కీసర, న్యూస్‌లైన్: ఉదయం సాయంత్రం తేడా లేదు.. భీకరమైన శబ్దాలు.. పిల్లలు ఉలిక్కిపడి లేస్తున్నా.. పగలూరాత్రి అని ఆలోచించరు. పల్లెలన్నీ తల్లడిల్లుతున్నా.. మైనింగ్ ఆపరు. చరిత్రాత్మక ఆలయానికి పగుళ్లు వస్తు న్నా.. వారికేం పట్టదు. అక్రమార్కులు, అధికారులు ఒక్కటిగా సాగిస్తున్న బ్లాస్టింగ్‌ల పర్వం కీసర ప్రాంత ప్రజ లను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కొన్నాళ్ల క్రితం వరకు ఉదయం, సాయంత్రం మాత్రమే జరిగిన బ్లాస్టిం గ్‌లు ఇప్పుడు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. కీసర మండలంలోని కీసరగుట్ట, అంకిరెడ్డిపల్లి, తిమ్మాయిపల్లి సమీప ప్రాంతాల్లోని గుట్టలను యధేచ్చగా పేల్చేస్తున్నారు. అడ్డూఅదుపు లేకుం డా ఇష్టారాజ్యంగా సాగుతున్న ఈ బ్లాస్టింగ్‌లకు పరోక్షంగా అధికారులు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
పెద్దపెద్ద బండరాళ్లను పేల్చేయడానికి పరిమితికి మించి పేలుడు పదార్థాలను ఉపయోగించి 20 అడుగుల వరకు డ్రిల్లింగ్ చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నారు. సమీపంలోని నివాస ప్రాంతాలు ఈ భారీ శబ్దాలకు వణికిపోతున్నాయి. భూకంప ప్రకంపనలను పోలి ఉంటున్నాయని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. పేలుళ్ల కారణంగా ఇప్పటికే కీసర, భోగారం, తిమ్మాయిపల్లి, అంకిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. పేలుళ్ల కారణంగా ప్రసిద్ధ శైవక్షేత్రమైన కీసరగుట్టకు ముప్పు పొంచిఉంది. అప్పట్లో స్థానిక ప్రజలు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేయడంతో అప్పటి రెవెన్యూ మంత్రి దేవేందర్ గౌడ్ కీసరగుట్ట చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్లాస్టింగ్‌లను నిషేధించారు. కాని కొన్ని నెలలే నిషేధం కొనసాగింది.
ఆ తర్వాత అధికారుల అండతో మళ్లీ వ్యాపారులు బ్లాస్టింగ్‌లను ప్రారంభించారు. గ్రానైట్ పరిశ్రమ వల్ల వేలాది కుటుంబాలు బతుకుతున్నాయని, పరిమితులతో కూడిన పేలుళ్లు జరుపుతామని, మితంగా పేలుడు పదార్ధాలు వాడుతామని లాబీయింగ్ చేశారు. కీసరగుట్ట సమీపంలో కేవలం చేతితోనే రాళ్లకు పగులగొట్టేందుకు, గుట్టకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో పరిమిత పేలుడు పదార్థాలు మాత్రమే వినియోగానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ ఆ నిబంధనలు వ్యాపారుల ఆగడాలను ఆపలేకపోయాయి. కీసరగుట్ట దిగువ ప్రాంతమైన వన్నిగూడలోనే అతిపెద్ద కంకర మిషన్ ఏర్పాటు చేసి క్రషింగ్ చేస్తున్నారు. అసైన్డ్ భూములు కలిగి ఉన్న రైతులకు అంతోఇంతో ముట్టజెప్పి వందలాది ఎకరాలను చేజిక్కిం చుకుని అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులతో మంచి ‘బంధాన్ని’ కొనసాగిస్తూ ఎవరూ అడ్డుపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇన్నేళ్లుగా మైనింగ్ జరుపుతున్నా సమీప గ్రామాలకు నామమాత్రపు రాయల్టీ చెల్లించలేదు. మైనింగ్ శాఖ బకాయి పడిన కోట్లాది రూపాయలను చెల్లించాలని గత మండల పరి షత్ పాలకవర్గం ఎంతపోరు పెట్టినా ప్రయోజనం లేకపోయింది. అనుమతులకు మించి పేలుళ్లకు పాల్పడుతున్నారని ఎన్నోమార్లు ప్రజలు ఫిర్యాదు చేసినా అధికారులెవరూ చర్యలకు ముందుకు రాలేదు. బ్లాస్టింగ్‌లకు సంబంధించి ప్రాథమిక నియమాల ప్రకారం శబ్దతీవ్రత ఎంతవరకు ఉండాలో నిర్ణయించారు. వీటిని క్రషర్ మిషన్ల వ్యాపారులు పట్టించుకోవడం లేదు. ఇక బ్లాస్టింగ్ సమయంలో సమీప పొలాలన్నీ రాళ్లతో నిండిపోతున్నాయి. చిన్నసైజు నుంచి పెద్ద సైజు రాళ్లను తొలగించుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కొన్నిమార్లు ఆ ప్రదేశాల్లో రైతులు ఉన్నప్పుడే పేలుళ్లకు పాల్పడుతున్నారు. దీంతో రైతులు పొలాల వద్దకు వెళ్లాలంటేనే జంకుతున్నారు.
గుడి గోపురాలకు దెబ్బ
కీసరగుట్టకు అతి సమీపంలోనే క్రషర్ మిషన్లు ఏర్పాటు చేయడం వల్ల ఆలయానికి ప్రమాదం పొంచి ఉంది. ప్రమాదకర బ్లాస్టింగ్‌ల మూలంగా దేవాలయ గోపురాలు దెబ్బతింటున్నాయి. గతంలో దేవాలయానికి సమీపంలో ఐదు కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి పేలుళ్లు చేపట్టవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆ ఆదేశాలు అమలు కావడంలేదు.
- తటాకం వెంకటేష్. కీసర
ఇళ్ల గోడలకు పగుళ్లు
గ్రామాలకు అతి సమీపంలో పేలుళ్లకు పాల్పడడంతో ఇళ్ల గోడలకు పగుళ్లు వస్తున్నాయి. పేలుడు జరిగినప్పుడు ఇళ్ల కిటికీల అద్దాలు పగులుతున్నాయి. భారీ శబ్దాల మూలంగా చిన్నారులు భయపడిపోతున్నారు. సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లో రాళ్లు పడుతున్నాయి.
- రాజలింగంగౌడ్, తిమ్మాయిపల్లి గ్రామం
అక్రమాలపై చర్యలు తీసుకోవాలి
కీసర మండలంలోని వివిధ గ్రామాలకు సమీపంలో వ్యాపారులు పెద్ద సంఖ్యలో క్రషర్ మిషన్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, అసైన్డ్ స్థలాల్లో పరిమితికి మంచి బ్లాస్టింగ్‌లు చేస్తున్నారు. వెంటనే అధికారులు చర్యలకు దిగాలి. లేదంటే ప్రజలతో కలిసి ఉద్యమిస్తాం.
- చినింగని గణేష్, సర్పంచ్, కీసర
పంచాయతీలకు రాయల్టీ ఇవ్వాలి
చాలా ఏళ్లుగా క్రషర్ మిషన్లు కొనసాగుతున్నా గ్రామ పంచాయతీలకు రాయల్టీ రావడం లేదు. మండలంలోని కీసర, భోగారం, అంకిరెడ్డిపల్లి, తిమ్మాయిపల్లి గ్రామ పంచాయతీలకు పెద్ద మొత్తంలో రావాల్సిన రాయల్టీని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి.
- ముప్పురాంరెడ్డి, నాగారం
పల్లెల గుండెల్లో పేలుళ్లు
Published Sat, Dec 14 2013 1:05 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement