బాధితులకు రూ.5 వేల చొప్పున పరిహారం
కోటబొమ్మాళి కోర్టు తీర్పు
నిందితుల్లో ఒకరు ఇటీవల మృతి
సంతబొమ్మాళి: మండలంలోని వడ్డితాండ్ర గ్రామానికి చెందిన పది మందికి కుల బహిష్కరణ కేసులో ఏడాది పాటు జైలు, ఒక్కొక్కరికి రూ.రెండు వేల చొప్పున జరిమానా విధిస్తున్నట్లు కోటబొమ్మాళి ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ జడ్జి షేక్ నీర్ కాశీమ్ సాహెబ్ గురువారం తీర్పు ఇచ్చినట్లు నౌపడ ఎస్‌ఐ మంగరాజు తెలిపారు. కుల బహిష్కరణ కేసులో శిక్ష పడిన వారిలో అనంతు దుష్టార్జున (ఇటీవల మరణించాడు), అనంతు హన్నూరావు, అనంతు గంగబెహరా, కారుణ్య ఖత్రో, కారుణ్య అచ్చుత, కారుణ్య ఈశ్వర్, మండల ఘన్ను, మండల పురుషోత్తం, నాగుల ఠంకు, కారుణ్య కేశవ ఉన్నారని పేర్కొన్నారు.
2010 ఏప్రిల్ 8న తమను కుల బహిష్కరణ చేశారని, వడ్డితాండ్ర గ్రామానికి గాయిశ్రీ తులసీ నౌపడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అప్పటి ఏఎస్‌ఐ రామారావు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసుపై కోటబొమ్మాళి కోర్టులో వాదాపవాదనలు జరిగి తుది తీర్పు గురువారం వెలువడిందని చెప్పారు. బహిష్కరణకు గురైన గాయిశ్రీ తులసి, అనంతు జంబోకు చెరో రూ.5 వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని తీర్పు వెలువడింది. ఇటీవల గ్రామాల్లో కుల బహిష్కరణలు ఎక్కువయ్యాయని, ఈ తీర్పు గుణపాఠం అవుతుందని జడ్జి తీర్పు ఇచ్చారని నౌపడ ఎస్‌ఐ మంగరాజు తెలిపారు.