పేలుళ్ల ప్రభావంతో బీటలు వారిన ఇల్లు పరిటాల క్వారీలో బాంబులు పెట్టి కొండను పేలుస్తున్న దృశ్యం
పరిటాల గుండెల్లో గునపం పోట్లు పడుతున్నాయి. పచ్చని తివాచీ పరుచుకున్నట్టుండే గ్రామ లోగిళ్లు.. నల్లని అక్రమ మైనింగ్ భూతానికి వణికిపోతున్నాయి. రేయింబవళ్లు దఢేల్‌మనే బ్లాస్టింగ్‌లకు ఇళ్ల గోడలు, ప్రజల కర్ణభేరులు పగిలిపోతున్నాయి. క్వారీయింగ్ నుంచి వచ్చే దుమ్మూ, ధూళి దెబ్బకు శ్వాసకోశ వ్యాధులు ఊపిరి తీస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో సాగుతున్న ఈ దందాకు సహజ వనరులు నిలువునా గుల్లవుతున్నాయి. కోట్ల రూపాయల దోపిడీపై ప్రశ్నించిన నోళ్లకు అధికార పార్టీ నేతల బెదిరింపుల తాళాలు పడుతున్నాయి. మైనింగ్ దెబ్బకు చిగురుటాకులా వణుకుతున్న పరిటాలను చూసి నిక్షేపాలు సైతం గుండె పగిలి రోదిస్తున్నాయి.
సాక్షి,అమరావతిబ్యూరో: విజయవాడ– హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే పంటలతో కళకళలాడే పరిటాల గ్రామం నాలుగేళ్ల నుంచి మైనింగ్ మాఫియా ధాటికి భయం గుప్పిట్లో విలవిల్లాడుతోంది. గ్రామంలో ఉండే మూడు వేలకు పైగా కుటుంబాలకు దాదాపు 10 వేల మంది జనాభా నివసిస్తున్నారు. మెజార్టీ ప్రజలు వ్యవసాయమే జీవనాధారంగా మలుచుకొని 6 వేల ఎకరాల భూముల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ రెవెన్యూ పరిధిలో ఉండే భూముల్లో 1,248 ఎకరాలు కొండపోరంబోకు భూమి ఉంది. ఆ భూముల్లో ఉండే కొండల్లో అపారమైన ఖనిజసంపద ఉండడంతో స్థానిక అధికార పార్టీ నేతలకు ఆ సంపదపై కన్ను పడింది. తమ ధనదాహానికి పోరంబోకు భూములను అక్రమ ఆవాసాలుగా మార్చుకున్నారు. అక్కడే 94 క్వారీలు, 72 క్రషర్లు ఏర్పాటు చేసి పెద్ద సామ్రాజ్యాన్నే స్థాపించారు.
శ్వాసకోస వ్యాధులతో సతమతం..
క్వారీలు వెదజల్లే కాలుష్యం వల్ల పరిటాల వాసులు తీవ్ర అనారోగ్య బారిన పడుతున్నారు. పేలుళ్ల శబ్దాలు 150 డెసిబుల్ వరకు వస్తుండడంతో సమీప ప్రాంతాలలో నివసించే వారి కర్ణభేరి దెబ్బతిని వినికిడి లోపాలు ఏర్పడతాయని వైద్య నిపుణులు చెపుతున్నారు. క్వారీల కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు, రక్తనాళాలు బిగుసుకు పోవడం, గుండె వ్యాధుల బారిన పడటం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ కాలుష్య ప్రభావంతో 900 మంది బాధపడుతున్నట్లు సమాచారం. కాలుష్యం పడిన నీరు తాగడం వల్ల కీళ్ల వ్యాధులు సోకే అవకాశ ఉందని వైద్యులు అంటున్నారు. గ్రామంలో 2 వేల మందికి వినికిడిలోపం, కీళ్ల వ్యాధులతో సతమతం అవుతున్నారు. నెలలో ఒక్కో కుటుంబం దాదాపు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఆసుపత్రులకు ఖర్చు చేయాల్సి వస్తుంది.
పది కిలోమీటర్ల పరిధిలో కంపనాలు...
వేలాది మంది కార్మికులతో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసి కొండలను తవ్వేస్తున్నారు.. ఎక్కడా నిబంధనలు పాటించటం లేదు. కొండలను తొలచేందుకు అనుమతి లేని రిగ్గు బ్లాస్టింగ్‌లకు పాల్పడుతున్నారు. బోరు వేసే రిగ్గు బండితో కొండ పై 100 అడుగులు పైనే గోతులు తీసి ప్రమాదకరమైన జెలిటిన్‌స్టిక్‌తో పేలుళ్లులకు పాల్పడుతున్నారు. ఈ పేలుళ్ల ప్రభావంతో సుమారు పదికిలో మీటర్ల వ్యవధిలో భూమి సైతం కంపించిపోతుంది. గ్రామంలో ఉండే 3 వేల కుటుంబాలకు గాను 500 పైగా నివాసాలకు పగుళ్లు ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు. రేకుల షెడ్లు అడపాదడపా పునాదులు కదిలి నేలకొరిగిపోతున్నాయి. గ్రామంలో నివాస భవనాలు నిర్మించాలంటే పునాదులే పటిష్టంగా నిర్మించుకోవాల్సి వస్తోంది. లేదంటే పదికాలాలపాటు ఉండాల్సిన భవనాలు పదేళ్ల కాలంలోనే ప్రమాదకర పరిస్థితులకు చేరుతున్నాయి.
ఎకరాకు రూ.25 వేల నష్టం...
పరిటాలలో సాగవుతున్న 6 వేల ఎకరాల భూములకు గాను క్వారీల సమీపంలో ఉండే దాదాపు 2 వేల ఎకరాల భూములు కాలుష్యంలో చిక్కుకొని పంటలకు దూరమవుతున్నాయి. ఆ భూముల్లో కంది, పెసర, మినుము పంటలను సాగుచేస్తున్నారు. భూముల్లో పడే క్వారీల డస్ట్ భూసారంలో కలిసి పోయి మొక్క ఎదుగుదల క్షీణించిపోతుంది. దీంతో రైతులు ఎరువులు వాడినా కూడా మొక్క ఎదుగుదల లేకుండా పోతుంది. గతంలో ఎకరా భూమిసాగు చేస్తే ఖర్చులు పోనూ రూ.20 వేలు వరకు మిగులుదల ఉండేది. ప్రస్తుతం సాగు చేస్తే ఎకరా భూమికి రూ.25 వేలు వరకు నష్టం వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీంతో భూముల్లో పంటలు పండించలేక బీళ్లుగా వదిలేస్తున్నామని వాపోయారు. కాలుష్యం కారణంగా పనిచేసేందుకు కూలీలు కూడా రావటం లేదని రైతులు అంటున్నారు.
పూడిపోతున్న బోర్లు....
క్వారీల్లో జరిగే ప్రమాదర పేలుళ్ల ప్రభావంతో వ్యవసాయబోర్లు పూడిపోతున్నాయి. బోరులో ఉండే కేసింగ్ పైపులలోపల కూడా భూమి కదిలిపోయి పూడిపోతుందని రైతులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment