kota bommal
-
ఆగని అచ్చెన్న ఫ్యామిలీ అక్రమాలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కోటబొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయతీ మెయిన్‌రోడ్డులో పెద్ద బమ్మిడి గ్రామంలో ఉన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబీకుల శ్రీదుర్గాభవానీ గ్రానైట్ ఇండస్ట్రీస్‌లో అక్రమాలు వెలుగు చూశాయి. ఒక పర్మిట్‌పై రెండు మూడు లోడ్ల బ్లాక్‌లను అక్రమంగా తరలించి ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండికొట్టారు. ఈ నెల 8 నుంచి చేపడుతున్న విచారణలో ఇప్పటి వరకు రూ.4.5 కోట్ల విలువైన 1300 క్యూబిక్ మీటర్ల గ్రానైట్ బ్లాక్‌లను అక్రమంగా తరలించినట్టు తేలింది. విచారణ పూర్తయ్యే సరికి ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది. టీడీపీ హయాంలో లెక్కలేనన్ని గ్రానైట్ బ్లాక్‌లను తరలించారు. అధికారంలో లేనప్పుడు కూడా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారంటే అచ్చెన్నాయుడు ఫ్యామిలీ ఎంత బరితెగించిందో అర్థం చేసుకోవచ్చు. అసలేం జరిగింది.. ► ఈ నెల 8న కంచిలి మండలం భైరిపురంలో రానా గ్రానైట్ అండ్ మినరల్ క్వారీ నుంచి ఒక పర్మిట్‌తో మూడు లోడ్లు కలర్ గ్రానైట్ బ్లాక్‌లు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా మైనింగ్, విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ► కింజరాపు అచ్చెన్నాయుడు ఫ్యామిలీకి చెందిన దుర్గా భవానీ గ్రానైట్‌కు చెందిన వాహనంగా గుర్తించారు. ► ఒక పర్మిట్‌తో అప్పటికే రెండు లోడ్లు తరలించగా, మూడో లోడ్ తీసుకెళ్తుండగా అధికారులు పట్టుకున్నారు. ► తీగ లాగితే డొంక కదిలినట్టు.. పట్టుకున్న బ్లాక్ లోడ్ల లారీ ఆధారంగా విచారణ చేసేసరికి మొత్తం గుట్టు రట్టు అయ్యింది. ► దుర్గా భవానీ గ్రానైట్ ఆన్లైన్, భౌతికంగా ఉన్న గ్రానైట్ బ్లాక్‌లను పరిశీలించేసరికి భారీగా తేడా కన్పించింది. ► కంచిలి మండలం భైరిపురం రాణా గ్రానైట్ కంపెనీ నుంచి పెద్ద ఎత్తున గ్రానైట్ బ్లాక్‌లను అక్రమంగా తరలించినట్టు గుర్తించారు. ► పర్మిట్ ట్రాన్సిట్ ఫారం ఆధారంగా అక్రమాలకు పాల్పడ్డారు. అనుమతిచ్చిన సమయానికి మించి, ఆ సమయంలోపు అడ్డగోలుగా బ్లాక్‌ల తరలింపు చేసినట్టు నిర్ధారించారు. ఇప్పటివరకు రూ.4 కోట్ల 50 లక్షల విలువైన 1300 క్యూబిక్ మీటర్ల అక్రమ బ్లాక్‌లను గుర్తించారు. ఇంకా పరిశీలన జరుగుతోంది. ► ఇలా ఎప్పటి నుంచి జరుగుతోంది? ఇంకెంత అక్రమంగా తరలించారు? అన్న దానిపై మైనింగ్, విజిలెన్స్ అధికారులు విచారణ చేపడుతున్నారు. దీన్నిబట్టి అక్రమ తరలింపు బ్లాక్‌ల విలువ మరింత పెరిగే అవకాశం ఉంది. ► అచ్చెన్నాయుడుకు సంబంధించి మరికొన్ని బినామీ గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు కూడా ఉన్నట్టు సమాచారం. అక్కడికి కూడా ఇదేరకంగా అక్రమంగా బ్లాక్‌లు తరలించారేమోనన్న కోణంలో కూడా విచారణ జరుగుతోంది. ► ఇదిలా ఉండగా, సలాసర్, జేఎంబీ, జ్యోతి పాలి షింగ్ యూనిట్లకు కూడా దాదాపు రూ.కోటి 60లక్షల విలువైన గ్రానైట్ బ్లాక్‌లు అక్రమంగా తరలించినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ బ్లాక్‌లు తయారవుతున్న కంచిలి మండలం భైరిపురంలోని రానా గ్రానైట్ కంపెనీలో కూడా రూ. 2కోట్ల విలువైన బ్లాక్‌ల తేడాలు వెలుగు చూశాయి. ► తవ్వకాలు, అమ్మకాలు, నిల్వలు సమగ్ర పరిశీల న చేసేసరికి రానా గ్రానైట్ క్వారీ లొసుగులు బయటపడ్డాయి. మొత్తానికి గుట్టుగా, కుమ్మక్కై ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి, గ్రానైట్ రవాణా అక్రమాలకు పాల్పడినట్టుగా తేలింది. వారిదే హవా.. టీడీపీ అధికారంలో ఉన్నంతసేపూ జిల్లాలో అచ్చెన్న కుటుంబానిదే హవా కావడంతో ఇక్కడున్న గ్రానైట్ క్వారీలన్నీ ముడుపులుగా గ్రానైట్ బ్లాక్‌లను సమర్పించేవారు. క్వారీల వేస్ట్ మెటీరియల్‌ను సైతం అప్పనంగా పంపించేవారు. ఎటువంటి అనుమతుల్లేకుండానే అచ్చెన్న కుటుంబీకులు బ్లాక్‌లు, వేస్ట్ మెటీరియల్ తమ పాలిషింగ్ యూనిట్‌కు తరలించుకునేవారు. ఈ విషయమై ఫిర్యాదు చేస్తే ఏం చేస్తారోనన్న భయపడి ఎవరూ ముందుకొచ్చే వారు కారు. అయితే, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక కొందరు ముందుకొచ్చి ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టారు. అప్పటివరకు దొరికిన ఆధారాల మేరకు దుర్గా భవానీ గ్రానైట్‌లో రూ.11కోట్ల 43లక్షల 29వేల 120 మేర అక్రమాలు గుర్తించారు. వాటికి సంబంధించి నోటీసులు కూడా ఇచ్చారు. -
నిమ్మాడ ఘటనలో అచ్చెన్నాయుడు అరెస్ట్
సాక్షి, టెక్కలి: తన సొంత గ్రామం నిమ్మాడలో గత నెల 31వ తేదీ ఆదివారం నామినేషన్ వేసేందుకు వెళ్లిన కింజరాపు అప్పన్న, ఆయనకు మద్దతుగా నిలిచిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ తదితరులపై జరిగిన దౌర్జన్యకాండకు ప్రధాన సూత్రధారి అయిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడును పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఏఎస్పీ శ్రీనివాసరావు, కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి, టెక్కలి సీఐ ఆర్.నీలయ్యతో పాటు పోలీస్ బలగాలు నిమ్మాడలో ఆయన ఇంటికి చేరుకుని అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్‌కు తరలించి సంఘటనకు సంబంధించి రికార్డులను సిద్ధం చేసి కోటబొమ్మాళి జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు తరలించారు. ఈ క్రమంలో కొత్తపేట జంక్షన్ వద్దకు చేరుకున్న టీడీపీ శ్రేణులు అచ్చెన్నాయుడు ఉన్న పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నాయి. దీంతో పోలీస్ ప్రత్యేక బలగాలు రంగ ప్రవేశం చేసి వారిని నియంత్రించాయి. అనంతరం కోటబొమ్మాళి సామాజిక ఆస్పత్రిలో ఆయనకు కోవిడ్, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు కోర్టు వద్దకు దూసుకొచ్చే ప్రయత్నం చేయగా, పోలీసులు వారిని అదుపు చేశారు. కోర్టులో సుదీర్ఘ వాదనల తర్వాత అచ్చెన్నాయుడుకు 14 రోజులు రిమాండ్ విధించగా, మధ్యాహ్నం 3.40 గంటలకు ఆయన్ను జిల్లా జైలుకు తరలించారు. ఎందుకు ఈ కేసు అంటే.. ►నిమ్మాడలో కింజరాపు అప్పన్న సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేయడం అచ్చెన్నాయుడు, ఆయన సోదరుడు హరిప్రసాద్, ఆయన కుమారుడు సురేష్‌లకు ఇష్టం లేదు. ►అచ్చెన్నాయుడు గత నెల 30వ తేదీన అప్పన్నకు ఫోన్ చేశారు. ‘అందరం ఒకే దగ్గర ఉంటున్నాం. గతంలో నీకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే. నీ భార్యను ఉద్యోగం నుంచి తీసేయించారన్న విషయం కూడా నాకు తెలుసు. మా అన్నయ్య నోట్ పేపర్ తీసుకొన్న విషయం మాత్రం తెలియదు. అవన్నీ సరే. నువ్వు నష్టపోయావని కూడా తెలుసు. అయినా సరే ఇప్పుడు మాత్రం నువ్వు పోటీ చేయొద్దు. అదేం రాష్ట్రపతి పదవి కాదు’ అని తనదైన శైలిలో చెప్పారు. ‘ఉద్యోగం తీసేయించారు.. మీ వద్దకు 20 సార్లు వచ్చినా పట్టించుకోలేదు..’ అని బాధితుడు చెప్పిన దానికి అవునంటూనే ఎన్నికల్లో పోటీ చేయొద్దని బెదిరించారు. ►తనకు జరిగిన అన్యాయం పట్ల తీవ్రంగా కలత చెందిన అప్పన్న.. పంచాయతీ సర్పంచ్ పదవికి నామినేషన్ వేయడానికే సిద్ధపడ్డారు. ►ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పినా వినకుండా అప్పన్న నామినేషన్ వేయడానికి వెళ్తున్నాడనే సమాచారం తెలుసుకున్న అచ్చెన్నాయుడు.. అతన్ని ఎలాగైనా సరే ఆపండని గత నెల 31న తన సోదరుడిని పురమాయించారు. దీంతో హరిప్రసాద్, సురేష్, టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై బాధితుడు అప్పన్న కోటబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ►ఈ మేరకు క్రైమ్ నంబర్ 44/2021 ప్రకారం 147, 148, 307, 324, 506, 341, 384, 188 రెడ్ విత్ 149, ఐపీసీ సెక్షన్ 123 ఆఫ్ ది పీపుల్ రిప్రజెంట్ చట్టం, సెక్షన్ 212 ఆఫ్ ది ఏపీ పంచాయతీ రాజ్ చట్టం–1995 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే 12 మందిని అరెస్టు చేశారు. అయితే ప్రధాన నిందితులు కింజరాపు హరిప్రసాద్, ఆయన కుమారుడు సురేష్‌లు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 22 మందిపై కేసు నమోదు సాక్షి, విశాఖపట్నం: శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో నామినేషన్ వేయకుండా అడ్డుకుని, బెదిరింపులకు పాల్పడిన ఘటనలో 22 మందిపై కేసు నమోదు చేశామని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కె.వి రంగారావు తెలిపారు. మంగళవారం ఆయన విశాఖ డీఐజీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చట్టం ముందు ఎవరైనా ఒక్కటేనని, శాంతి, సామరస్య ధోరణిలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. స్వేచ్ఛాయుత ఎన్నికలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని, ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చూడడం పోలీసులుగా తమ బాధ్యత అన్నారు. ఎన్నికలకు ఆటంకం కలిగించే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. నేను హోంమినిష్టర్ అవుతా.. మిమ్మల్ని విడిచిపెట్టను ‘రేపు అధికారంలోకి మేమే వస్తాం.. చంద్రబాబునాయుడుకు చెప్పి నేను హోమ్ మినిష్టర్ పదవి తీసుకుంటాను.. మీరు ఎక్కడ ఉన్నా విడిచిపెట్టను’ అని కోటబొమ్మాళి ఆస్పత్రి వద్ద కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి, సీఐ ఆర్.నీలయ్య, పోలీసులను అచ్చెన్నాయుడు బెదిరించారు. -
కుల బహిష్కరణ కేసులో పది మందికి జైలు, జరిమానా
బాధితులకు రూ.5 వేల చొప్పున పరిహారం కోటబొమ్మాళి కోర్టు తీర్పు నిందితుల్లో ఒకరు ఇటీవల మృతి సంతబొమ్మాళి: మండలంలోని వడ్డితాండ్ర గ్రామానికి చెందిన పది మందికి కుల బహిష్కరణ కేసులో ఏడాది పాటు జైలు, ఒక్కొక్కరికి రూ.రెండు వేల చొప్పున జరిమానా విధిస్తున్నట్లు కోటబొమ్మాళి ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ జడ్జి షేక్ నీర్ కాశీమ్ సాహెబ్ గురువారం తీర్పు ఇచ్చినట్లు నౌపడ ఎస్ఐ మంగరాజు తెలిపారు. కుల బహిష్కరణ కేసులో శిక్ష పడిన వారిలో అనంతు దుష్టార్జున (ఇటీవల మరణించాడు), అనంతు హన్నూరావు, అనంతు గంగబెహరా, కారుణ్య ఖత్రో, కారుణ్య అచ్చుత, కారుణ్య ఈశ్వర్, మండల ఘన్ను, మండల పురుషోత్తం, నాగుల ఠంకు, కారుణ్య కేశవ ఉన్నారని పేర్కొన్నారు. 2010 ఏప్రిల్ 8న తమను కుల బహిష్కరణ చేశారని, వడ్డితాండ్ర గ్రామానికి గాయిశ్రీ తులసీ నౌపడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అప్పటి ఏఎస్ఐ రామారావు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసుపై కోటబొమ్మాళి కోర్టులో వాదాపవాదనలు జరిగి తుది తీర్పు గురువారం వెలువడిందని చెప్పారు. బహిష్కరణకు గురైన గాయిశ్రీ తులసి, అనంతు జంబోకు చెరో రూ.5 వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని తీర్పు వెలువడింది. ఇటీవల గ్రామాల్లో కుల బహిష్కరణలు ఎక్కువయ్యాయని, ఈ తీర్పు గుణపాఠం అవుతుందని జడ్జి తీర్పు ఇచ్చారని నౌపడ ఎస్ఐ మంగరాజు తెలిపారు.