![Woman Suicide Due To Husband Harassment In Peddapalli - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/18/WOmna.jpg.webp?itok=UZtPregt)
సాక్షి. పెద్దపల్లి: ‘అమ్మా నన్ను క్షమించండి.. నేను మళ్లీ మీ కడుపున పుడతా. కానీ మళ్లీ వాడికిచ్చి పెళ్లి చేయకండి. వాడి వేధింపులు భరించలేకపోతున్న.. వెళ్లాలని లేదు కానీ తప్పదు వెళ్తున్నా. వెళ్తున్న అంటే బతకడానికి కాదు వెతకండి మీకు దగ్గరలో కనపడతా. మీరు అందరూ నాకు కావాలి.’ అంటూ ఓ వివాహిత భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి ఒడ్డెరకాలనీలో జరిగింది.
మృతురాలి కుటుంబ సభ్యుల వివరాలు.. గ్రామానికి చెందిన ఒల్లపు సోని(21)కి మూడేళ్ల క్రితం ముత్తారం మండలం మచ్చుపేట గ్రామానికి అలమకుంట రమేశ్‌తో వివాహం జరిగింది. వివాహం అయినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవల మళ్లీ గొడవ జరుగగా ఐదు రోజుల క్రితం పుట్టిల్లు పెగడపల్లికి వచ్చింది. ఈక్రమంలో శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సోని తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. సమీపంలోని ఓ రైతు వ్యవసాయ బావిలో శవమై తేలింది.
తన ఆత్మహత్యకు సంబంధించిన సూసైడ్ నోటు బావి ఒడ్డున లభించింది. సూసైడ్ లెటరు చూసి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఘొల్లుమంటూ రోదించారు. అత్తింటి వేధింపులు, అల్లుడు రమేశ్ కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి మల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజవర్ధన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment