సాక్షి, జె.పంగులూరు: మైనింగ్‌శాఖ అధికారుల నిర్లక్ష్యం, క్రషర్ల్ నిర్వాహకుల స్వార్థం కారణంగా ప్రకృతి సంపద కరిగిపోతోంది. ఇష్టారాజ్యపు బ్లాస్టింగ్‌తో పంటలకు, ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది. బ్లాస్టింగ్ వల్ల లేచిన రాళ్ల ముక్కలతో రైతులు ప్రాణాలు కోల్పోతుండగా.. పొలాల్లో పడుతున్న రాళ్లు, దుమ్ము కారణంగా పంట నష్టపోతున్న రైతులు పొలాలను బీళ్లుగా వదిలేశారు. ధడేల్ మంటూ తరచూ వస్తున్న శబ్దాలకు సమీప నివాసాల ప్రజలు గుండెలు అరచేత పట్టుకుని భయాందోళన మధ్య బతుకు వెళ్లదీస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
బ్లాస్టింగ్‌తో బెంబేలు..
జె.పంగులూరు మండలంలోని రామకూరు గ్రామ సమీపంలో ప్రకృతి ప్రసాదించిన రాళ్ల కొండలున్నాయి. వీటిని అక్రమ మైనింగ్‌కు అడ్డాగా మార్చుకునేందుకు కొందరు గ్రామం చూట్టూ 50 వరకు క్వారీలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన క్వారీల్లో కొన్నిటికి మాత్రమే ప్రభుత్వ అనమతులున్నాయి.క్రషరు వ్యాపారులు గ్రామానికి ఆనుకొని ఉన్న కొండల్లోని రాళ్లను తీసేందుకు, డ్రిల్లింగ్‌తో రంధ్రాలు చేసి, అందులో పేలుడు సామగ్రి అమర్చి పగలే పేల్చేస్తున్నారు. బ్లాస్టింగ్ సమయంలో సమీపంలో నివశించే వారికి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఇస్టానుసారం కొండరాళ్లను పేల్చేస్తున్నారు. బ్లాస్టింగ్‌ల ధాటికి ఇళ్ల గోడలు దెబ్బతింటున్నాయి.
పొలాల్లో పడిన రాళ్లతో రైతుల మృతి..
బ్లాస్టింగ్ ధాటికి పైకి లేచిన బండరాయి ముక్కలు సుమారు అర కిలోమీటరు దూరం వరకూ వస్తున్నాయి. దీంతో సమీపంలో పనిచేస్తున్న రైతులపై పడి, కొందరు గాయాలపాలు కాగా, మరి కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి. పట్టపగలే బ్లాస్టింగ్‌లు చేయడంతో కూలీలపైన రాళ్లు పడి గాయాలపాలవుతున్నారని వాపోతున్నారు. పంట పొలాల్లోని పైపులు విరిగి పోవటం, రాళ్ళుపడి ఇంజన్లు పాడై పోవటంతో నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు.
మొక్కుబడి తనిఖీలతో సరి..
బ్లాస్టింగ్ సమయంలో ఎగసిన రాళ్ల ముక్కలు తగిలి గతంలో షేక్ గఫూర్, పోపురం కృష్ణ చనిపోగా.. తాజాగా నాలుగు రోజుల కిందట మధ్యప్రదేశ్‌కు చెందిని ఓ యువకుడు మృతిచెందాడు. మైనింగ్ అధికారులు మొక్కుబడి తనిఖీలు చేసి చేతులు దులుపుకోకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అక్రమ మైనింగ్‌ను అడ్డుకుని, నిబంధనల ప్రకారం బ్లాస్టింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
బతికి ఉంటే ఏదో ఒక పని చేసుకోవచ్చు..
నాకు కొండ పక్కన రెండెకరాలు పొలం వుంది. బోరు పడింది పుష్కలంగా నీరు వస్తున్నాయి. గతంలో ఈ పొలంలో మాగాణి పంటలు సాగు చేసే వాడిని. ఈ కొండలను తవ్వుతున్నారని సుబాబులు పంట వేశాను. ఈ కొండలలో బ్లాస్టింగ్‌లు పెడుతున్నారు. నాలుగు రోజుల క్రితం నేను పొలంలో పనిచేస్తుండగా బాబులు పెట్టారు. నాకు సమీపంలో రాళ్ల వర్షమే పడింది. దీనితో కనీసం బతికి వుంటే ఏదొక పనిచేసుకోవచ్చని, ఆ పక్కకు వెళ్లడమే మానేశాను. అధికారులకు ఎన్ని సార్లు మెర పెట్టుకున్నా ప్రయోజనం లేదు.
– చిరుమామిళ్ళ విరాంజనేయులు, రైతు, రామకూరు
ప్రాణాలకు రక్షణ లేదు..
రామకూరు గ్రామం అనుకొని రాళ్ల కొండలున్నాయి. ఈ కొండలు అండ చూసుకొని మైనింగ్ వ్యాపారులు కొండలను కరిగించేస్తున్నారు. చుట్టు పక్క పంట పొలాల రైతులు మైనింగ్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు రైతులు పొలాల్లో పంట వేయకుండా బీడుగానే వదిలేస్తున్నారు.
– మురకొండ సత్యనారాయణ
పొలంలో పైపులన్నీ పగిలిపోతున్నాయి..
పంట పొలాల్లో రాళ్ళుపడి పైపులు, మోటార్లు పగిలి పోతున్నాయి. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవటం లేదు. ప్రకృతి సంపదను అక్రమంగా సొంతం చేసుకుంటున్నారు. మైనింగ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ విషయమై జన్మభూమిలో అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోతోంది.
– మురకొండ హనుమంతరావు
Comments
Please login to add a commentAdd a comment