగుట్ట అబివృద్ధికి ప్రణాళికను తయారు చేసి వెంటనే ప్రతిపాదనలు పంపాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కీసరగుట్టలోని ఎంట్రెన్స్‌లో గల సిమెంట్ నంది విగ్రహాన్ని మార్చి, దానిస్థానంలో రాతితో చెక్కించి నంది విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కీసరగుట్ట జాతర సందర్భంగా పార్కింగ్ ఇబ్బందులు ఏర్పడకుండా స్థలాన్ని గుర్తించాలని తహసీల్దార్ నాగరాజుకు సూచించారు. జెడ్పీ వైస్‌చైర్మన్ బెస్త వెంకటేష్, డీఆర్డీఏ పీఓ కౌటిల్యారెడ్డి, సీపీఓ సౌమ్య, ఎంపీపీ ఇందిర వైస్ ఎంపీపీ సత్తిరెడ్డి, ఆలయ చైర్మన్ తటాకం నారాయణశర్మ, సర్పంచ్ మాధురి, ఉపసర్పంచ్ కందాడి బాలమణి పాల్గొన్నారు. -
స్కూటీపై వెళ్తుండగా చేతిని ‘ముద్దాడిన’ నాగుపాము..
సాక్షి, హైదరాబాద్ : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లిలో నాగుపాము హల్చల్ చేసింది. స్కూటీలో దూరి ఓ వ్యక్తికి చెమటలు పట్టించింది. యాదాద్రి జిల్లా చీకటి మామిడికి చెందిన రాములు ఎఫ్‌సీఐలో ఉద్యోగం చేస్తున్నాడు. రోజూమాదిరిగానే మంగళవారం ఉదయం స్కూటీ తీసుకుని ఉద్యోగానికి బయలుదేరాడు. రాంపల్లి మహంకాళి ఆలయం వద్దకు రాగానే ఆయన చేతిని ఏదో తాకుతున్నట్టుగా అనిపించింది. దాంతో స్కూటీని ఆపి చూడగా హెడ్‌లైట్‌లో నక్కి ఉన్న నాగుపాము పిల్ల కనిపించింది. ఒక్కసారిగా షాక్‌కు గురైన రాములు స్కూటీని పక్కనపడేసి.. అక్కడే ఉన్న మహంకాళి ఆలయ చైర్మన్ రామారం వినోగ్గౌడ్కు విషయం చెప్పాడు. వినోగ్గౌడ్ పాములు పట్టే ఎరుకలి మైసయ్యను పిలిపించాడు. స్కూటీ హెడ్‌లైట్‌లో దాగున్న పామును బయటకు తీయించి అడవిలో వదిలేశారు. రాములుకు ప్రథమ చికిత్స చేయించారు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని అతను ఊపిరి పీల్చుకున్నాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
అడవి నవ్వింది!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ హైదరాబాద్ శివార్లలోని కీసరగుట్ట అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు. తన పుట్టినరోజు (జూలై 24) సందర్భంగా దుబారా ఖర్చులు చేయకుండా సమాజహితం కోసం సాయం చేయాలంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విసిరిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ చాలెంజ్‌కు స్పందనగా ఎంపీ సంతోష్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 2,042 ఎకరాల అడవిలోని కొంత భాగాన్ని ఎంపీ నిధులతో ఎకో టూరిజం ప్రాజెక్టుగా అభివృద్ధి చేసి, మిగతా ప్రాంతాన్ని అటవీ పునరుజ్జీవనం కింద రక్షిత అటవీ ప్రాంతంగా మారుస్తామని ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు. త్వరలోనే కీసరగుట్ట అటవీ ప్రాంతంలో పర్యటించి అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు అద్భుతంగా ఉన్నాయని, పట్టణ ప్రాంత వాసులు సేదతీరేందుకు, ఆరోగ్యకర జీవనవిధానం అలవర్చుకునేందుకు ఇవి తోడ్పాటునిస్తాయని ఆయన పేర్కొన్నారు. అటవీ ప్రాంతాలు, అర్బన్ లంగ్ స్పేస్‌ల అభివృద్ధిలో పాలుపంచుకోవాల్సిందిగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ఛాలెంజ్ విసిరారు. తన ట్విట్టర్ ద్వారా మాజీ ఎంపీ కవిత, హీరోలు విజయ్ దేవరకొండ, నితిన్, దర్శకుడు వంశీ పైడిపల్లి, పారిశ్రామికవేత్త ముత్తా గౌతమ్‌లను ట్యాగ్ చేశారు. మంచి నిర్ణయంలో తనను కూడా భాగస్వామ్యం చేసినందుకు సంతోష్ కుమా ర్కు వంశీ పైడిపల్లి కృతజ్ఞతలు తెలిపారు. -
విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాల పంపిణీ
సాక్షి, నాగారం: స్వచ్ఛంద సంస్థ ‘బీ ద చేంజ్’ సౌజన్యంతో ఆషీ ఫౌండేషన్ సభ్యులు శనివారం నాగారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు పంపిణీ చేశారు. వీటితో పాటు వాటర్ బాటిళ్లు, పెన్నులు కూడా ఇచ్చారు. దాదాపు వంద మంది విద్యార్థులకు వీటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు మల్లారెడ్డితో పాటు స్వచ్ఛంద సంస్థల వలంటీర్లు పవిత్ర, కావ్య, సౌమ్య, జయ, భార్గవ్, రామకృష్ణ పాల్గొన్నారు. పేద విద్యార్థుల చదువు ఆగిపోకూడదన్న ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు వలంటీర్లు తెలిపారు. జూపార్క్, చార్మినార్, గోల్కొండ కోట ప్రదేశాలకు పేద విద్యార్థులను తీసుకెళ్లి వారి ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తున్నామని చెప్పారు. వలంటీర్లు వచ్చిన వచ్చిన వారంతా కాలేజీ విద్యార్థులే కావడం విశేషం. చిన్న వయసులోనే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న వీరిని పాఠశాల సిబ్బంది అభినందించారు. తమకు ఉచితంగా బ్యాగులు, పుస్తకాలు పంపిణీ చేసినందుకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.