సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేరంటారు. అయితే ప్రకాశం జిల్లా ఎస్పీ మాత్రం ఇంటి దొంగల గుట్టు పట్టేశారు. అసాంఘిక శక్తులతో చేతులు కలిపి భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్న వారి సమాచారాన్ని గుప్పెట్లో పెట్టుకున్నారు. దీంతో జిల్లాలోని అవినీతి పోలీసు అధికారులు, సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటికే పలువురు గ్రానైట్ అక్రమ రవాణా ముఠా సభ్యులు, క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకున్న ఎస్పీ వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టడంతోపాటు, ఇంటి దొంగల పాత్రపై విచారణ జరపడంతో అవినీతి అధికారుల్లో గుబులు మొదలైంది. జిల్లాకు చెందిన పలువురు కీలక బుకీలు అజ్ఞాతంలోకి వెళ్లగా, బెట్టింగ్ వ్యవహారాల్లో సంబంధాలు ఉన్న పోలీసుుల్లో మాత్రం కలవరం మొదలైంది. ఇప్పటికే ఓ పోలీస్ అధికారి సెలవుపై వెళ్లగా, మరొకరికి చార్జి మెమో ఇచ్చారు. అయితే తమవంతు ఎప్పుడు వస్తుందోననే భయాందోళనలో అవినీతి పోలీసు అధికారులు ఉన్నట్లు తెలిసింది.
విచారణలో కీలక ఆధారాలు..
జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ గ్రానైట్, గుట్కా, రేషన్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాలతోపాటు క్రికెట్ బెట్టింగ్‌పై గత కొద్దికాలంగా సీరియస్‌గా దృష్టి సారించారు. అక్రమార్కులకు పోలీసు శాఖలోని కింది స్థాయి సిబ్బంది నుంచి డీఎస్పీ స్థాయి అధికారుల వరకు అంతా సహకరిస్తున్నారనే సమాచారంతో ఎస్పీ రహస్య విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఇటీవల ఒంగోలు నగరంలో ఓ క్రికెట బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా దొంగ వే బిల్లులతో గ్రానైట్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను, గుట్కా రాకెట్‌ను పట్టుకున్నారు. విచారణలో కీలక విషయాలు బయటకు రావడంతో దాని ఆధారంగా చర్యలకు రంగం సిద్ధం చేశారు. ఎస్పీ దూకుడును తెలుసుకున్న గ్రానైట్ మాఫియా, కీలక క్రికెట్ బుకీలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. 15 రోజులు దాటుతున్నా పోలీసులకు ఆచూకీ దొరక్కకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఇంటి దొంగలపై వేటు..
అసాంఘిక శక్తులకు అండగా ఉంటూ భారీ మొత్తంలో నెలవారీ మామూళ్లు తీసుకుంటున్న పోలీసు అధికారులు, సిబ్బందిపై ఎస్పీ చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా గత 15 రోజులుగా జిల్లాలో అవినీతి ఆరోపనలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారులపై రహస్య విచారణ చేపట్టినట్లు సమాచారం. జిల్లాలో ముగ్గురు పోలీస్ అధికారులు, పలువురు సిబ్బంది భారీస్థాయి అవినీతికి పాల్పడుతున్న విషయం ఎస్పీ విచారణలో తేలడంతో వారం రోజుల్లో వీరిపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. గ్రానైట్ మాఫియా, గుట్కా రాకెట్, క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాల్లో పలువురు పోలీసు అధికారులు, సిబ్బందికి సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవడంతో అక్రమార్కుల కాల్ లిస్టు ఆధారంగా ఎస్పీ వివరాలు సేకరించినట్లు సమాచారం. అక్రమార్కులు, అసాంఘిక శక్తులకు సహకరిస్తున్న ఇంటి దొంగల జాబితాను ఎస్పీ సిద్ధం చేస్తున్నట్లు తెలియడంతో అవినీతి ఖాకీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment