
ఎండిపోయిన కీసర చెరువు
సాక్షి,మేడ్చల్ జిల్లా: హైదరాబాద్ మహానగరంలో భాగమైన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పడి పోయాయి. గతేడాది ఫిబ్రవరి‡లో జిల్లాలో సగటున భూగర్భ జలమట్టం 9.88 కాగా, ఈ ఏడాది భూగర్భ జల మట్టంతో పోలిస్తే 4.44 మీటర్ల మేర నీటి మట్టం తగ్గింది. ఈ సారి పాతాళ గంగ 14.32 మీటర్లు లోతుకు పడిపోయింది. నగరానికి నీటిని అందించే జలశయాల్లో నీటి మట్టాలు ఆశాజనకంగా లేకపోవటంతో తాగునీటికి ఇబ్బందులు తçప్పక పోవచ్చునని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే శివారు ప్రాంతాల్లో ఉండే ప్రైవేట్ నీటి సరఫరాదారులు, ఫ్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లకు చెందిన కొందరు అక్రమదారులు భూగర్భ జలమట్టాలను విచక్షణ రహితంగా తోడి జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తుండటంతో ప్రమాదం పొంచి ఉందన్న అందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని భావిస్తున్న పలు ప్రాంతాలను గుర్తించిన అధికార యంత్రాంగం అవసరమైన ప్రాంతాలకు వేసవిలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో 104 గ్రామాలకు గోదావరి జలాలను అందించే మిషన్ భగీరథ పనులు పూర్తవటంతో ఆయా గ్రామాల్లోని ప్రజలకు తాగునీటి సమస్యలకు ఇబ్బందులు ఉండకపోవచ్చునని జిల్లా అధికార యంత్రాంగం చెబుతోంది.
రోజూ భారీగా తాగునీటి ఖర్చు
మేడిపల్లి మండలంలో గత ఫిబ్రవరితో పోల్చితే ఈ ఫిబ్రవరిలో భూగర్భ జలమట్టం 6.48 మీటర్ల లోతుకు పడిపోగా, మల్కాజిగిరిలో 7.15 మీటర్ల లోతుకు పడిపోయింది. అలాగే, కుత్బుల్లాపూర్‌లో 9.08 మీటర్లు, కాప్రాలో 6.76 మీటర్లు, దుండిగల్‌లో 8.22 మీటర్లు, మేడ్చల్‌లో 3.88 మీటర్లు, కీసరలో 3.87 మీటర్లు, అల్వాల్‌లో 3.65 మీటర్ల లోతులో భూగర్భ జలమట్టం పడిపోయింది. దీంతో జిల్లాలో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. జిల్లా పరిధిలో ఓఆర్‌ఆర్ లోపలి ప్రాంతాలకు తాగునీరందించే మిషన్ భగీరథ పథకం పనులు పూర్తి కాకపోవటంతో ఆయా ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉంది.
బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపాలిటీల్లోని పలు కాలనీలు, బస్తీలు, అపార్టుమెంట్‌లలో నివసిస్తున్న కుటుంబాలు రోజు వారీ అవసరాలకు వినియోగించే వాటర్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఈ రెండు మున్సిపాలిటీల పరిధిలో 120 అపార్టుమెంట్లు ఉండగా, ఒక్కొక్క అపార్టుమెంట్‌కు రోజుకు రెండు ట్యాంకర్ల చొప్పున నీటి వినియోగం అవసరం. ఈ లెక్కన ఒక ట్యాంకర్ నీటికి రూ.500 చొప్పున రెండు ట్యాంకర్లకు రూ.1,000 ప్రతి రోజు ఒక అపార్టు మెంట్ వాసులు వెచ్చిస్తున్నారు. 120 అపార్టుమెంట్స్ వారు తాగునీరు కాకుండానే ఇతర అవసరాల కోసం వినియోగించే నీటి కోసం రోజుకు రూ.1.20 లక్షల చొప్పున నెలకు రూ.36 లక్షలు వెచ్చిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన నాగారం, జవహర్‌నగర్, దమ్మాయిగూడ, ఘట్‌కేసర్ మున్సిపాలిటీల్లో కూడా నీటి సమస్య తీవ్రంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment