పలు గ్రామాల్లో పదులసంఖ్యలో పింఛన్ల ఎత్తివేత
పంపిణీ చేయకుండా అడ్డుకున్న టీడీపీ నేతలు
ఏలూరు జిల్లా కొత్తగూడెంలో 41 మందికి.. గుంటూరు జిల్లా గరికపాడులో 11మంది వికలాంగులకు.. నెల్లూరు జిల్లా రావులకొల్లులో ఇద్దరికి కోత
పల్నాడు జిల్లాలో 3 గ్రామాల్లో పింఛన్లు నిలిపివేత
శ్రీకాకుళం జిల్లా గోరింటలో పింఛన్ అందక 19 మంది నిరసన
సాక్షి నెట్‌వర్క్: అనుకున్నంతా అయింది. నెలకే మొదలైంది. ఐదేళ్లుగా కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా పింఛన్ అందుకున్న లబ్ధిదారులకు ఇక్కట్లు మొదలయ్యాయి. కూటమి నాయకులు వారికి చుక్కలు చూపిస్తున్నారు. పలు గ్రామాల్లో పింఛన్లను నిలిపేశారు. పలువురి పింఛన్లు తొలగించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి విడత పింఛన్‌ల పంపిణీ కార్యక్రమంలోనే అడుగడుగునా తమ నైజం బయటపెట్టుకున్నారు. పలు గ్రామాల్లో పింఛన్ల పంపిణీని టీడీపీ నాయకులు తమ కనుసన్నల్లో నడిపించారు.
ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదనే కారణంతో పలు గ్రామాల్లో కొందరికి పింఛన్లు అందకుండా చేశారు. వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేశారనే ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఇళ్లపై టీడీపీ జెండా ఐదేళ్లు ఎగిరితేనే పింఛన్ ఇస్తామని బాహాటంగానే చెబుతున్నారు. ఒక లబ్ధిదారుడికి పింఛన్ ఆపేశారని ఫోన్ చేసిన టీడీపీ కార్యకర్తతో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచితంగా మాట్లాడారు. తొక్కగాడివి.. మొనగాడిననుకుంటున్నావా.. అంటూ విరుచుకుపడ్డారు. దెందులూరు మండలంలో పింఛన్లు రాలేదని నిరసన తెలుపుతున్న వారిని ఫొటోలు తీస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్త శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
41 మందికి ఆగిన పింఛన్
ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొత్తగూడెం గ్రామంలో 41 మంది లబ్ధిదారులకు పింఛన్ ఇవ్వలేదు. వారు మంగళవారం గ్రామ సచివాలయం వద్దకు వచ్చి తమ పింఛన్ ఎందుకు ఇవ్వలేదని కార్యదర్శిని ప్రశ్నించారు. అనంతరం గ్రామ సచివాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న వీరిని సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త తీడా శ్రీనుపై ఇద్దరు టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. దీంతో మనస్తాపం చెందిన తీడా శ్రీను వెంటనే అక్కడినుంచి వెళ్లి పెట్రోల్ తీసుకొచ్చాడు. టీడీపీ కార్యకర్తలు తనపై దాడిచేసినచోటే పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
స్థానికులు వెంటనే అతడిని అడ్డుకున్నారు. సర్పంచ్ పరసా లక్ష్మీసుజాత, వైఎస్సార్‌సీపీ నేత పరసా కనకరాజు సూచన మేరకు వైఎస్సార్‌సీపీ నాయకుడు ఉదయభాస్కర్ తదితరులు శ్రీనును ద్విచక్ర వాహనంపై భీమడోలు వైద్యశాలకు తీసుకువెళ్లారు. వైద్యులు శ్రీనుకు ప్రాథమిక వైద్యసేవలు అందించారు. 41 మందికి పెన్షన్లు ఎందుకు నిలిపేశారని పరసా కనకరాజు, కోటిపల్లి సత్తిరాజు, ఉదయభాస్కర్, వర్రె సత్తిబాబు, రాజు ప్రశ్నించారు.
వెంటనే గ్రామానికి చెందిన 41 మంది పెన్షనర్లకు నగదు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరికి, ఏపీ ఆయిల్‌ఫెడ్ మాజీ చైర్మన్ కొఠారు రామచంద్రరావుకు తెలియజేస్తామని, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ విషయమై దెందులూరు ఎంపీడీవో వి.శ్రీలతను వివరణ కోరగా.. ఫిర్యాదులు రావడంతో పెన్షన్లు నిలిపేసినట్లు చెప్పారు. వాటిని పరిశీలించి విచారించిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వికలాంగులపై కక్ష
గుంటూరు జిల్లా గరికపాడులో ఈనెల 1వ తేదీన 11 మంది వికలాంగుల పింఛన్లను టీడీపీ నాయకులు నిలిపేశారు. వీరు వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులని, దొంగ సర్టిఫికెట్‌లతో పింఛన్ తీసుకుంటున్నారని అధికారులకు పోస్టుద్వారా ఫిర్యాదు చేశారు. వారికి పింఛన్ పంపిణీ నిలిపేయాలని డిమాండ్ చేశారు. దీంతో 11 మంది వికలాంగులకు అధికారులు పింఛన్ పంపిణీ నిలిపేశారు. ఈ విషయమై ఎంపీడీఓ రామకృష్ణ మాట్లాడుతూ 11 మంది నకిలీ సర్టిఫికెట్లతో ఫింఛన్ తీసుకుంటున్నారని వెంటనే వారికి నిలిపివేయాలని గ్రామ టీడీపీ నేతలు నోటీసు ఇవ్వడంతో ప్రస్తుతానికి నిలిపేసినట్లు చెప్పారు.
ఐదేళ్లు టీడీపీ జెండా ఉండాలని బెదిరింపు
పల్నాడు జిల్లా అల్లూరివారిపాలెం, పమిడిపాడు, దొండపాడు గ్రామాల్లో పలువురికి పింఛన్ల పంపిణీ నిలిపేశారు. అల్లూరివారిపాలెంలో 20 మందికిపైగా లబ్ధిదారులకు మంగళవారం సాయంత్రం వరకు పింఛన్లు పంపిణీ చేయలేదు. సోమవారం గ్రామంలో పింఛన్ ఇచ్చేందుకు వచ్చిన సచివాలయ సిబ్బంది వద్దకు లబ్ధిదారులు వెళ్లారు. పింఛన్ కావాలంటే గ్రామంలోని టీడీపీ నాయకులను కలవాలని సచివాలయ సిబ్బంది వారికి చెప్పారు. దీంతో పలువురు లబ్ధిదారులు టీడీపీ నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి తమకు పింఛన్ వచ్చేలా చూడాలని కోరారు.
టీడీపీలో చేరి ఇంటిపై జెండా పెడితేనే పింఛన్ ఇస్తామని టీడీపీ నేతలు చెప్పారు. ఐదేళ్లు జెండా ఇంటి మీద ఉండాలని స్పష్టం చేశారు. దీనికి లబ్ధిదారులు విముఖత చూపడంతో వారికి పింఛన్ పంపిణీ చేయలేదు. పమిడిపాడులో పింఛన్ల పంపిణీని జనసేన నాయకులు అడ్డుకున్నారు. సోమవారం కూటమి సానుభూతిపరులకు మాత్రమే పింఛన్ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలిపారంటూ పలువురికి పింఛన్ పంపిణీ చేయకుండా జనసేన నాయకులు అడ్డుకుని హంగామా సృష్టించారు.
గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో పోలీసు బందోబస్తుతో మంగళవారం పెన్షన్లు పంపిణీ చేశారు. దొండపాడులోను పింఛన్ల పంపిణీని ఇదే విధంగా అడ్డుకున్నారు. పలు గ్రామాల్లో సోమవారం టీడీపీ సానుభూతిపరులకే పింఛన్లు పంపిణీ చేశారు. జాబితాలో ఉన్న అందరికీ పింఛన్ ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో మంగళవారం మిగిలిన పింఛన్లు పంపిణీ చేశారు.
పింఛన్ అందలేదని నిరసన
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోరింట సచివాలయం పరిధిలో తమకు పింఛన్లు ఇవ్వలేదని 19 మంది మంగళవారం నిరసన తెలిపారు. సచివాలయం వద్ద సాయంత్రం వరకు కార్యదర్శి కోసం వేచి చూశారు. సాయంత్రం సచివాలయం కార్యదర్శి నాగరాజు వచ్చి 13 మందికి పింఛన్లు ఇచ్చారు. ఇంకా ఆరుగురికి ఇవ్వాల్సి ఉంది. పింఛన్‌దారుల తరఫున సర్పంచ్ భర్త తమ్మినైన మురళీకృష్ణకు చెప్పి ఆఫీసు పనిమీద మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లానని కార్యదర్శి చెప్పారు. సాయంత్రం 13 మందికి పింఛన్లు ఇచ్చానని, మిగిలిన వారిలో అర్హులందరికీ ఇస్తానని తెలిపారు.
