'గుట్ట'కాయ స్వాహా! | Illegal Granite Mining Rampant In Medak District | Sakshi
Sakshi News home page

'గుట్ట'కాయ స్వాహా!

Published Fri, Aug 30 2019 10:49 AM | Last Updated on Fri, Aug 30 2019 11:42 AM

Illegal Granite Mining Rampant In Medak District - Sakshi

సాక్షి, మెదక్‌: గుట్టలు కనిపిస్తే చాలు.. అక్రమార్కులు గుటకాయ స్వాహా చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అవినీతి అధికారుల అండతో అనుమతులకు మించి తవ్వకాలు చేస్తూ యథేచ్ఛగా ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మోతాదుకు మించిన పేలుళ్లు నిర్వహిస్తుండడంతో క్వారీల సమీపంలోని నివాస గృహాలకు బీటలువారుతున్నాయి. బోర్లు సైతం కూరుకుపోతుండడంతో సామాన్యులు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. క్రషర్ల నిర్వహణతో దుమ్ము, ధూళి గాల్లో కలిసి వాతావరణం కలుషితమవుతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. అధికారుల పర్యవేక్షణలోపంతో జిల్లాలో జోరుగా సాగుతున్న మైనింగ్‌ దందాపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.                

ఈ ఫొటోలో ఉన్న పెద్ద గుంత వెల్దుర్తి మండలం హకీంపేటలోనిది. గుట్టను తవ్వి రంగురాళ్లు తరలించడంతో ఇలాంటివి ఏర్పడ్డాయి. ఇదేకాదు.. వెల్దుర్తి మండల పరిధిలోని రామంతాపూర్‌ శివార్లలో నాలుగు గ్రానైట్, ఒక కలర్‌ గ్రానైట్‌ క్వారీలు నడుస్తున్నాయి. ఇందులో నాలుగింటికి మాత్రమే అనుమతులు ఉన్నట్లు తెలుస్తోంది. దొంగచాటుగా మరో రెండు, మూడు క్వారీలు నడుస్తున్నాయి. వీటిని యజమానుల పేరు మీద బినామీలు లీజుకు తీసుకొని ఖనిజ సంపదను దోచేస్తున్నారు. నిబంధనల ప్రకారం 20 అడుగుల మేరకే డ్రిల్లింగ్‌ చేయాల్సి ఉండగా.. ఒక్కో చోట 100 ఫీట్ల వరకు డ్రిల్లింగ్‌ చేసి పేలుస్తున్నారు. ఇందుకు ఉపయోగించే జిలెటిన్‌ స్టిక్స్‌ను పెద్ద ఎత్తున నిల్వ ఉంచుతుండటంతో సమీప గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. ప్రస్తుతం నడుస్తున్న కొన్ని క్వారీలకు సైతం పర్మిట్‌ గడువు ముగిసినా.. వాటిని రెన్యూవల్‌ చేసుకోకుండా దర్జాగా నడుపుతున్నట్లు సమాచారం.

జిల్లాలో అక్రమ క్వారీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఒక్కదానికి అనుమతి తీసుకుని రెండు అంతకంటే ఎక్కువ క్వారీలు నడిపిస్తూ అక్రమార్కులు అందినకాడికి దండుకుంటున్నా.. అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 13 క్వారీలు (గ్రానైట్, కంకర) ఉన్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. వీటితోపాటు మరో 16 వరకు అక్రమంగా నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఎవరికీ అనుమానం రాకుండా పలు చోట్ల ఒక క్వారీ పక్కన మరొకటి.. కొన్ని ప్రాంతాల్లో రెండు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement