Mining blasting
-
ఇక్కడ రోజూ భూకంపమే..
సాక్షి, కరీంనగర్ : పచ్చని చెట్లు.. జలకళతో చెరువు... పక్షుల కిలకిలరాగాలు.. వ్యవసాయమే ఊపిరిగా బతికే పల్లె ప్రజలు.. పాడి పంటలతో ఆరేళ్ల క్రితం వరకు ఆ ఊరంతా కళకళలాడేది. సింగరేణి రంగప్రవేశంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పంటచేలు కనుమరుగయ్యాయి. ఊరు బొందలగడ్డగా మారింది. అభివృద్ధికి బొగ్గు అవసరమని, ఊరి భూగర్భంలో బొగ్గు నిల్వలున్నాయని అధికారులు గ్రామస్తులకు చెప్పి పంట భూములు, ఇళ్లు సేకరించారు. అభివృద్ధికి అడ్డుకావొద్దని గ్రామస్తులూ సహకరించారు. పరిహారంతోపాటు పునరావాసం కింద ఇళ్లు నిర్మిచుకునేందుకు ప్లాట్లు కేటాయిస్తామని సింగరేణి హామీ ఇచ్చింది. ఆరేళ్లు గడిచాయి. సింగరేణి బొగ్గు తవ్వుకుపోతోంది. సర్వం ధారపోసిన నిర్వాసితుల బతుకులు మాత్రం ఆగమయ్యాయి. పంట భూములకు పరిహారం ఇచ్చిన సింగరేణి యాజమాన్యం పునరావాసం కోసం ప్లాట్లు కేటాయించడంలో జాప్యం చేస్తోంది. కోర్టు కేసులు పునరావాసానికి ఆటంకంగా మారాయి. దీంతో రామగిరి మండలం లద్నాపూర్‌లోని ఓసీపీ–2 ప్రభావిత ప్రజలు నిత్య బ్లాస్టింగ్లతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. లద్నాపూర్ ప్రొఫైల్ నివాస గృహాలు 1280 సింగరేణి తీసుకున్న ఇళ్లు 720 ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందాల్సిన వారు 400 సింగరేణి సంస్థ రామగుండం–3 డివిజన్ పరిధిలోని ఓసీపీ–2లో బొగ్గు ఉత్పత్తి కోసం నిత్యం జరిపే బ్లాస్టింగ్‌లకు రామగిరి మండలం లద్నాపూర్ వాసులు భయంభయంగా బతుకుబండి సాగిస్తు న్నారు. ఓసీపీ–2 విస్తరణ కోసం ఆరేళ్లక్రితం గ్రామపరిధిలోని భూసేకరణ చేపట్టింది.ఇప్పటి వరకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లించక, పునరావసం కల్పించకపోవడంతో తమ బతుకులతో అధికారులు చెలగాటమాడుతున్నారని నిర్వాసితులు కన్నీరుపెడుతున్నారు. ఊరును ఆనుకుని ఓసీపీ–2లో నిత్యం జరిపే బ్లాస్టింగ్లతో ఎప్పుడు ఎటువైపు నుంచి బండరాయి వచ్చి పడుతుందో, భూప్రకంపనలకు ఇంటికప్పు కూలి మీద పడుతుందోనని దినమొక గండంగా కాలం వెళ్లదీస్తున్నారు. బ్లాస్టింగ్ సమయంలో సింగరేణి సిబ్బంది తమను బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని ఆదేశిస్తున్నారని, ఇళ్లలో ఉంటే పేలుడు జరిపిన సమయంలో భూకంపం వచ్చినట్లు అవుతోందని, వస్తువులు కింద పడుతున్నాయని పేర్కొటున్నారు.బ్లాస్టింగ్ల ధాటికి గోడలు బీటలు వారాయని, బండరాళ్లు ఎగిరొచ్చి పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుమ్ముతో రోగాలు.. బ్లాస్టింగ్ అనంతరం ఊరంతటిని దుమ్ము ధూళి కప్పేస్తోందని, పేలుడు పదార్థాలతో సుమారు రెండు గంటలు దుర్వాసన వస్తోందని లద్నాపూర్ వాసులు తెలిపారు.వృద్ధులు, చిన్నపిల్లలు వ్యాధులబారిన పడుతున్నారన్నారు. అధికారులను ప్రశ్నిస్తే వీలైనంత త్వరగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇస్తామని, పునరావసం కల్పించి గ్రామాన్ని ఖాళీ చేయిస్తామంటూ కాలయాపన చేస్తున్నారని వాపోతున్నారు. హైకోర్టులో పునరావాసం భూములు.. ఓసీపీ–2 విస్తరణ కోసం లద్నాపూర్‌లో భూసేకరణ చేపట్టిన సింగరేణి నిర్వాసితులకు అదే గ్రామ శివారులోని ప్రభుత్వ భూమితోపాటు పట్టా భూములను కొనుగోలు చేసి పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రైవేటు భూసేకరణ చేసేందుకు అవార్డ్ పాస్ చేసింది. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తమ సంతకాలను పోర్జరీ చేసి అక్రమంగా అవార్డ్ పాస్ చేశారని, ప్రైవేటు భూముల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. పునరావాసం కోసం సేకరించిన భూముల అంశం కోర్టులో ఉండడంతో తీర్పు వెలువడే వరకూ సింగరేణి ఏమీ చేయలని పరిస్థితి నెలకొంద పరిహారం ఇవ్వకుండానే కాలువ మళ్లింపు.. నిర్వాసితులకు ప్యాకేజీ, పునరావసం కల్పించకుండానే సింగరేణి అధికారులు గ్రామాన్ని ఆనుకుని ఉన్న ఎస్సారెస్పీ ఎల్–6 కాలువ మళ్లింపు పనులు చేపట్టారు. ఈ కాలువ ఓసీపీ – 2కు ఆటంకంగా మారడంతో మళ్లిస్తున్నారు. పనులు పూర్తయితే తమను పట్టించుకునే నాథుడే ఉండడని నిర్వాసితులు వారం రోజులుగా పనులను అడ్డుకుని ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఎల్–6 కాలువను యుద్ధ ప్రాతిపదికన మళ్లించకపోతే ఓసీపీ–2, ఏఎల్పీ గనుల మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి నెలకొంది. చెప్పిందొకటి.. చేసిందొకటి.. కాలువ పనులను అడ్డుకున్న నిర్వాసితులను ఆరు రోజుల క్రితం చర్చలకు అహ్వానించిన అధికారులు కలెక్టర్ సమక్షంలో సమస్య పరిష్కారిస్తామని తెలిపారు. మరుసటి రోజు ఓబీ కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికులుగా పని చేస్తున్న నిర్వాసితులను విధులకు అనుమతించలేదు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఓసీపీ క్వారీలో భైఠాయించారు. అదే సమయంలోనే అధికారులు బ్లాస్లింగ్ చేయడంతో ఆగ్రహించిన నిర్వాసితులు అధికారులను నిలదీశారు. గోదా వరిఖని ఏసీపీ ఉమేందర్ జోక్యంతో నిర్వాసితులు ఆర్డీవో నగేశ్‌తో చర్చలు జరిపారు. మంగళవారం కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్‌తో సమావేశం ఏర్పాటు చేయించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరో చోట పునరారాసం..! ఎల్–6 కాలువ మళ్లింపు అత్యవసరం దృష్ట్యా లద్నాపూర్ నిర్వాసితులకు గ్రామ శివారులో కాకుండా మరో ప్రదేశంలో పునరావసం కల్పించాలనే ఆలోచన లో సింగరేణి అధికారులు ఉన్నట్లు సమాచారం. నిర్వాసితుల సమస్య పరిష్కరించకపోతే కాలువ మళ్లిం పు పనులు సాగవని అంచనాకు వచ్చిన సింగరేణి అధికారులు సూచనప్రాయంగా స్థానిక జేఎన్టీయూ కళాశాల సమీపంలోని బొక్కల వాగు వద్ద పునరావసం కల్పించాలని ఆలోచన చేస్తున్నట్లు తెలి సిం ది.సెంటినరీకాలనీలోని రామాలయం వెనక పునరావసం కల్పిస్తే తమకు అభ్యంతరం లేదని నిర్వాసితులు పేర్కొంటున్నారు. మంగళవారం నాటి చర్చల్లో ఏ నిర్ణయం తీసుకుంటారోనని సింగరేణి యాజమా న్యం,అధికారులు,నిర్వాసితులుఎదురు చూస్తున్నారు. బ్లాస్టింగ్ సమయంలో కర్ఫ్యూను తలపిస్తున్న రహదారి, బ్లాస్టింగ్ సమయంలో నిర్వాసితులు బయటకు రాకుండా కాపలా కాస్తున్న సింగరేణి సిబ్బంది ఇళ్లపై రాళ్లు.. మేము నివాసం ఉంటున్న ఇండ్లకు సమీపంలోనే సింగరేణోళ్లు బ్లాస్టింగ్ చేస్తున్నరు. దీంతో పెద్దపెద్ద బండరాళ్లు వచ్చి ఇండ్లమీద పడుతున్నాయ్. మా బాధ ఎవరికి చెప్పినా పట్టించుకుంటలేరు. నిత్యం చచ్చిబతుకుతున్నం. – పిల్లిట్ల నాగలక్ష్మి, నిర్వాసితురాలు ఎల్– 6 మళ్లించొద్దు నిర్వాసితులకు ఆరేళ్లుగా పునరావసం కల్పించకుండా మభ్యపెడుతున్నారు. ఎల్–6 కాలువ మళ్లింపు పూర్తయితే మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. మా సమస్య పరిష్కరించే వరకూ కాలువ మళ్లింపు పనులు చేయొద్దు. – పోరెడ్డి వెంకటరమణారెడ్డి, నిర్వాసితుడు -
'గుట్ట'కాయ స్వాహా!
సాక్షి, మెదక్: గుట్టలు కనిపిస్తే చాలు.. అక్రమార్కులు గుటకాయ స్వాహా చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అవినీతి అధికారుల అండతో అనుమతులకు మించి తవ్వకాలు చేస్తూ యథేచ్ఛగా ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మోతాదుకు మించిన పేలుళ్లు నిర్వహిస్తుండడంతో క్వారీల సమీపంలోని నివాస గృహాలకు బీటలువారుతున్నాయి. బోర్లు సైతం కూరుకుపోతుండడంతో సామాన్యులు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. క్రషర్ల నిర్వహణతో దుమ్ము, ధూళి గాల్లో కలిసి వాతావరణం కలుషితమవుతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. అధికారుల పర్యవేక్షణలోపంతో జిల్లాలో జోరుగా సాగుతున్న మైనింగ్ దందాపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఈ ఫొటోలో ఉన్న పెద్ద గుంత వెల్దుర్తి మండలం హకీంపేటలోనిది. గుట్టను తవ్వి రంగురాళ్లు తరలించడంతో ఇలాంటివి ఏర్పడ్డాయి. ఇదేకాదు.. వెల్దుర్తి మండల పరిధిలోని రామంతాపూర్ శివార్లలో నాలుగు గ్రానైట్, ఒక కలర్ గ్రానైట్ క్వారీలు నడుస్తున్నాయి. ఇందులో నాలుగింటికి మాత్రమే అనుమతులు ఉన్నట్లు తెలుస్తోంది. దొంగచాటుగా మరో రెండు, మూడు క్వారీలు నడుస్తున్నాయి. వీటిని యజమానుల పేరు మీద బినామీలు లీజుకు తీసుకొని ఖనిజ సంపదను దోచేస్తున్నారు. నిబంధనల ప్రకారం 20 అడుగుల మేరకే డ్రిల్లింగ్ చేయాల్సి ఉండగా.. ఒక్కో చోట 100 ఫీట్ల వరకు డ్రిల్లింగ్ చేసి పేలుస్తున్నారు. ఇందుకు ఉపయోగించే జిలెటిన్ స్టిక్స్‌ను పెద్ద ఎత్తున నిల్వ ఉంచుతుండటంతో సమీప గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. ప్రస్తుతం నడుస్తున్న కొన్ని క్వారీలకు సైతం పర్మిట్ గడువు ముగిసినా.. వాటిని రెన్యూవల్ చేసుకోకుండా దర్జాగా నడుపుతున్నట్లు సమాచారం. జిల్లాలో అక్రమ క్వారీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఒక్కదానికి అనుమతి తీసుకుని రెండు అంతకంటే ఎక్కువ క్వారీలు నడిపిస్తూ అక్రమార్కులు అందినకాడికి దండుకుంటున్నా.. అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 13 క్వారీలు (గ్రానైట్, కంకర) ఉన్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. వీటితోపాటు మరో 16 వరకు అక్రమంగా నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఎవరికీ అనుమానం రాకుండా పలు చోట్ల ఒక క్వారీ పక్కన మరొకటి.. కొన్ని ప్రాంతాల్లో రెండు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. -
చిగురుటాకులా పరిటాల
పరిటాల గుండెల్లో గునపం పోట్లు పడుతున్నాయి. పచ్చని తివాచీ పరుచుకున్నట్టుండే గ్రామ లోగిళ్లు.. నల్లని అక్రమ మైనింగ్ భూతానికి వణికిపోతున్నాయి. రేయింబవళ్లు దఢేల్‌మనే బ్లాస్టింగ్‌లకు ఇళ్ల గోడలు, ప్రజల కర్ణభేరులు పగిలిపోతున్నాయి. క్వారీయింగ్ నుంచి వచ్చే దుమ్మూ, ధూళి దెబ్బకు శ్వాసకోశ వ్యాధులు ఊపిరి తీస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో సాగుతున్న ఈ దందాకు సహజ వనరులు నిలువునా గుల్లవుతున్నాయి. కోట్ల రూపాయల దోపిడీపై ప్రశ్నించిన నోళ్లకు అధికార పార్టీ నేతల బెదిరింపుల తాళాలు పడుతున్నాయి. మైనింగ్ దెబ్బకు చిగురుటాకులా వణుకుతున్న పరిటాలను చూసి నిక్షేపాలు సైతం గుండె పగిలి రోదిస్తున్నాయి. సాక్షి,అమరావతిబ్యూరో: విజయవాడ– హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే పంటలతో కళకళలాడే పరిటాల గ్రామం నాలుగేళ్ల నుంచి మైనింగ్ మాఫియా ధాటికి భయం గుప్పిట్లో విలవిల్లాడుతోంది. గ్రామంలో ఉండే మూడు వేలకు పైగా కుటుంబాలకు దాదాపు 10 వేల మంది జనాభా నివసిస్తున్నారు. మెజార్టీ ప్రజలు వ్యవసాయమే జీవనాధారంగా మలుచుకొని 6 వేల ఎకరాల భూముల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ రెవెన్యూ పరిధిలో ఉండే భూముల్లో 1,248 ఎకరాలు కొండపోరంబోకు భూమి ఉంది. ఆ భూముల్లో ఉండే కొండల్లో అపారమైన ఖనిజసంపద ఉండడంతో స్థానిక అధికార పార్టీ నేతలకు ఆ సంపదపై కన్ను పడింది. తమ ధనదాహానికి పోరంబోకు భూములను అక్రమ ఆవాసాలుగా మార్చుకున్నారు. అక్కడే 94 క్వారీలు, 72 క్రషర్లు ఏర్పాటు చేసి పెద్ద సామ్రాజ్యాన్నే స్థాపించారు. శ్వాసకోస వ్యాధులతో సతమతం.. క్వారీలు వెదజల్లే కాలుష్యం వల్ల పరిటాల వాసులు తీవ్ర అనారోగ్య బారిన పడుతున్నారు. పేలుళ్ల శబ్దాలు 150 డెసిబుల్ వరకు వస్తుండడంతో సమీప ప్రాంతాలలో నివసించే వారి కర్ణభేరి దెబ్బతిని వినికిడి లోపాలు ఏర్పడతాయని వైద్య నిపుణులు చెపుతున్నారు. క్వారీల కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు, రక్తనాళాలు బిగుసుకు పోవడం, గుండె వ్యాధుల బారిన పడటం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ కాలుష్య ప్రభావంతో 900 మంది బాధపడుతున్నట్లు సమాచారం. కాలుష్యం పడిన నీరు తాగడం వల్ల కీళ్ల వ్యాధులు సోకే అవకాశ ఉందని వైద్యులు అంటున్నారు. గ్రామంలో 2 వేల మందికి వినికిడిలోపం, కీళ్ల వ్యాధులతో సతమతం అవుతున్నారు. నెలలో ఒక్కో కుటుంబం దాదాపు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఆసుపత్రులకు ఖర్చు చేయాల్సి వస్తుంది. పది కిలోమీటర్ల పరిధిలో కంపనాలు... వేలాది మంది కార్మికులతో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసి కొండలను తవ్వేస్తున్నారు.. ఎక్కడా నిబంధనలు పాటించటం లేదు. కొండలను తొలచేందుకు అనుమతి లేని రిగ్గు బ్లాస్టింగ్‌లకు పాల్పడుతున్నారు. బోరు వేసే రిగ్గు బండితో కొండ పై 100 అడుగులు పైనే గోతులు తీసి ప్రమాదకరమైన జెలిటిన్స్టిక్తో పేలుళ్లులకు పాల్పడుతున్నారు. ఈ పేలుళ్ల ప్రభావంతో సుమారు పదికిలో మీటర్ల వ్యవధిలో భూమి సైతం కంపించిపోతుంది. గ్రామంలో ఉండే 3 వేల కుటుంబాలకు గాను 500 పైగా నివాసాలకు పగుళ్లు ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు. రేకుల షెడ్లు అడపాదడపా పునాదులు కదిలి నేలకొరిగిపోతున్నాయి. గ్రామంలో నివాస భవనాలు నిర్మించాలంటే పునాదులే పటిష్టంగా నిర్మించుకోవాల్సి వస్తోంది. లేదంటే పదికాలాలపాటు ఉండాల్సిన భవనాలు పదేళ్ల కాలంలోనే ప్రమాదకర పరిస్థితులకు చేరుతున్నాయి. ఎకరాకు రూ.25 వేల నష్టం... పరిటాలలో సాగవుతున్న 6 వేల ఎకరాల భూములకు గాను క్వారీల సమీపంలో ఉండే దాదాపు 2 వేల ఎకరాల భూములు కాలుష్యంలో చిక్కుకొని పంటలకు దూరమవుతున్నాయి. ఆ భూముల్లో కంది, పెసర, మినుము పంటలను సాగుచేస్తున్నారు. భూముల్లో పడే క్వారీల డస్ట్ భూసారంలో కలిసి పోయి మొక్క ఎదుగుదల క్షీణించిపోతుంది. దీంతో రైతులు ఎరువులు వాడినా కూడా మొక్క ఎదుగుదల లేకుండా పోతుంది. గతంలో ఎకరా భూమిసాగు చేస్తే ఖర్చులు పోనూ రూ.20 వేలు వరకు మిగులుదల ఉండేది. ప్రస్తుతం సాగు చేస్తే ఎకరా భూమికి రూ.25 వేలు వరకు నష్టం వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీంతో భూముల్లో పంటలు పండించలేక బీళ్లుగా వదిలేస్తున్నామని వాపోయారు. కాలుష్యం కారణంగా పనిచేసేందుకు కూలీలు కూడా రావటం లేదని రైతులు అంటున్నారు. పూడిపోతున్న బోర్లు.... క్వారీల్లో జరిగే ప్రమాదర పేలుళ్ల ప్రభావంతో వ్యవసాయబోర్లు పూడిపోతున్నాయి. బోరులో ఉండే కేసింగ్ పైపులలోపల కూడా భూమి కదిలిపోయి పూడిపోతుందని రైతులు చెబుతున్నారు. -
దడ.. ధడేల్..!
సాక్షి, జె.పంగులూరు: మైనింగ్‌శాఖ అధికారుల నిర్లక్ష్యం, క్రషర్ల్ నిర్వాహకుల స్వార్థం కారణంగా ప్రకృతి సంపద కరిగిపోతోంది. ఇష్టారాజ్యపు బ్లాస్టింగ్‌తో పంటలకు, ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది. బ్లాస్టింగ్ వల్ల లేచిన రాళ్ల ముక్కలతో రైతులు ప్రాణాలు కోల్పోతుండగా.. పొలాల్లో పడుతున్న రాళ్లు, దుమ్ము కారణంగా పంట నష్టపోతున్న రైతులు పొలాలను బీళ్లుగా వదిలేశారు. ధడేల్ మంటూ తరచూ వస్తున్న శబ్దాలకు సమీప నివాసాల ప్రజలు గుండెలు అరచేత పట్టుకుని భయాందోళన మధ్య బతుకు వెళ్లదీస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. బ్లాస్టింగ్‌తో బెంబేలు.. జె.పంగులూరు మండలంలోని రామకూరు గ్రామ సమీపంలో ప్రకృతి ప్రసాదించిన రాళ్ల కొండలున్నాయి. వీటిని అక్రమ మైనింగ్‌కు అడ్డాగా మార్చుకునేందుకు కొందరు గ్రామం చూట్టూ 50 వరకు క్వారీలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన క్వారీల్లో కొన్నిటికి మాత్రమే ప్రభుత్వ అనమతులున్నాయి.క్రషరు వ్యాపారులు గ్రామానికి ఆనుకొని ఉన్న కొండల్లోని రాళ్లను తీసేందుకు, డ్రిల్లింగ్‌తో రంధ్రాలు చేసి, అందులో పేలుడు సామగ్రి అమర్చి పగలే పేల్చేస్తున్నారు. బ్లాస్టింగ్ సమయంలో సమీపంలో నివశించే వారికి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఇస్టానుసారం కొండరాళ్లను పేల్చేస్తున్నారు. బ్లాస్టింగ్ల ధాటికి ఇళ్ల గోడలు దెబ్బతింటున్నాయి. పొలాల్లో పడిన రాళ్లతో రైతుల మృతి.. బ్లాస్టింగ్ ధాటికి పైకి లేచిన బండరాయి ముక్కలు సుమారు అర కిలోమీటరు దూరం వరకూ వస్తున్నాయి. దీంతో సమీపంలో పనిచేస్తున్న రైతులపై పడి, కొందరు గాయాలపాలు కాగా, మరి కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి. పట్టపగలే బ్లాస్టింగ్లు చేయడంతో కూలీలపైన రాళ్లు పడి గాయాలపాలవుతున్నారని వాపోతున్నారు. పంట పొలాల్లోని పైపులు విరిగి పోవటం, రాళ్ళుపడి ఇంజన్లు పాడై పోవటంతో నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. మొక్కుబడి తనిఖీలతో సరి.. బ్లాస్టింగ్ సమయంలో ఎగసిన రాళ్ల ముక్కలు తగిలి గతంలో షేక్ గఫూర్, పోపురం కృష్ణ చనిపోగా.. తాజాగా నాలుగు రోజుల కిందట మధ్యప్రదేశ్‌కు చెందిని ఓ యువకుడు మృతిచెందాడు. మైనింగ్ అధికారులు మొక్కుబడి తనిఖీలు చేసి చేతులు దులుపుకోకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అక్రమ మైనింగ్‌ను అడ్డుకుని, నిబంధనల ప్రకారం బ్లాస్టింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బతికి ఉంటే ఏదో ఒక పని చేసుకోవచ్చు.. నాకు కొండ పక్కన రెండెకరాలు పొలం వుంది. బోరు పడింది పుష్కలంగా నీరు వస్తున్నాయి. గతంలో ఈ పొలంలో మాగాణి పంటలు సాగు చేసే వాడిని. ఈ కొండలను తవ్వుతున్నారని సుబాబులు పంట వేశాను. ఈ కొండలలో బ్లాస్టింగ్లు పెడుతున్నారు. నాలుగు రోజుల క్రితం నేను పొలంలో పనిచేస్తుండగా బాబులు పెట్టారు. నాకు సమీపంలో రాళ్ల వర్షమే పడింది. దీనితో కనీసం బతికి వుంటే ఏదొక పనిచేసుకోవచ్చని, ఆ పక్కకు వెళ్లడమే మానేశాను. అధికారులకు ఎన్ని సార్లు మెర పెట్టుకున్నా ప్రయోజనం లేదు. – చిరుమామిళ్ళ విరాంజనేయులు, రైతు, రామకూరు ప్రాణాలకు రక్షణ లేదు.. రామకూరు గ్రామం అనుకొని రాళ్ల కొండలున్నాయి. ఈ కొండలు అండ చూసుకొని మైనింగ్ వ్యాపారులు కొండలను కరిగించేస్తున్నారు. చుట్టు పక్క పంట పొలాల రైతులు మైనింగ్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు రైతులు పొలాల్లో పంట వేయకుండా బీడుగానే వదిలేస్తున్నారు. – మురకొండ సత్యనారాయణ పొలంలో పైపులన్నీ పగిలిపోతున్నాయి.. పంట పొలాల్లో రాళ్ళుపడి పైపులు, మోటార్లు పగిలి పోతున్నాయి. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవటం లేదు. ప్రకృతి సంపదను అక్రమంగా సొంతం చేసుకుంటున్నారు. మైనింగ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ విషయమై జన్మభూమిలో అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోతోంది. – మురకొండ హనుమంతరావు -
పల్లెల గుండెల్లో పేలుళ్లు
కీసర, న్యూస్‌లైన్: ఉదయం సాయంత్రం తేడా లేదు.. భీకరమైన శబ్దాలు.. పిల్లలు ఉలిక్కిపడి లేస్తున్నా.. పగలూరాత్రి అని ఆలోచించరు. పల్లెలన్నీ తల్లడిల్లుతున్నా.. మైనింగ్ ఆపరు. చరిత్రాత్మక ఆలయానికి పగుళ్లు వస్తు న్నా.. వారికేం పట్టదు. అక్రమార్కులు, అధికారులు ఒక్కటిగా సాగిస్తున్న బ్లాస్టింగ్ల పర్వం కీసర ప్రాంత ప్రజ లను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కొన్నాళ్ల క్రితం వరకు ఉదయం, సాయంత్రం మాత్రమే జరిగిన బ్లాస్టిం గ్లు ఇప్పుడు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. కీసర మండలంలోని కీసరగుట్ట, అంకిరెడ్డిపల్లి, తిమ్మాయిపల్లి సమీప ప్రాంతాల్లోని గుట్టలను యధేచ్చగా పేల్చేస్తున్నారు. అడ్డూఅదుపు లేకుం డా ఇష్టారాజ్యంగా సాగుతున్న ఈ బ్లాస్టింగ్‌లకు పరోక్షంగా అధికారులు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పెద్దపెద్ద బండరాళ్లను పేల్చేయడానికి పరిమితికి మించి పేలుడు పదార్థాలను ఉపయోగించి 20 అడుగుల వరకు డ్రిల్లింగ్ చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నారు. సమీపంలోని నివాస ప్రాంతాలు ఈ భారీ శబ్దాలకు వణికిపోతున్నాయి. భూకంప ప్రకంపనలను పోలి ఉంటున్నాయని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. పేలుళ్ల కారణంగా ఇప్పటికే కీసర, భోగారం, తిమ్మాయిపల్లి, అంకిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. పేలుళ్ల కారణంగా ప్రసిద్ధ శైవక్షేత్రమైన కీసరగుట్టకు ముప్పు పొంచిఉంది. అప్పట్లో స్థానిక ప్రజలు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేయడంతో అప్పటి రెవెన్యూ మంత్రి దేవేందర్ గౌడ్ కీసరగుట్ట చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్లాస్టింగ్లను నిషేధించారు. కాని కొన్ని నెలలే నిషేధం కొనసాగింది. ఆ తర్వాత అధికారుల అండతో మళ్లీ వ్యాపారులు బ్లాస్టింగ్లను ప్రారంభించారు. గ్రానైట్ పరిశ్రమ వల్ల వేలాది కుటుంబాలు బతుకుతున్నాయని, పరిమితులతో కూడిన పేలుళ్లు జరుపుతామని, మితంగా పేలుడు పదార్ధాలు వాడుతామని లాబీయింగ్ చేశారు. కీసరగుట్ట సమీపంలో కేవలం చేతితోనే రాళ్లకు పగులగొట్టేందుకు, గుట్టకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో పరిమిత పేలుడు పదార్థాలు మాత్రమే వినియోగానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ ఆ నిబంధనలు వ్యాపారుల ఆగడాలను ఆపలేకపోయాయి. కీసరగుట్ట దిగువ ప్రాంతమైన వన్నిగూడలోనే అతిపెద్ద కంకర మిషన్ ఏర్పాటు చేసి క్రషింగ్ చేస్తున్నారు. అసైన్డ్ భూములు కలిగి ఉన్న రైతులకు అంతోఇంతో ముట్టజెప్పి వందలాది ఎకరాలను చేజిక్కిం చుకుని అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులతో మంచి ‘బంధాన్ని’ కొనసాగిస్తూ ఎవరూ అడ్డుపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇన్నేళ్లుగా మైనింగ్ జరుపుతున్నా సమీప గ్రామాలకు నామమాత్రపు రాయల్టీ చెల్లించలేదు. మైనింగ్ శాఖ బకాయి పడిన కోట్లాది రూపాయలను చెల్లించాలని గత మండల పరి షత్ పాలకవర్గం ఎంతపోరు పెట్టినా ప్రయోజనం లేకపోయింది. అనుమతులకు మించి పేలుళ్లకు పాల్పడుతున్నారని ఎన్నోమార్లు ప్రజలు ఫిర్యాదు చేసినా అధికారులెవరూ చర్యలకు ముందుకు రాలేదు. బ్లాస్టింగ్‌లకు సంబంధించి ప్రాథమిక నియమాల ప్రకారం శబ్దతీవ్రత ఎంతవరకు ఉండాలో నిర్ణయించారు. వీటిని క్రషర్ మిషన్ల వ్యాపారులు పట్టించుకోవడం లేదు. ఇక బ్లాస్టింగ్ సమయంలో సమీప పొలాలన్నీ రాళ్లతో నిండిపోతున్నాయి. చిన్నసైజు నుంచి పెద్ద సైజు రాళ్లను తొలగించుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కొన్నిమార్లు ఆ ప్రదేశాల్లో రైతులు ఉన్నప్పుడే పేలుళ్లకు పాల్పడుతున్నారు. దీంతో రైతులు పొలాల వద్దకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. గుడి గోపురాలకు దెబ్బ కీసరగుట్టకు అతి సమీపంలోనే క్రషర్ మిషన్లు ఏర్పాటు చేయడం వల్ల ఆలయానికి ప్రమాదం పొంచి ఉంది. ప్రమాదకర బ్లాస్టింగ్ల మూలంగా దేవాలయ గోపురాలు దెబ్బతింటున్నాయి. గతంలో దేవాలయానికి సమీపంలో ఐదు కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి పేలుళ్లు చేపట్టవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆ ఆదేశాలు అమలు కావడంలేదు. - తటాకం వెంకటేష్. కీసర ఇళ్ల గోడలకు పగుళ్లు గ్రామాలకు అతి సమీపంలో పేలుళ్లకు పాల్పడడంతో ఇళ్ల గోడలకు పగుళ్లు వస్తున్నాయి. పేలుడు జరిగినప్పుడు ఇళ్ల కిటికీల అద్దాలు పగులుతున్నాయి. భారీ శబ్దాల మూలంగా చిన్నారులు భయపడిపోతున్నారు. సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లో రాళ్లు పడుతున్నాయి. - రాజలింగంగౌడ్, తిమ్మాయిపల్లి గ్రామం అక్రమాలపై చర్యలు తీసుకోవాలి కీసర మండలంలోని వివిధ గ్రామాలకు సమీపంలో వ్యాపారులు పెద్ద సంఖ్యలో క్రషర్ మిషన్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, అసైన్డ్ స్థలాల్లో పరిమితికి మంచి బ్లాస్టింగ్లు చేస్తున్నారు. వెంటనే అధికారులు చర్యలకు దిగాలి. లేదంటే ప్రజలతో కలిసి ఉద్యమిస్తాం. - చినింగని గణేష్, సర్పంచ్, కీసర పంచాయతీలకు రాయల్టీ ఇవ్వాలి చాలా ఏళ్లుగా క్రషర్ మిషన్లు కొనసాగుతున్నా గ్రామ పంచాయతీలకు రాయల్టీ రావడం లేదు. మండలంలోని కీసర, భోగారం, అంకిరెడ్డిపల్లి, తిమ్మాయిపల్లి గ్రామ పంచాయతీలకు పెద్ద మొత్తంలో రావాల్సిన రాయల్టీని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. - ముప్పురాంరెడ్డి, నాగారం