ఎంపీడీవో లాగిన్ ద్వారా ఇద్దరి పింఛన్ల తొలగింపు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం రావులకొల్లులో కలవకూరి రామ్మూర్తి, చిగురుపాటి బోడియ్య పింఛన్లు తొలగించారు. రామ్మూర్తికి ఐదేళ్లుగా వృద్ధాప్య పింఛన్, బోడియ్యకు నాలుగేళ్లుగా చర్మకార్మిక పింఛన్ వస్తున్నాయి. స్థానిక టీడీపీ నాయకులు కొద్దిరోజులుగా ఇక నుంచి వారికి పింఛన్ రాదని గ్రామంలో ప్రచారం చేశారు. ఆ విధంగానే ఈ నెల 1వ తేదీ వారికి పింఛన్ నగదు అందలేదు.
దీంతో రామ్మూర్తి, బోడియ్య మంగళవారం పోలంపాడులోని గ్రామ సచివాలయానికి, కలిగిరిలోని ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లారు. ఎంపీడీవో లాగిన్ ద్వారా పింఛన్లను తొలగించారని తెలియడంతో నిర్ఘాంతపోయారు. తమ పింఛన్‌ను అన్యాయంగా నిలిపేశారని కన్నీటి పర్యంతమయ్యారు. టీడీపీ నాయకులు ఉద్దేశ పూర్వకంగానే అధికారుల ద్వారా తమ పింఛన్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో పలు పంచాయతీల్లో కొందరికి పింఛన్ నిలిపేయాలని స్థానిక నాయకులు సచివాలయ సిబ్బందికి సూచించినట్లు తెలిసింది.
గత నెలలో పింఛన్ అందింది
గత నెలలో పింఛన్ నగదు బ్యాంకులో జమ అయింది. ఈ నెలలో పింఛన్ కోసం సోమవారం అంతా ఎదురుచూశాను. మంగళవారం కూడా రాకపోవడంతో మా ఊళ్లో సచివాలయానికి వెళ్తే ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లమన్నారు. అక్కడికెళ్తే ఎంపీడీవో లాగిన్ ద్వారా పింఛన్ తొలగించారని చెప్పారు. టీడీపీ నాయకులు అన్యాయంగా పింఛన్ తొలగించారు. – కలవకూరి రామ్మూర్తి
దళితులకు చేసే న్యాయం ఇదేనా?
దళితుడినైన నాకు కులవృత్తి అయిన చర్మకార్మిక పింఛన్ వస్తోంది. మా కుమార్తె చనిపోవడంతో ఆమె ఇద్దరు పిల్లలకు కూడా మేమే ఆధారం. నాలుగేళ్లుగా వస్తున్న పింఛన్ తొలగించారు. అధికారంలోకి వచ్చిన నెలలోనే దళితులకు టీడీపీ ప్రభుత్వం చేస్తున్న న్యాయం ఇదేనా? నాకు పింఛన్ అందించి న్యాయం చేయాలి. – చిగురుపాటి బోడియ్య
జాగ్రత్తగా ఉండు.. సొంత పార్టీ కార్యకర్తకు ఎమ్మెల్యే కూన హెచ్చరిక
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సొంత పార్టీ కార్యకర్తపైనే విరుచుకుపడ్డారు. ఆ ఆడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమదాలవలస మండలం పీరుసాహెబ్‌పేటకు చెందిన ఊట రాజారావుకు పింఛన్ ఆపేశారంటూ.. పొందూరు మండలం పిల్లలవలసకు చెందిన టీడీపీ కార్యకర్త గురుగుబెల్లి భాస్కరరావు మంగళవారం ఎమ్మెల్యేకి ఫోన్ చేశారు.
రాజారావు వైఎస్సార్‌సీపీకి చెందినవారని పెన్షన్ నిలుపుదల చేశారని, ఆయన మన టీడీపీ వ్యక్తేనని చెప్పారు. ఆయనకు పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటలు ముదిరి నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ ఫోన్‌లో వాదించుకున్నారు. పార్టీ గెలుపునకు వేల రూపాయలు ఖర్చుచేశానని, ఇప్పుడు తమ చుట్టాలకు పెన్షన్ తీసివేయడం సమంజసం కాదని భాస్కరరావు చెబుతుండగానే.. ‘డొంక తిరుగుడు మాటలు మాట్లాడకు, తొక్కగాడివి, మొనగాడివి అనుకుంటున్నావా? మర్యాద ఇచ్చి మాట్లాడు.
మర్యాద ఇస్తున్నాను జాగ్రత్తగా
ఉండు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్..’ అంటూ ఎమ్మెల్యే కూన విరుచుకుపడ్డారు. కూన రవికుమార్ మాటలు విన్న భాస్కరరావు ‘ఆ పెన్షన్ డబ్బులు మూడువేలు కూడా మీరే తీసుకోండి. మేం కష్టపడి పనిచేశాం. తప్పుగా మాట్లాడలేదు. ఇడియట్ అని మీరు తిడితే సహించేదిలేదు..’ అంటూ తిరిగి సమాధానం చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment