‘సహాయం’కుగ్రీన్ సిగ్నల్
గ్రానైట్ అక్రమ దందాపై సమగ్ర విచారణకు ఐఏఎస్ అధికారి సహాయం కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విచారణను మదురై జిల్లాకు మాత్రమే పరిమితం చేసినట్లు సంకేతాలు వస్తున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ట్రాఫిక్ రామస్వామి రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కార కేసుకు పట్టుబడుతూ పిటిషన్ దాఖలు చేశారు.
సాక్షి, చెన్నై:రాష్ట్రంలో గ్రానైట్, సముద్ర తీరాల్లో ఖనిజ సంపదల్ని అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న బడా బాబుల బండారం ఇటీవల వెలుగులోకి వచ్చింది. కేవలం మదురైలోనే వేల కోట్ల కుంభకోణం బయటపడడంపై మద్రాసు హైకోర్టు రాష్ర్ట వ్యాప్తంగా సమగ్ర విచారణకు ఆదేశించింది. సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి దాఖలు చేసిన పిటిషన్ మేరకు ఐఏఎస్ అధికారి సహాయం నేతృత్వంలో కమిటీని హైకోర్టు ఏర్పాటు చేసింది. అయితే, ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేయలేదు. ఇప్పటికే తాము అన్ని చర్యలు తీసుకున్నామంటూ ఆ కమిటీని వ్యతిరేకించే పనిలో పడింది. ఎట్టకేలకు గత వారం హైకోర్టు తీవ్రంగా స్పందించడంతో కమిటీ ఏర్పాటు అనివార్యం అయింది.
ఆమోదం : నాలుగు రోజుల్లోపు కమిటీ ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణ నేతృత్వంలోని బెంచ్ గత వారం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
ఆ గ డువు ముగిసినా ఉత్తర్వులు వెలువడ లేదు. దీంతో కోర్టు ఆగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం సహాయం కమిటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల్ని గురువారం ప్రధాన బెంచ్ ముందు ఉంచారు. సహాయం కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు, ఆ కమిటీకి ప్రభుత్వం అందించే సహాయాన్ని వివరిస్తూ తన వాదనను బెంచ్ ముందు ప్రభుత్వం తరపు న్యాయవాది సోమయాజులు ఉంచారు. మదురైకు పరిమితం: సహాయం కమిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ర్ట ప్రభుత్వం తన పనితనాన్ని ప్రదర్శిస్తూ మెలిక విధించడం చర్చనీయాంశమైంది. కేవలం మదురైలో సాగిన గ్రానైట్ స్కాంపై సమగ్ర విచారణ జరిపే విధంగా ఆ కమిటీకి అధికారాల్ని ప్రభుత్వం ఇచ్చినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఆ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా విచారణ చేపట్టాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది.
ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ వాదనల సందర్భంగా ట్రాఫిక్ రామస్వామి తరపు న్యాయవాది రాజారాం బెంచ్ ముందుకు కొన్ని విషయాల్ని తీసుకెళ్లారు. కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు వచ్చిన దృష్ట్యా, అందులో ఉన్న అంశాల్ని పరిగణనలోకి తీసుకుని తదుపరి పిటిషన్‌కు బెంచ్ అవకాశం కల్పించింది. దీంతో కోర్టు ధిక్కార కేసు నమోదు లక్ష్యంగా ట్రాఫిక్ రామస్వామి బెంచ్‌ముందు పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విచారణ చేపట్టే విధంగా చర్యలు తీసుకోకుండా, కేవలం మదురైకు పరిమితం చేస్తున్నారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే, కాలయాపన, కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. పీఎంకే నేత రాందాసు తన ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల్ని వ్యతిరేకించారు. కోరల్ని పీకేసి కమిటీని ఏర్పాటు చేసినట్టుందని మండి పడ్డారు. కేవలం మదురైకు పరిమితం చేయకుండా, రాష్ట్ర వ్యాప్తంగా సహాయం నేతృత్వంలోని కమిటీకి విచారణ జరిపే అధికారాలు అప్పగించాలని డిమాండ్ చేశారు.