Granite illegal danda
-
గ్రానైట్ దందాపై కన్నెర్ర
అధిక లోడుతో గ్రానైట్‌ను రవాణా చేస్తున్న వాహనాలపై రవాణా శాఖ అధికారులు కన్నెర్ర చేశారు. జిల్లా వ్యాప్తంగా కొద్దిరోజులుగా పోలీస్, విజిలెన్స్ శాఖల అధికారుల సమన్వయంతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొందరు వ్యక్తులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గ్రానైట్‌ను తరలిస్తూ ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. దీంతో అధికారులు పలు వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.20 లక్షలకు పైగా అపరాధ రుసుం వసూలు చేశారు. తనిఖీల్లో కొన్ని వాహనాలు మాత్రమే పట్టుబడుతుండగా అధికారుల కళ్లుగప్పి వెళ్లిపోతున్న పరిస్థితి కూడా ఉంది. నెల్లూరు(టౌన్): మన రాష్ట్రంలో లభించే గ్రానైట్‌కు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా చీమకుర్తి, గురుజేపల్లి, బల్లికురువ, శ్రీకాకుళం టెక్కలి, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి నెల్లూరు మీదుగా కృష్ణపట్నం, చెన్నై, హొసూరు, బెంగళూరు ప్రాంతాలకు నిత్యం 200కు పైగా గ్రానైట్ వాహనాలు వెళ్తుంటాయి. వాటిలో అధికశాతం ఓవర్ లోడుతో ఉంటాయి. గ్రానైట్‌ను ఎక్కువగా 22 చక్రాల లారీలు రవాణా చేస్తుంటాయి. ఒక్కో దాంట్లో 57.750 టన్నుల సరుకు మాత్రమే రవాణా చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు యజమానులు 90 నుంచి 100 టన్నుల వరకు రవాణా చేయిస్తుంటారు. అధిక లోడు కారణంగా వాహనం అదుపులో ఉండదని అధికారులు చెబుతున్నారు. కాగా తనిఖీల్లో ఓవర్ లోడు ఉన్నట్లు గుర్తిస్తే ప్రాథమికంగా రూ.20 వేలు, దీంతోపాటు వాహన పరిమితికి మించి అధికంగా ఉంటే ఒక్కో టన్నుకు రూ.2,000 చొప్పున అపరాధ రుసుం విధిస్తున్నారు. తనిఖీల సమయంలో రోడ్డుపై వాహనాన్ని ఆపి డ్రైవర్ కనిపించకుండా వెళ్తే దానికి రూ.40 వేలు ఫైన్ వేస్తున్నారు. ఆ వాహనాన్ని ఫొటో తీసి రవాణా శాఖ వెబ్సైట్లో ఉంచుతారు. అక్కడే కేసులు రాస్తే.. అధిక లోడుతో వస్తున్న వాహనాలు అవి మొదలయ్యే పాయింట్లలోనే కేసులు నమోదు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నెల్లూరులో ఆపి తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తుండడంతో యజమానులు దుర్భాషలాడుతున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఫొటోలు, వీడియోలు తీసి బెదిరిస్తున్నారని చెబుతున్నారు. కాగా అధిక లోడుతో తిరుగుతున్న గ్రావెల్, మట్టి, ఇసుక తదితర వాహనాలపై కూడా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. వాటిపై కూడా కేసులు నమోదు చేస్తే ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుంది. దెబ్బతింటున్న రోడ్లు అధిక లోడుతో వాహనాలు వెళ్తుండడంతో జాతీయ, రాష్ట్ర రహదారులు దెబ్బతింటున్నాయి. దీనికితోడు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని రవాణా శాఖ అధికారులే చెబుతున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలపై నేషనల్ హైవే అధికారులు సర్వే నిర్వహించారు. ఇందులో అధిక లోడు గ్రానైట్ వాహనాల వల్లే రహదారులు దెబ్బతినడంతోపాటు ప్రమాదాలు జరుగుతున్నాయని కేంద్రానికి నివేదిక పంపించారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి నెల్లూరు జిల్లా వరకు యాక్సిడెంట్ జోన్‌గా ప్రకటించారు. ఇక్కడ అధిక లోడు వాహనాలను అరికడితే ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అధికారులు నివేదించారు. తనిఖీలు ముమ్మరం జిల్లా మీదుగా అధిక లోడుతో వెళ్తున్న వాహనాలపై కొద్దిరోజులుగా రవాణా శాఖ, పోలీసు, విజిలెన్స్ శాఖ అధికారులు సమన్వయంతో తనిఖీలను ముమ్మరం చేశారు. అయితే పట్టుబడుతున్న వాహనాల సంఖ్య బాగా తక్కువగా ఉంటోంది. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో 234 వాహనాలను పట్టుకుని రూ.కోటికి పైగా అపరాధ రుసుము విధించి వసూలు చేశారు. వాటిలో అధిక శాతం గ్రానైట్ లారీలే ఉన్నాయి. అధిక లోడు వాహనాల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించి కేసులు నమోదు చేస్తే సర్కారుకి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకుంటాం ఓవర్‌లోడుతో వెళ్లే వా హనాలపై ప్రత్యేక దృష్టి సారించాం. జిల్లాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.1.38 కోట్ల లక్ష్యాన్ని విధించింది. దీనిని చేరుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నాం. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు మా వంతు కృషి చేస్తాం. – బి.చందర్, ఉపరవాణా కమిషనర్, నెల్లూరు -
ఆగని అచ్చెన్న ఫ్యామిలీ అక్రమాలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కోటబొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయతీ మెయిన్‌రోడ్డులో పెద్ద బమ్మిడి గ్రామంలో ఉన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబీకుల శ్రీదుర్గాభవానీ గ్రానైట్ ఇండస్ట్రీస్‌లో అక్రమాలు వెలుగు చూశాయి. ఒక పర్మిట్‌పై రెండు మూడు లోడ్ల బ్లాక్‌లను అక్రమంగా తరలించి ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండికొట్టారు. ఈ నెల 8 నుంచి చేపడుతున్న విచారణలో ఇప్పటి వరకు రూ.4.5 కోట్ల విలువైన 1300 క్యూబిక్ మీటర్ల గ్రానైట్ బ్లాక్‌లను అక్రమంగా తరలించినట్టు తేలింది. విచారణ పూర్తయ్యే సరికి ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది. టీడీపీ హయాంలో లెక్కలేనన్ని గ్రానైట్ బ్లాక్‌లను తరలించారు. అధికారంలో లేనప్పుడు కూడా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారంటే అచ్చెన్నాయుడు ఫ్యామిలీ ఎంత బరితెగించిందో అర్థం చేసుకోవచ్చు. అసలేం జరిగింది.. ► ఈ నెల 8న కంచిలి మండలం భైరిపురంలో రానా గ్రానైట్ అండ్ మినరల్ క్వారీ నుంచి ఒక పర్మిట్‌తో మూడు లోడ్లు కలర్ గ్రానైట్ బ్లాక్‌లు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా మైనింగ్, విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ► కింజరాపు అచ్చెన్నాయుడు ఫ్యామిలీకి చెందిన దుర్గా భవానీ గ్రానైట్‌కు చెందిన వాహనంగా గుర్తించారు. ► ఒక పర్మిట్‌తో అప్పటికే రెండు లోడ్లు తరలించగా, మూడో లోడ్ తీసుకెళ్తుండగా అధికారులు పట్టుకున్నారు. ► తీగ లాగితే డొంక కదిలినట్టు.. పట్టుకున్న బ్లాక్ లోడ్ల లారీ ఆధారంగా విచారణ చేసేసరికి మొత్తం గుట్టు రట్టు అయ్యింది. ► దుర్గా భవానీ గ్రానైట్ ఆన్లైన్, భౌతికంగా ఉన్న గ్రానైట్ బ్లాక్‌లను పరిశీలించేసరికి భారీగా తేడా కన్పించింది. ► కంచిలి మండలం భైరిపురం రాణా గ్రానైట్ కంపెనీ నుంచి పెద్ద ఎత్తున గ్రానైట్ బ్లాక్‌లను అక్రమంగా తరలించినట్టు గుర్తించారు. ► పర్మిట్ ట్రాన్సిట్ ఫారం ఆధారంగా అక్రమాలకు పాల్పడ్డారు. అనుమతిచ్చిన సమయానికి మించి, ఆ సమయంలోపు అడ్డగోలుగా బ్లాక్‌ల తరలింపు చేసినట్టు నిర్ధారించారు. ఇప్పటివరకు రూ.4 కోట్ల 50 లక్షల విలువైన 1300 క్యూబిక్ మీటర్ల అక్రమ బ్లాక్‌లను గుర్తించారు. ఇంకా పరిశీలన జరుగుతోంది. ► ఇలా ఎప్పటి నుంచి జరుగుతోంది? ఇంకెంత అక్రమంగా తరలించారు? అన్న దానిపై మైనింగ్, విజిలెన్స్ అధికారులు విచారణ చేపడుతున్నారు. దీన్నిబట్టి అక్రమ తరలింపు బ్లాక్‌ల విలువ మరింత పెరిగే అవకాశం ఉంది. ► అచ్చెన్నాయుడుకు సంబంధించి మరికొన్ని బినామీ గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు కూడా ఉన్నట్టు సమాచారం. అక్కడికి కూడా ఇదేరకంగా అక్రమంగా బ్లాక్‌లు తరలించారేమోనన్న కోణంలో కూడా విచారణ జరుగుతోంది. ► ఇదిలా ఉండగా, సలాసర్, జేఎంబీ, జ్యోతి పాలి షింగ్ యూనిట్లకు కూడా దాదాపు రూ.కోటి 60లక్షల విలువైన గ్రానైట్ బ్లాక్‌లు అక్రమంగా తరలించినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ బ్లాక్‌లు తయారవుతున్న కంచిలి మండలం భైరిపురంలోని రానా గ్రానైట్ కంపెనీలో కూడా రూ. 2కోట్ల విలువైన బ్లాక్‌ల తేడాలు వెలుగు చూశాయి. ► తవ్వకాలు, అమ్మకాలు, నిల్వలు సమగ్ర పరిశీల న చేసేసరికి రానా గ్రానైట్ క్వారీ లొసుగులు బయటపడ్డాయి. మొత్తానికి గుట్టుగా, కుమ్మక్కై ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి, గ్రానైట్ రవాణా అక్రమాలకు పాల్పడినట్టుగా తేలింది. వారిదే హవా.. టీడీపీ అధికారంలో ఉన్నంతసేపూ జిల్లాలో అచ్చెన్న కుటుంబానిదే హవా కావడంతో ఇక్కడున్న గ్రానైట్ క్వారీలన్నీ ముడుపులుగా గ్రానైట్ బ్లాక్‌లను సమర్పించేవారు. క్వారీల వేస్ట్ మెటీరియల్‌ను సైతం అప్పనంగా పంపించేవారు. ఎటువంటి అనుమతుల్లేకుండానే అచ్చెన్న కుటుంబీకులు బ్లాక్‌లు, వేస్ట్ మెటీరియల్ తమ పాలిషింగ్ యూనిట్‌కు తరలించుకునేవారు. ఈ విషయమై ఫిర్యాదు చేస్తే ఏం చేస్తారోనన్న భయపడి ఎవరూ ముందుకొచ్చే వారు కారు. అయితే, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక కొందరు ముందుకొచ్చి ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టారు. అప్పటివరకు దొరికిన ఆధారాల మేరకు దుర్గా భవానీ గ్రానైట్‌లో రూ.11కోట్ల 43లక్షల 29వేల 120 మేర అక్రమాలు గుర్తించారు. వాటికి సంబంధించి నోటీసులు కూడా ఇచ్చారు. -
ఇంటి దొంగల ఏరివేత షురూ..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేరంటారు. అయితే ప్రకాశం జిల్లా ఎస్పీ మాత్రం ఇంటి దొంగల గుట్టు పట్టేశారు. అసాంఘిక శక్తులతో చేతులు కలిపి భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్న వారి సమాచారాన్ని గుప్పెట్లో పెట్టుకున్నారు. దీంతో జిల్లాలోని అవినీతి పోలీసు అధికారులు, సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటికే పలువురు గ్రానైట్ అక్రమ రవాణా ముఠా సభ్యులు, క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకున్న ఎస్పీ వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టడంతోపాటు, ఇంటి దొంగల పాత్రపై విచారణ జరపడంతో అవినీతి అధికారుల్లో గుబులు మొదలైంది. జిల్లాకు చెందిన పలువురు కీలక బుకీలు అజ్ఞాతంలోకి వెళ్లగా, బెట్టింగ్ వ్యవహారాల్లో సంబంధాలు ఉన్న పోలీసుుల్లో మాత్రం కలవరం మొదలైంది. ఇప్పటికే ఓ పోలీస్ అధికారి సెలవుపై వెళ్లగా, మరొకరికి చార్జి మెమో ఇచ్చారు. అయితే తమవంతు ఎప్పుడు వస్తుందోననే భయాందోళనలో అవినీతి పోలీసు అధికారులు ఉన్నట్లు తెలిసింది. విచారణలో కీలక ఆధారాలు.. జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ గ్రానైట్, గుట్కా, రేషన్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాలతోపాటు క్రికెట్ బెట్టింగ్‌పై గత కొద్దికాలంగా సీరియస్‌గా దృష్టి సారించారు. అక్రమార్కులకు పోలీసు శాఖలోని కింది స్థాయి సిబ్బంది నుంచి డీఎస్పీ స్థాయి అధికారుల వరకు అంతా సహకరిస్తున్నారనే సమాచారంతో ఎస్పీ రహస్య విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఇటీవల ఒంగోలు నగరంలో ఓ క్రికెట బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా దొంగ వే బిల్లులతో గ్రానైట్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను, గుట్కా రాకెట్‌ను పట్టుకున్నారు. విచారణలో కీలక విషయాలు బయటకు రావడంతో దాని ఆధారంగా చర్యలకు రంగం సిద్ధం చేశారు. ఎస్పీ దూకుడును తెలుసుకున్న గ్రానైట్ మాఫియా, కీలక క్రికెట్ బుకీలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. 15 రోజులు దాటుతున్నా పోలీసులకు ఆచూకీ దొరక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇంటి దొంగలపై వేటు.. అసాంఘిక శక్తులకు అండగా ఉంటూ భారీ మొత్తంలో నెలవారీ మామూళ్లు తీసుకుంటున్న పోలీసు అధికారులు, సిబ్బందిపై ఎస్పీ చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా గత 15 రోజులుగా జిల్లాలో అవినీతి ఆరోపనలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారులపై రహస్య విచారణ చేపట్టినట్లు సమాచారం. జిల్లాలో ముగ్గురు పోలీస్ అధికారులు, పలువురు సిబ్బంది భారీస్థాయి అవినీతికి పాల్పడుతున్న విషయం ఎస్పీ విచారణలో తేలడంతో వారం రోజుల్లో వీరిపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. గ్రానైట్ మాఫియా, గుట్కా రాకెట్, క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాల్లో పలువురు పోలీసు అధికారులు, సిబ్బందికి సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవడంతో అక్రమార్కుల కాల్ లిస్టు ఆధారంగా ఎస్పీ వివరాలు సేకరించినట్లు సమాచారం. అక్రమార్కులు, అసాంఘిక శక్తులకు సహకరిస్తున్న ఇంటి దొంగల జాబితాను ఎస్పీ సిద్ధం చేస్తున్నట్లు తెలియడంతో అవినీతి ఖాకీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. -
ఎట్టకేలకు కళ్లు తెరిచారు!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : గ్రానైట్ మాఫియా గత కొన్నేళ్లుగా టీడీపీ నేతల కనుసన్నల్లో రెచ్చిపోతోంది. మామూళ్ల మత్తులో జోగుతూ అధికారులు సైతం నిద్ర నటిస్తూ వచ్చారు. గ్రానైట్ అక్రమ రవాణాకు అండదండలు అందిస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీ స్థాయిలో గండికొట్టారు. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ నేతలు సైతం ఒక్కో లారీకి రూ.15వేల చొప్పున వసూలు చేసి అక్రమ రవాణాకు అండగా నిలుస్తూ వచ్చారు. పోలీస్, మైనింగ్, వాణిజ్య పన్నుల శాఖ, విజిలెన్స్ ఇలా అన్ని శాఖల అధికారులు టీడీపీ నేతలకు జీ హుజూర్ అంటూ మొక్కారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే విజిలెన్స్ అధికారులు గ్రానైట్ అక్రమ రవాణాతో పాటు గ్రానైట్ క్వారీలపై దాడులు చేస్తుండడంతో గ్రానైట్ మాఫియాకు వణుకు మొదలైంది. దీంతో పాటు నకిలీ కంపెనీల పేరుతో వేలాది ఈ వే బిల్లులు పొంది వాటి ద్వారా అక్రమ రవా ణాకు పాల్పడి ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన వందల కోట్ల రూపాయల రాయల్టీ, జీఎస్టీలను అక్రమ వ్యాపారులు మింగేశారు. నకిలీ వేబిల్లుల కుంభకోణం బయట పడడంతో అక్ర మార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అధికారులు సైతం కళ్లు తెరిచి చర్యలకు ఉపక్రమించడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మైనింగ్, పోలీస్, వాణిజ్యపన్నుల శాఖ అధికారులు సంయుక్తంగా టాస్క్‌ఫార్స్ బృందాలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలకు సమాయత్తమవుతున్నారు. ప్రకాశం జిల్లాలో గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీలపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరిలో కొందరు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వ్యాపారాలు చేస్తున్నప్పటికి కొందరు అక్రమార్కులు మాత్రం వక్రమార్గంలో వ్యాపారాలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అక్రమ వ్యాపారులు రెచ్చపోయారు. కొందరు టీడీపీ నేతల కనుసన్నల్లో గ్రానైట్ మాఫియా నకిలీ వే బిల్లులతో వేలాది లారీల గ్రానైట్‌ను అక్రమంగా తరలించారు. అంతటితో ఆగకుండా అసలు బిల్లులే లేకుండా కూడా వేలాది లారీలను రాష్ట్రం దాటించేశారు. ఇందుకు అండగా నిలిచినందుకు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో టీడీపీ ముఖ్య నేతలకు ప్రతినెలా కోట్ల రూపాయల్లో ముడుపులు చెల్లిస్తూ అక్రమ దందాను కొనసాగించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జూలు విధిలిస్తున్నారు. గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీలు, అక్రమంగా రవాణా చేసే లారీలపై వరుస దాడులు నిర్వహిస్తూ అక్రమార్కులకు నిద్ర పట్టకుండా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే తరుణంలో మార్టూరు, బల్లికురవ, సంతమాగలూరు, చీమకుర్తి ప్రాంతాల్లో కొందరు 278 నకిలీ కంపెనీలను సృష్టించి 18,239 వే బిల్లులను పొందారు. వీటి ద్వారా గ్రానైట్‌ను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించి సుమారు రూ.300 కోట్ల వ్యాపారం చేశారు. సరైన బిల్లులతో ఈ వ్యాపారం జరిగి ఉంటే రాయల్టీ, జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి రూ.85 కోట్ల మేర ఆదాయం వచ్చి ఉండేది. పోలీసులు నకిలీ కంపెనీలను సృష్టించిన నలుగురిని అరెస్టు చేసి భారీ కుంభకోణాన్ని చేధించా. వారి ద్వారా దీని వెనుక ఉన్న అసలు సూత్రధారుల పేర్లు బయటకు తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. నకిలీ వే బిల్లుల కుంభకోణం బయటకు రావడంతో అక్రమార్కులతో పాటు వారికి ఇప్పటి వరకు సహకరిస్తూ వస్తున్న వివిధ శాఖల అధికారులు, వారికి అండగా నిలుస్తున్న టీడీపీ నేతలకు సైతం ముచ్చెమటలు పడుతున్నాయి. సంయుక్త దాడులకు రంగం సిద్ధం.. నకిలీ వేబిల్లుల కుంభకోణం బయటపడడంతో నిద్ర మేల్కొన్న అధికారులు సంయుక్త దాడులకు సమాయత్తమవుతున్నారు. పోలీస్, మైనింగ్, వాణిజ్య పన్నుల శాఖాధికారులతో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆకస్మిక దాడులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. గ్రానైట్ అక్రమ రవాణా జరగకుండా ఈ బృందాలు నిరంతరం నిఘా ఉంచనున్నాయి. రవాణా చేసే లారీలకు ట్రాన్సిట్ పాస్‌లు, వే బిల్లులు పరిశీలించడం, రాయల్టీ చెల్లించారా..? లేదా? అనే దానిపై తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా నకిలీ కంపెనీలు సృష్టించి వే బిల్లులు పొంది వాటి ద్వారా అక్రమ రవాణాకు పాల్పడుతున్న గ్రానైట్ మాఫియాపై నిజాయితీగా వ్యాపారం చేస్తున్న గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులు ఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యంగా బూదవాడ, చీమకుర్తి, పేర్నమిట్ట ప్రాంతాల్లోని అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మైనింగ్, ఏసీబీ, వాణిజ్య పన్నుల శాఖ, విజిలెన్స్ ఉన్నతాధికారులతో పాటు పత్రికా కార్యాలయాలకు ఆకాశరామన్న ఉత్తరాలు రాస్తూ వేడుకొంటున్నారు. -
'గుట్ట'కాయ స్వాహా!
