ఇక్కడ రోజూ భూకంపమే.. | Local People Fearing With Ramagiri Mining Blasting | Sakshi
Sakshi News home page

ఇక్కడ రోజూ భూకంపమే..

Published Mon, Nov 11 2019 8:10 AM | Last Updated on Mon, Nov 11 2019 8:10 AM

Local People Fearing With Ramagiri Mining Blasting  - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : పచ్చని చెట్లు.. జలకళతో చెరువు... పక్షుల కిలకిలరాగాలు.. వ్యవసాయమే ఊపిరిగా బతికే పల్లె ప్రజలు.. పాడి పంటలతో ఆరేళ్ల క్రితం వరకు ఆ ఊరంతా కళకళలాడేది. సింగరేణి రంగప్రవేశంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పంటచేలు కనుమరుగయ్యాయి. ఊరు బొందలగడ్డగా మారింది. అభివృద్ధికి బొగ్గు అవసరమని, ఊరి భూగర్భంలో బొగ్గు నిల్వలున్నాయని అధికారులు గ్రామస్తులకు చెప్పి పంట భూములు, ఇళ్లు సేకరించారు. అభివృద్ధికి అడ్డుకావొద్దని గ్రామస్తులూ సహకరించారు. పరిహారంతోపాటు పునరావాసం కింద ఇళ్లు నిర్మిచుకునేందుకు ప్లాట్లు కేటాయిస్తామని సింగరేణి హామీ ఇచ్చింది. ఆరేళ్లు గడిచాయి. సింగరేణి బొగ్గు తవ్వుకుపోతోంది. సర్వం ధారపోసిన నిర్వాసితుల బతుకులు మాత్రం ఆగమయ్యాయి. పంట భూములకు పరిహారం ఇచ్చిన సింగరేణి యాజమాన్యం పునరావాసం కోసం ప్లాట్లు కేటాయించడంలో జాప్యం చేస్తోంది. కోర్టు కేసులు పునరావాసానికి ఆటంకంగా మారాయి. దీంతో రామగిరి మండలం లద్నాపూర్‌లోని ఓసీపీ–2 ప్రభావిత ప్రజలు నిత్య బ్లాస్టింగ్‌లతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.

లద్నాపూర్‌ ప్రొఫైల్‌ 

నివాస గృహాలు   1280
సింగరేణి తీసుకున్న ఇళ్లు 720
ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందాల్సిన వారు  400


సింగరేణి సంస్థ రామగుండం–3 డివిజన్‌ పరిధిలోని ఓసీపీ–2లో బొగ్గు ఉత్పత్తి కోసం నిత్యం జరిపే బ్లాస్టింగ్‌లకు రామగిరి మండలం లద్నాపూర్‌ వాసులు భయంభయంగా బతుకుబండి సాగిస్తు న్నారు. ఓసీపీ–2 విస్తరణ కోసం ఆరేళ్లక్రితం గ్రామపరిధిలోని భూసేకరణ చేపట్టింది.ఇప్పటి వరకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ చెల్లించక, పునరావసం కల్పించకపోవడంతో తమ బతుకులతో అధికారులు చెలగాటమాడుతున్నారని నిర్వాసితులు కన్నీరుపెడుతున్నారు. ఊరును ఆనుకుని ఓసీపీ–2లో నిత్యం జరిపే బ్లాస్టింగ్‌లతో ఎప్పుడు ఎటువైపు నుంచి బండరాయి వచ్చి పడుతుందో, భూప్రకంపనలకు  ఇంటికప్పు కూలి మీద పడుతుందోనని దినమొక గండంగా కాలం వెళ్లదీస్తున్నారు. బ్లాస్టింగ్‌  సమయంలో సింగరేణి సిబ్బంది తమను బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని ఆదేశిస్తున్నారని, ఇళ్లలో ఉంటే పేలుడు జరిపిన సమయంలో భూకంపం వచ్చినట్లు అవుతోందని, వస్తువులు కింద పడుతున్నాయని పేర్కొటున్నారు.బ్లాస్టింగ్‌ల ధాటికి గోడలు బీటలు వారాయని, బండరాళ్లు ఎగిరొచ్చి పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దుమ్ముతో రోగాలు..
బ్లాస్టింగ్‌ అనంతరం ఊరంతటిని దుమ్ము ధూళి కప్పేస్తోందని, పేలుడు పదార్థాలతో సుమారు రెండు గంటలు దుర్వాసన వస్తోందని లద్నాపూర్‌ వాసులు తెలిపారు.వృద్ధులు, చిన్నపిల్లలు వ్యాధులబారిన పడుతున్నారన్నారు. అధికారులను ప్రశ్నిస్తే వీలైనంత త్వరగా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇస్తామని, పునరావసం కల్పించి గ్రామాన్ని ఖాళీ చేయిస్తామంటూ కాలయాపన చేస్తున్నారని వాపోతున్నారు.

