కీసర : వేగంగా వచ్చిన లారీ, కారుని ఢీకొట్టడంతో ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన కారు డ్రైవర్ ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
కరీంగూడ నుంచి రాంపల్లి వైపు అతివేగంగా వస్తున్న లారీ కుషాయిగూడ నుంచి వెళ్తున్న కారును రాంపల్లి చౌరస్తా వద్ద ఢీకొట్టింది. దీంతో ప్రమాదం నుంచి తప్పించడానికి డ్రైవర్ చేసిన ప్రయత్నంలో కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ మీద ప్రయాణిస్తున్నభార్యభర్తలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారు ఘట్‌కేసర్ మండలం ఎన్నంపేట గ్రామానికి చెందిన బహదూర్ అలి, ముంతాజ్ బేగం గా గుర్తించారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.