సాక్షి, మెదక్: గుట్టలు కనిపిస్తే చాలు.. అక్రమార్కులు గుటకాయ స్వాహా చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అవినీతి అధికారుల అండతో అనుమతులకు మించి తవ్వకాలు చేస్తూ యథేచ్ఛగా ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మోతాదుకు మించిన పేలుళ్లు నిర్వహిస్తుండడంతో క్వారీల సమీపంలోని నివాస గృహాలకు బీటలువారుతున్నాయి. బోర్లు సైతం కూరుకుపోతుండడంతో సామాన్యులు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. క్రషర్ల నిర్వహణతో దుమ్ము, ధూళి గాల్లో కలిసి వాతావరణం కలుషితమవుతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. అధికారుల పర్యవేక్షణలోపంతో జిల్లాలో జోరుగా సాగుతున్న మైనింగ్ దందాపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఈ ఫొటోలో ఉన్న పెద్ద గుంత వెల్దుర్తి మండలం హకీంపేటలోనిది. గుట్టను తవ్వి రంగురాళ్లు తరలించడంతో ఇలాంటివి ఏర్పడ్డాయి. ఇదేకాదు.. వెల్దుర్తి మండల పరిధిలోని రామంతాపూర్ శివార్లలో నాలుగు గ్రానైట్, ఒక కలర్ గ్రానైట్ క్వారీలు నడుస్తున్నాయి. ఇందులో నాలుగింటికి మాత్రమే అనుమతులు ఉన్నట్లు తెలుస్తోంది. దొంగచాటుగా మరో రెండు, మూడు క్వారీలు నడుస్తున్నాయి. వీటిని యజమానుల పేరు మీద బినామీలు లీజుకు తీసుకొని ఖనిజ సంపదను దోచేస్తున్నారు. నిబంధనల ప్రకారం 20 అడుగుల మేరకే డ్రిల్లింగ్ చేయాల్సి ఉండగా.. ఒక్కో చోట 100 ఫీట్ల వరకు డ్రిల్లింగ్ చేసి పేలుస్తున్నారు. ఇందుకు ఉపయోగించే జిలెటిన్ స్టిక్స్‌ను పెద్ద ఎత్తున నిల్వ ఉంచుతుండటంతో సమీప గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. ప్రస్తుతం నడుస్తున్న కొన్ని క్వారీలకు సైతం పర్మిట్ గడువు ముగిసినా.. వాటిని రెన్యూవల్ చేసుకోకుండా దర్జాగా నడుపుతున్నట్లు సమాచారం. జిల్లాలో అక్రమ క్వారీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఒక్కదానికి అనుమతి తీసుకుని రెండు అంతకంటే ఎక్కువ క్వారీలు నడిపిస్తూ అక్రమార్కులు అందినకాడికి దండుకుంటున్నా.. అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 13 క్వారీలు (గ్రానైట్, కంకర) ఉన్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. వీటితోపాటు మరో 16 వరకు అక్రమంగా నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఎవరికీ అనుమానం రాకుండా పలు చోట్ల ఒక క్వారీ పక్కన మరొకటి.. కొన్ని ప్రాంతాల్లో రెండు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. -
చిరుతపులి పేరున భయపెడ్తూ దోచేస్తున్నారు..!
ద్రవిడ విశ్వవిద్యాలయంలో చిరుత పులి సంచారం అంటూ గత నెల పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. వర్సిటీలో ఓ చిరుత పులి సంచరిస్తోంది రాత్రిళ్లు ఎవరూ బయటికి రావద్దంటూ ఇంజినీరింగ్ శాఖాధికారులు క్వార్టర్స్‌లో ఉంటున్న సిబ్బందికి, హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు సమాచారం అందించారు. అప్పట్నుంచి రాత్రిళ్లు బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. అయితే చిరుతపులి సంచరిస్తోందని వర్సిటీలోని గ్రానైట్‌ను తరలించేందుకే ప్రచారం చేశారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికితోడు వర్సిటీ వీసీ ఆచార్య యెడ్ల సుధాకర్ అర్ధరాత్రి వేళల్లో స్వయంగా కారు నడుపుతూ చక్కర్లు కొట్టడాన్ని సైతం వర్సిటీ సిబ్బంది గమనించినట్లు సమాచారం. సాక్షి, కుప్పం: ద్రవిడ విశ్వవిద్యాలయంలో గత నెల 25వ తేదీ రాత్రి చిరుతపులి సంచరించిందని ఇంజినీరింగ్ శాఖాధిపతి క్యాంపస్‌లో నివాసముంటున్న సిబ్బందికి, హాస్టల్ వార్డెన్లకు సమాచారం అందించారు. వర్సిటీ వైపు నుంచి వెళ్తున్న కొందరు చిరుతపులిని చూసినట్లు, రాత్రిళ్లు ఎవరూ బయటికి రావద్దంటూ సూచించారు. దీంతో వర్సిటీలో నివాసముంటున్న సిబ్బంది, విద్యార్థులు చీకటిపడగానే బయటకు రావడం మానేశారు. దీంతో పాటు ఉదయం వాకింగ్ చేయడం కూడా మానేయడంతో రాత్రిళ్లు వర్సిటీ నిర్మానుష్యంగా మారింది. అయితే ప్రస్తుతం చిరుత పులి సంచరిస్తోందంటూ పుకార్లు సృష్టిం చారన్న విమర్శలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. చిరుత పులి సంచరిందని చెప్తున్న వర్సిటీ అధికారులు అటవీ అధికారులకు మాత్రం సమాచారం అందించకపోవడం విడ్డూరంగా మారింది. చిరుతపులి సంచా రానికి సంబంధించి అటవీ అధికారులకు చెప్పకపోవడంతోనే ఇదంతా పుకారు మాత్రమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రానైట్ నిక్షేపాలను తరలించడానికేనా? కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయం వెయ్యి ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. అయితే వర్సిటీ భూభాగంలో అధికభాగం కోట్లాది రూపాయలు విలువ చేసే గ్రానైట్ నిక్షేపాలతో విస్తరించి ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు రాత్రికి రాత్రి గ్రానైట్ నిక్షేపాలను తరలిస్తున్నారు. ఈ క్రమంలో నూతన వీసీగా బాధ్యతలు చేపట్టిన ఆచార్య యెడ్ల సుధాకర్ నెలలో ఆఖరు వారం నేచుర్‌వాక్ పేరిట వర్సిటీ భూభాగంలో సిబ్బందితో కలసి వాకింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో గ్రానైట్ నిక్షేపాలు, అక్రమంగా తరలిస్తున్న వైనంపై వీసీ ఆరా తీసినట్టు సమాచారం. అయితే గ్రానైట్ అక్రమ తరలింపుపై ఆరు నెలలు గడిచినా ఇప్పటి వరకు ఫి ర్యాదులు గానీ, చర్యలు గానీ తీసుకున్న పాపా న పోలేదు. పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో గ్రానైట్ అక్రమ రవాణాకు సంబంధించి కథనాలు వస్తున్నా ఇప్పటి వరకు వర్సిటీ అధికారులు స్పందించలేదు. ద్రవిడ అధికారులే చిరుత సంచా రం అంటూ ప్రచారాలు చేసి రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా గ్రానైట్ తరలింపునకు సహకరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం గ్రానైట్ స్మగ్లర్లు నగదు సైతం ముట్టజెబుతున్నట్లు సమాచారం. చిరుతపులి సంచరించే అవకాశం లేదు ద్రావిడ విశ్వవిద్యాలయం పరిధిలో చిరుత పులి సంచారానికి అవకాశం లేదు. చిరుత సంచరించేంత అటవీ ప్రాంతం యూనివర్సిటీలో లేదు. హైనాలు, నక్కలు తదితర జంతువులు మాత్రమే సంచరించే అవకాశాలు ఉన్నా యి. – కాళప్పనాయుడు, అటవీ అధికారి, కుప్పం -
‘సహాయం’కుగ్రీన్ సిగ్నల్
గ్రానైట్ అక్రమ దందాపై సమగ్ర విచారణకు ఐఏఎస్ అధికారి సహాయం కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విచారణను మదురై జిల్లాకు మాత్రమే పరిమితం చేసినట్లు సంకేతాలు వస్తున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ట్రాఫిక్ రామస్వామి రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కార కేసుకు పట్టుబడుతూ పిటిషన్ దాఖలు చేశారు. సాక్షి, చెన్నై:రాష్ట్రంలో గ్రానైట్, సముద్ర తీరాల్లో ఖనిజ సంపదల్ని అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న బడా బాబుల బండారం ఇటీవల వెలుగులోకి వచ్చింది. కేవలం మదురైలోనే వేల కోట్ల కుంభకోణం బయటపడడంపై మద్రాసు హైకోర్టు రాష్ర్ట వ్యాప్తంగా సమగ్ర విచారణకు ఆదేశించింది. సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి దాఖలు చేసిన పిటిషన్ మేరకు ఐఏఎస్ అధికారి సహాయం నేతృత్వంలో కమిటీని హైకోర్టు ఏర్పాటు చేసింది. అయితే, ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేయలేదు. ఇప్పటికే తాము అన్ని చర్యలు తీసుకున్నామంటూ ఆ కమిటీని వ్యతిరేకించే పనిలో పడింది. ఎట్టకేలకు గత వారం హైకోర్టు తీవ్రంగా స్పందించడంతో కమిటీ ఏర్పాటు అనివార్యం అయింది. ఆమోదం : నాలుగు రోజుల్లోపు కమిటీ ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణ నేతృత్వంలోని బెంచ్ గత వారం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఆ గ డువు ముగిసినా ఉత్తర్వులు వెలువడ లేదు. దీంతో కోర్టు ఆగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం సహాయం కమిటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల్ని గురువారం ప్రధాన బెంచ్ ముందు ఉంచారు. సహాయం కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు, ఆ కమిటీకి ప్రభుత్వం అందించే సహాయాన్ని వివరిస్తూ తన వాదనను బెంచ్ ముందు ప్రభుత్వం తరపు న్యాయవాది సోమయాజులు ఉంచారు. మదురైకు పరిమితం: సహాయం కమిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ర్ట ప్రభుత్వం తన పనితనాన్ని ప్రదర్శిస్తూ మెలిక విధించడం చర్చనీయాంశమైంది. కేవలం మదురైలో సాగిన గ్రానైట్ స్కాంపై సమగ్ర విచారణ జరిపే విధంగా ఆ కమిటీకి అధికారాల్ని ప్రభుత్వం ఇచ్చినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఆ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా విచారణ చేపట్టాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ వాదనల సందర్భంగా ట్రాఫిక్ రామస్వామి తరపు న్యాయవాది రాజారాం బెంచ్ ముందుకు కొన్ని విషయాల్ని తీసుకెళ్లారు. కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు వచ్చిన దృష్ట్యా, అందులో ఉన్న అంశాల్ని పరిగణనలోకి తీసుకుని తదుపరి పిటిషన్‌కు బెంచ్ అవకాశం కల్పించింది. దీంతో కోర్టు ధిక్కార కేసు నమోదు లక్ష్యంగా ట్రాఫిక్ రామస్వామి బెంచ్‌ముందు పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విచారణ చేపట్టే విధంగా చర్యలు తీసుకోకుండా, కేవలం మదురైకు పరిమితం చేస్తున్నారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే, కాలయాపన, కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. పీఎంకే నేత రాందాసు తన ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల్ని వ్యతిరేకించారు. కోరల్ని పీకేసి కమిటీని ఏర్పాటు చేసినట్టుందని మండి పడ్డారు. కేవలం మదురైకు పరిమితం చేయకుండా, రాష్ట్ర వ్యాప్తంగా సహాయం నేతృత్వంలోని కమిటీకి విచారణ జరిపే అధికారాలు అప్పగించాలని డిమాండ్ చేశారు.