హైకోర్టులో పునరావాసం భూములు..
ఓసీపీ–2 విస్తరణ కోసం లద్నాపూర్‌లో భూసేకరణ చేపట్టిన సింగరేణి నిర్వాసితులకు అదే గ్రామ శివారులోని ప్రభుత్వ భూమితోపాటు పట్టా భూములను కొనుగోలు చేసి పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రైవేటు భూసేకరణ చేసేందుకు అవార్డ్‌ పాస్‌ చేసింది. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తమ సంతకాలను పోర్జరీ చేసి అక్రమంగా అవార్డ్‌ పాస్‌ చేశారని, ప్రైవేటు భూముల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. పునరావాసం కోసం సేకరించిన భూముల అంశం కోర్టులో ఉండడంతో తీర్పు వెలువడే వరకూ సింగరేణి ఏమీ చేయలని పరిస్థితి నెలకొంద

పరిహారం ఇవ్వకుండానే కాలువ మళ్లింపు.. 
నిర్వాసితులకు ప్యాకేజీ, పునరావసం కల్పించకుండానే సింగరేణి అధికారులు గ్రామాన్ని ఆనుకుని ఉన్న ఎస్సారెస్పీ ఎల్‌–6 కాలువ మళ్లింపు పనులు చేపట్టారు. ఈ కాలువ ఓసీపీ – 2కు ఆటంకంగా మారడంతో మళ్లిస్తున్నారు. పనులు పూర్తయితే తమను పట్టించుకునే నాథుడే ఉండడని నిర్వాసితులు వారం రోజులుగా పనులను అడ్డుకుని ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఎల్‌–6 కాలువను యుద్ధ ప్రాతిపదికన మళ్లించకపోతే ఓసీపీ–2, ఏఎల్‌పీ గనుల మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి  నెలకొంది.

చెప్పిందొకటి.. చేసిందొకటి.. 
కాలువ పనులను అడ్డుకున్న నిర్వాసితులను ఆరు రోజుల క్రితం చర్చలకు అహ్వానించిన అధికారులు కలెక్టర్‌ సమక్షంలో సమస్య పరిష్కారిస్తామని తెలిపారు. మరుసటి రోజు ఓబీ కంపెనీలో కాంట్రాక్ట్‌ కార్మికులుగా పని చేస్తున్న  నిర్వాసితులను విధులకు అనుమతించలేదు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఓసీపీ క్వారీలో భైఠాయించారు. అదే సమయంలోనే అధికారులు బ్లాస్లింగ్‌ చేయడంతో ఆగ్రహించిన నిర్వాసితులు అధికారులను నిలదీశారు. గోదా వరిఖని ఏసీపీ ఉమేందర్‌ జోక్యంతో నిర్వాసితులు ఆర్డీవో నగేశ్‌తో చర్చలు జరిపారు. మంగళవారం కలెక్టర్‌ లేదా జాయింట్‌ కలెక్టర్‌తో సమావేశం ఏర్పాటు చేయించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరో చోట పునరారాసం..! 
ఎల్‌–6 కాలువ మళ్లింపు అత్యవసరం దృష్ట్యా లద్నాపూర్‌ నిర్వాసితులకు గ్రామ శివారులో కాకుండా మరో ప్రదేశంలో పునరావసం కల్పించాలనే ఆలోచన లో సింగరేణి అధికారులు ఉన్నట్లు సమాచారం. నిర్వాసితుల సమస్య పరిష్కరించకపోతే కాలువ మళ్లిం పు పనులు సాగవని అంచనాకు వచ్చిన సింగరేణి అధికారులు సూచనప్రాయంగా స్థానిక జేఎన్‌టీయూ కళాశాల సమీపంలోని బొక్కల వాగు వద్ద పునరావసం కల్పించాలని ఆలోచన చేస్తున్నట్లు తెలి సిం ది.సెంటినరీకాలనీలోని రామాలయం వెనక పునరావసం కల్పిస్తే తమకు అభ్యంతరం లేదని నిర్వాసితులు పేర్కొంటున్నారు. మంగళవారం నాటి చర్చల్లో ఏ నిర్ణయం తీసుకుంటారోనని సింగరేణి యాజమా న్యం,అధికారులు,నిర్వాసితులుఎదురు చూస్తున్నారు.


బ్లాస్టింగ్‌ సమయంలో కర్ఫ్యూను తలపిస్తున్న రహదారి, బ్లాస్టింగ్‌ సమయంలో నిర్వాసితులు బయటకు రాకుండా కాపలా కాస్తున్న సింగరేణి సిబ్బంది 

ఇళ్లపై రాళ్లు.. 
మేము నివాసం ఉంటున్న ఇండ్లకు సమీపంలోనే సింగరేణోళ్లు బ్లాస్టింగ్‌ చేస్తున్నరు. దీంతో పెద్దపెద్ద బండరాళ్లు వచ్చి ఇండ్లమీద పడుతున్నాయ్‌. మా బాధ ఎవరికి చెప్పినా పట్టించుకుంటలేరు. నిత్యం చచ్చిబతుకుతున్నం.
– పిల్లిట్ల నాగలక్ష్మి, నిర్వాసితురాలు

ఎల్‌– 6 మళ్లించొద్దు 
నిర్వాసితులకు ఆరేళ్లుగా పునరావసం కల్పించకుండా మభ్యపెడుతున్నారు. ఎల్‌–6 కాలువ మళ్లింపు పూర్తయితే మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. మా సమస్య పరిష్కరించే వరకూ కాలువ మళ్లింపు పనులు చేయొద్దు.
– పోరెడ్డి వెంకటరమణారెడ్డి, నిర్వాసితుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement