Keesara Crime News: 4 Members In Same Family Commits Suicide In Keesara - Sakshi
Sakshi News home page

కీసరలో విషాదం: అవమానం భరించలేక కుటుంబం ఆత్మహత్య

Published Sat, Jun 5 2021 5:17 AM | Last Updated on Sat, Jun 5 2021 9:27 AM

4 Members Of a Family Deceased In Keesara - Sakshi

మంచంపై విగతజీవులుగా పడివున్న ఉష, ఇద్దరు పిల్లలు

సాక్షి, కీసర: ఓ వివాదం.. దాడి.. అవమానం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అవమానం భరించలేనంటూ జీవితంపై విరక్తి చెందాడు. భార్యా, ఇద్దరు కన్నబిడ్డలకు ఉరిపోశాడు. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయానికి ఓ కుటుంబం బలైంది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన శుక్రవారం కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. కుషాయిగూడ అడిషనల్‌ డీసీపీ శివకుమార్, కీసర సీఐ నరేందర్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా రాజపేట మండలం రేణిగుంటకు చెందిన భిక్షపతి (37), ఉష (33) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు అక్షిత (11) యశ్వంత్‌ (7). కొన్నేళ్లుగా నాగారంలోని వెస్ట్‌గాంధీనగర్‌లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. భిక్షపతి ఆటోనడుపుతూ కాలం వెళ్లదీస్తున్నాడు.

ఇంటి సమీపంలోని ఫిల్టర్‌ వాటర్‌ కంపెనీలో పనిచేస్తున్న ఓ మహిళ తన 15 ఏళ్ల కూతురుతో ఉంటోంది. ఆ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఆ బాలిక బంధువులు గురువారం సాయంత్రం భిక్షపతి ఇంటికొచ్చి గొడవకు దిగారు. అతడిపై దాడి చేశారు. ఇదే విషయమై శుక్రవారం పెద్దల సమక్షంలో మాట్లాడదామని చెప్పి భిక్షపతిని వదిలేశారు. శుక్రవారం ఉదయం భిక్షపతి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆటో తీసుకొని వెళ్తుండగా బాలిక కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భిక్షపతి ఇంట్లోకెళ్లాడు. మొదట భార్య, ఇద్దరు పిల్లలకు ఉరివేసి తర్వాత తానూ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను బాలికతో ఎంతమాత్రం అసభ్యంగా ప్రవర్తించలేదని, కొంతమంది కావాలని తనపై నింద వేసినట్లు గురువారం రాత్రి స్థానికులు, బంధువులకు భిక్షపతి చెప్పినట్లు సమాచారం. 

సూసైడ్‌నోట్‌ రాసి.. 
ఇరుగుపొరుగు వారి సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని భిక్షపతి ఇంట్లోకెళ్లి పరిశీలించగా భార్య, ఇద్దరు పిల్లలు విగత జీవులుగా మంచంపై పడి ఉన్నారు. భిక్షపతి ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతిచెందినట్లు గుర్తించారు. క్లూస్‌టీమ్‌ను రప్పించి ఆధారాలను సేకరించారు. ఓ సూసైడ్‌నోట్‌ కూడా దొరికింది. తమ చావులకు కారణమంటూ కొంతమంది పేర్లను భిక్షపతి రాసినట్లు గుర్తించారు. తర్వాత భిక్షపతి కుటుంబీకుల మృతదేహాలను తీసుకెళ్లనీయకుండా స్థానికులు, బంధువులు పోలీసులను అడ్డుకున్నారు. కారకులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ ధర్నాకు దిగారు. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని, సూసైడ్‌నోట్‌లో పేర్కొన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుంటామని సీఐ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అనంతరం నాలుగు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు స్పందించి ఉంటే..
గురువారం రాత్రి భిక్షపతిపై దాడి జరిగిన సమయంలో ఆయన భార్య ఉష డయల్‌ 100కు ఫోన్‌ చేసి తన భర్తను కొడుతున్నారని చెప్పింది. దీంతో పోలీసులు అక్కడికి వచ్చారు. అప్పుడు గొడవకు దిగిన వారిలో కొందరు కులపెద్దల సమక్షంలో మాట్లాడి పరిష్కరించుకుంటామని చెప్పడంతో పోలీసులు తిరిగి వెళ్లిపోయినట్లు సమాచారం. గురువారం రాత్రే పోలీసులు సరిగ్గా స్పందించి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని స్థానికులు అన్నారు. ‘ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం. తనపై దాడి వల్లనే మనస్తాపానికి గురై భిక్షపతి ఇలా ఘాతుకానికి పాల్పడ్డాడా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తాం. నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం’అని కుషాయిగూడ అదనపు డీసీపీ శివకుమార్‌ చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement