సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కోటబొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయతీ మెయిన్‌రోడ్డులో పెద్ద బమ్మిడి గ్రామంలో ఉన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబీకుల శ్రీదుర్గాభవానీ గ్రానైట్ ఇండస్ట్రీస్‌లో అక్రమాలు వెలుగు చూశాయి. ఒక పర్మిట్‌పై రెండు మూడు లోడ్ల బ్లాక్‌లను అక్రమంగా తరలించి ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండికొట్టారు.
ఈ నెల 8 నుంచి చేపడుతున్న విచారణలో ఇప్పటి వరకు రూ.4.5 కోట్ల విలువైన 1300 క్యూబిక్ మీటర్ల గ్రానైట్ బ్లాక్‌లను అక్రమంగా తరలించినట్టు తేలింది. విచారణ పూర్తయ్యే సరికి ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది. టీడీపీ హయాంలో లెక్కలేనన్ని గ్రానైట్ బ్లాక్‌లను తరలించారు. అధికారంలో లేనప్పుడు కూడా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారంటే అచ్చెన్నాయుడు ఫ్యామిలీ ఎంత బరితెగించిందో అర్థం చేసుకోవచ్చు.
అసలేం జరిగింది..
► ఈ నెల 8న కంచిలి మండలం భైరిపురంలో రానా గ్రానైట్ అండ్ మినరల్ క్వారీ నుంచి ఒక పర్మిట్‌తో మూడు లోడ్లు కలర్ గ్రానైట్ బ్లాక్‌లు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా మైనింగ్, విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.
► కింజరాపు అచ్చెన్నాయుడు ఫ్యామిలీకి చెందిన దుర్గా భవానీ గ్రానైట్‌కు చెందిన వాహనంగా గుర్తించారు.
► ఒక పర్మిట్‌తో అప్పటికే రెండు లోడ్లు తరలించగా, మూడో లోడ్ తీసుకెళ్తుండగా అధికారులు పట్టుకున్నారు.
► తీగ లాగితే డొంక కదిలినట్టు.. పట్టుకున్న బ్లాక్ లోడ్ల లారీ ఆధారంగా విచారణ చేసేసరికి మొత్తం గుట్టు రట్టు అయ్యింది.
► దుర్గా భవానీ గ్రానైట్ ఆన్‌లైన్, భౌతికంగా ఉన్న గ్రానైట్ బ్లాక్‌లను పరిశీలించేసరికి భారీగా తేడా కన్పించింది.
► కంచిలి మండలం భైరిపురం రాణా గ్రానైట్ కంపెనీ నుంచి పెద్ద ఎత్తున గ్రానైట్ బ్లాక్‌లను అక్రమంగా తరలించినట్టు గుర్తించారు.
► పర్మిట్ ట్రాన్సిట్ ఫారం ఆధారంగా అక్రమాలకు పాల్పడ్డారు. అనుమతిచ్చిన సమయానికి మించి, ఆ సమయంలోపు అడ్డగోలుగా బ్లాక్‌ల తరలింపు చేసినట్టు నిర్ధారించారు. ఇప్పటివరకు రూ.4 కోట్ల 50 లక్షల విలువైన 1300 క్యూబిక్ మీటర్ల అక్రమ బ్లాక్‌లను గుర్తించారు. ఇంకా పరిశీలన జరుగుతోంది.
► ఇలా ఎప్పటి నుంచి జరుగుతోంది? ఇంకెంత అక్రమంగా తరలించారు? అన్న దానిపై మైనింగ్, విజిలెన్స్ అధికారులు విచారణ చేపడుతున్నారు. దీన్నిబట్టి అక్రమ తరలింపు బ్లాక్‌ల విలువ మరింత పెరిగే అవకాశం ఉంది.
► అచ్చెన్నాయుడుకు సంబంధించి మరికొన్ని బినామీ గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు కూడా ఉన్నట్టు సమాచారం. అక్కడికి కూడా ఇదేరకంగా అక్రమంగా బ్లాక్‌లు తరలించారేమోనన్న కోణంలో కూడా విచారణ జరుగుతోంది.
► ఇదిలా ఉండగా, సలాసర్, జేఎంబీ, జ్యోతి పాలి షింగ్ యూనిట్లకు కూడా దాదాపు రూ.కోటి 60లక్షల విలువైన గ్రానైట్ బ్లాక్‌లు అక్రమంగా తరలించినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ బ్లాక్‌లు తయారవుతున్న కంచిలి మండలం భైరిపురంలోని రానా గ్రానైట్ కంపెనీలో కూడా రూ. 2కోట్ల విలువైన బ్లాక్‌ల తేడాలు వెలుగు చూశాయి.
► తవ్వకాలు, అమ్మకాలు, నిల్వలు సమగ్ర పరిశీల న చేసేసరికి రానా గ్రానైట్ క్వారీ లొసుగులు బయటపడ్డాయి. మొత్తానికి గుట్టుగా, కుమ్మక్కై ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి, గ్రానైట్ రవాణా అక్రమాలకు పాల్పడినట్టుగా తేలింది.
వారిదే హవా..
టీడీపీ అధికారంలో ఉన్నంతసేపూ జిల్లాలో అచ్చెన్న కుటుంబానిదే హవా కావడంతో ఇక్కడున్న గ్రానైట్ క్వారీలన్నీ ముడుపులుగా గ్రానైట్ బ్లాక్‌లను సమర్పించేవారు. క్వారీల వేస్ట్ మెటీరియల్‌ను సైతం అప్పనంగా పంపించేవారు. ఎటువంటి అనుమతుల్లేకుండానే అచ్చెన్న కుటుంబీకులు బ్లాక్‌లు, వేస్ట్ మెటీరియల్ తమ పాలిషింగ్ యూనిట్‌కు తరలించుకునేవారు. ఈ విషయమై ఫిర్యాదు చేస్తే ఏం చేస్తారోనన్న భయపడి ఎవరూ ముందుకొచ్చే వారు కారు. అయితే, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక కొందరు ముందుకొచ్చి ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టారు. అప్పటివరకు దొరికిన ఆధారాల మేరకు దుర్గా భవానీ గ్రానైట్‌లో రూ.11కోట్ల 43లక్షల 29వేల 120 మేర అక్రమాలు గుర్తించారు. వాటికి సంబంధించి నోటీసులు కూడా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment