సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో తిరిగి పట్టు సాధించేందుకు మావోయిస్టులు మళ్లీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న మావోయిస్టు వారోత్సవాల్లో పాల్గొంటున్న తెలంగాణ మావోయిస్టు నేతల్లో కొందరు రాష్ట్రంలోకి వచ్చారన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, యాక్షన్ కమిటీ సభ్యుడు మంగులు అలియాస్ పాండు ఆగస్టులో రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు ధ్రువీకరించగా తాజాగా పెద్దపల్లి జిల్లాలోకి మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ అలియాస్ ధర్మన్న వచ్చి వెళ్లాడన్న వార్త పోలీసు శాఖలో చర్చానీయాంశంగా మారింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం పెద్దపల్లి)లోని శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటకు చెందిన కంకణాల.. కొందరు అనుచరులతో కలసి పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, ఎన్టీపీసీ పరిసర ప్రాంతాల్లో పర్యటించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇందుకుగల కారణాలపై ఆరా తీస్తున్నాయి. ఈ ప్రాంతంలోని పలువురు కాంట్రాక్టర్ల నుంచి రాజిరెడ్డి భారీగా నిధులు రాబట్టాడన్న వార్తల్లో నిజానిజాలను నిర్ధారించుకొనే పనిలో ఉన్నాయి. కొందరు అనుమానితులు, కొరియర్లపై నిఘా పెట్టాయి. కంకణాలతోపాటు ఆయనతోపాటు వచ్చిన యాక్షన్ టీం సభ్యులు కుంజం మనీశ్, చెన్నూరి శ్రీను అలియాస్ హరీశ్, కొవ్వాసి రాము, రోషన్, నందు అలియాస్ వికాస్ ఫొటోలతో కూడిన పోస్టర్‌ను రామగుండం కమిషనరేట్ పోలీసులు విడుదల చేశారు. వారి సమాచారం అందిస్తే రూ. 5 లక్షల నగదు రివార్డు ఇస్తామని ప్రకటించారు.
‘రామగుండం’స్కాం నిందితుల హత్యకు రెక్కీ?
2020 అక్టోబర్‌లో ములుగు జిల్లాలోని ముసలమ్మ గుట్టలో మావోయిస్టు పార్టీలో కొత్తగా చేరిన పలువురు యువకులకు శిక్షణ ఇస్తున్న రాజిరెడ్డి బృందం.. కూంబింగ్ చేస్తున్న టీఎస్‌ఎస్‌పీ దళానికి ఎదురైంది. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో రాజిరెడ్డి తృటిలో తప్పించుకున్నారు. దాదాపు 24 నెలల విరామం తరువాత రాజిరెడ్డి రాష్ట్రానికి రావడం.. అందులోనూ ఆయనకు నిధులు సమకూరుతున్నాయన్న సమాచారంపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం కొలువుల కుంభకోణంలో నిందితులను హతమార్చేందుకు కంకణాల బృందం రెక్కీ చేసినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల కూలీలు నివసించే కాలనీలపై నిఘా పెట్టినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment