సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. ఓటమిని ఊహించి.. ఎన్నికల పోలింగ్ రిగ్గింగ్‌కు ప్రయత్నించింది. ఈ క్రమంలో హింసకు తెర లేపింది. వైఎస్సార్‌సీపీ నేతలను, పోలింగ్ ఏజెంట్లను, కార్యకర్తలను, పార్టీ సానుభూతిపరుల్ని.. ఆఖరికి ఓటేసిన వాళ్లను సైతం వదలకుండా దాడులకు తెగబడింది. ఈ క్రమంలో శ్రీకాకుళంలో టీడీపీ గుండాల చేతిలో ఓ నిండు ప్రాణం బలైంది.
టీడీపీ నేతల దాడిలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్ తండ్రి ఒకరు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. బాధితుల్ని తోట మల్లేశ్వరరావుగా పోలీసులు ప్రకటించారు. దాడికి పాల్పడింది టీడీపీ నేత అచ్చెన్నాయుడి అనుచరగణమేనని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.
కోటబొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయితీ బూత్-228లో మాధవరావు అనే వ్యక్తి వైఎస్సార్‌సీపీ తరఫున పోలింగ్ ఏజెంట్‌గా వ్యవహరించారు. అయితే మాధవరావు కుటుంబాన్ని టీడీపీ శ్రేణులు టార్గెట్ చేశాయి. గురువారం గుడిలో పూజ చేస్తుండగా మాధవరావు తండ్రి మల్లేష్‌పై అచ్చెన్నాయుడి వర్గీయులు దాడికి తెగబడ్డారు.
దాడిలో తీవ్రంగా గాయపడిన మల్లేష్ రావును శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మల్లేష్ కన్నుమూశారు. తన తండ్రి మరణానికి కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించాలని మాధవరావు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment