ప్రతీకాత్మక చిత్రం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : గ్రానైట్ మాఫియా గత కొన్నేళ్లుగా టీడీపీ నేతల కనుసన్నల్లో రెచ్చిపోతోంది. మామూళ్ల మత్తులో జోగుతూ అధికారులు సైతం నిద్ర నటిస్తూ వచ్చారు. గ్రానైట్ అక్రమ రవాణాకు అండదండలు అందిస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీ స్థాయిలో గండికొట్టారు. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ నేతలు సైతం ఒక్కో లారీకి రూ.15వేల చొప్పున వసూలు చేసి అక్రమ రవాణాకు అండగా నిలుస్తూ వచ్చారు. పోలీస్, మైనింగ్, వాణిజ్య పన్నుల శాఖ, విజిలెన్స్ ఇలా అన్ని శాఖల అధికారులు టీడీపీ నేతలకు జీ హుజూర్ అంటూ మొక్కారు.
వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే విజిలెన్స్ అధికారులు గ్రానైట్ అక్రమ రవాణాతో పాటు గ్రానైట్ క్వారీలపై దాడులు చేస్తుండడంతో గ్రానైట్ మాఫియాకు వణుకు మొదలైంది. దీంతో పాటు నకిలీ కంపెనీల పేరుతో వేలాది ఈ వే బిల్లులు పొంది వాటి ద్వారా అక్రమ రవా ణాకు పాల్పడి ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన వందల కోట్ల రూపాయల రాయల్టీ, జీఎస్‌టీలను అక్రమ వ్యాపారులు మింగేశారు. నకిలీ వేబిల్లుల కుంభకోణం బయట పడడంతో అక్ర మార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అధికారులు సైతం కళ్లు తెరిచి చర్యలకు ఉపక్రమించడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మైనింగ్, పోలీస్, వాణిజ్యపన్నుల శాఖ అధికారులు సంయుక్తంగా టాస్క్‌ఫార్స్ బృందాలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలకు సమాయత్తమవుతున్నారు.
ప్రకాశం జిల్లాలో గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీలపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరిలో కొందరు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వ్యాపారాలు చేస్తున్నప్పటికి కొందరు అక్రమార్కులు మాత్రం వక్రమార్గంలో వ్యాపారాలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అక్రమ వ్యాపారులు రెచ్చపోయారు. కొందరు టీడీపీ నేతల కనుసన్నల్లో గ్రానైట్ మాఫియా నకిలీ వే బిల్లులతో వేలాది లారీల గ్రానైట్‌ను అక్రమంగా తరలించారు. అంతటితో ఆగకుండా అసలు బిల్లులే లేకుండా కూడా వేలాది లారీలను రాష్ట్రం దాటించేశారు. ఇందుకు అండగా నిలిచినందుకు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో టీడీపీ ముఖ్య నేతలకు ప్రతినెలా కోట్ల రూపాయల్లో ముడుపులు చెల్లిస్తూ అక్రమ దందాను కొనసాగించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు జూలు విధిలిస్తున్నారు.
గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీలు, అక్రమంగా రవాణా చేసే లారీలపై వరుస దాడులు నిర్వహిస్తూ అక్రమార్కులకు నిద్ర పట్టకుండా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే తరుణంలో మార్టూరు, బల్లికురవ, సంతమాగలూరు, చీమకుర్తి ప్రాంతాల్లో కొందరు 278 నకిలీ కంపెనీలను సృష్టించి 18,239 వే బిల్లులను పొందారు. వీటి ద్వారా గ్రానైట్‌ను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించి సుమారు రూ.300 కోట్ల వ్యాపారం చేశారు. సరైన బిల్లులతో ఈ వ్యాపారం జరిగి ఉంటే రాయల్టీ, జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి రూ.85 కోట్ల మేర ఆదాయం వచ్చి ఉండేది. పోలీసులు నకిలీ కంపెనీలను సృష్టించిన నలుగురిని అరెస్టు చేసి భారీ కుంభకోణాన్ని చేధించా. వారి ద్వారా దీని వెనుక ఉన్న అసలు సూత్రధారుల పేర్లు బయటకు తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. నకిలీ వే బిల్లుల కుంభకోణం బయటకు రావడంతో అక్రమార్కులతో పాటు వారికి ఇప్పటి వరకు సహకరిస్తూ వస్తున్న వివిధ శాఖల అధికారులు, వారికి అండగా నిలుస్తున్న టీడీపీ నేతలకు సైతం ముచ్చెమటలు పడుతున్నాయి.
సంయుక్త దాడులకు రంగం సిద్ధం..
నకిలీ వేబిల్లుల కుంభకోణం బయటపడడంతో నిద్ర మేల్కొన్న అధికారులు సంయుక్త దాడులకు సమాయత్తమవుతున్నారు. పోలీస్, మైనింగ్, వాణిజ్య పన్నుల శాఖాధికారులతో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆకస్మిక దాడులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. గ్రానైట్ అక్రమ రవాణా జరగకుండా ఈ బృందాలు నిరంతరం నిఘా ఉంచనున్నాయి. రవాణా చేసే లారీలకు ట్రాన్సిట్ పాస్‌లు, వే బిల్లులు పరిశీలించడం, రాయల్టీ చెల్లించారా..? లేదా? అనే దానిపై తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా నకిలీ కంపెనీలు సృష్టించి వే బిల్లులు పొంది వాటి ద్వారా అక్రమ రవాణాకు పాల్పడుతున్న గ్రానైట్ మాఫియాపై నిజాయితీగా వ్యాపారం చేస్తున్న గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులు ఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యంగా బూదవాడ, చీమకుర్తి, పేర్నమిట్ట ప్రాంతాల్లోని అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మైనింగ్, ఏసీబీ, వాణిజ్య పన్నుల శాఖ, విజిలెన్స్ ఉన్నతాధికారులతో పాటు పత్రికా కార్యాలయాలకు ఆకాశరామన్న ఉత్తరాలు రాస్తూ వేడుకొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment