అక్రమ కేసులకు భయపడేది లేదు | Gorantla Madhav attended the investigation at Vijayawada cyber crime station | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులకు భయపడేది లేదు

Published Fri, Mar 7 2025 5:59 AM | Last Updated on Fri, Mar 7 2025 9:24 AM

Gorantla Madhav attended the investigation at Vijayawada cyber crime station

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ 

విజయవాడ సైబర్‌ క్రైం స్టేషన్‌లో విచారణకు హాజరు 

విజయవాడ స్పోర్ట్స్‌: అక్రమ కేసులకు తాము భయపడబోమని హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ చెప్పారు. వైఎస్సార్‌సీపీ నాయకులు మాట్లాడినా, ప్రజావ్యతిరేక విధానాలను విమర్శించినా, సభలు, సమావేశాలు పెట్టినా అక్రమ కేసులు నమోదు చేస్తూ కూటమి ప్రభుత్వం పాలనను నెట్టుకొస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక ఎల్రక్టానిక్‌ మీడియా చానల్‌ చర్చలో మైనర్‌ బాలిక పేరును గోరంట్ల మాధవ్‌ ప్రస్తావించారని, ఇది బాలిక హక్కుల రక్షణకు భంగం కలిగిస్తుందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

పోక్సో యాక్ట్, బీఎన్‌ఎస్‌ 72, 79 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం మాధవ్‌ గురువారం విజయవాడ సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో హాజరయ్యారు. మాధవ్‌ను సైబర్‌ క్రైం స్టేషన్‌ సీఐ శ్రీను మధ్యాహ్నం 12.40 నుంచి 1.25 గంటల వరకు విచారించారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని గతంలోనే నోటీసులు పంపితే ఎందుకు స్పందించలేదు?, మైనర్‌ బాలిక పేరును చర్చలో ఎందుకు ప్రస్తావించారు?, బాలిక పేరు ప్రస్తావించడం తప్పని మీకు తెలీదా? అని సీఐ ప్రశ్నించినట్లు సమాచారం. 

ఈ కేసులో విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని, సాక్షులను బెదిరించవద్దని సూచించి మాధవ్‌ను పోలీసులు పంపించినట్లు తెలిసింది. వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ న్యాయవాదులు ఒగ్గు గవా­స్కర్, సాయిరాం తదితరుల సమక్షంలో మాధవ్‌ పోలీసు విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం గోరంట్ల మాధవ్‌ మీడియాతో మాట్లాడుతూ అక్రమ కేసులతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, వైఎస్సార్‌సీపీ నాయకులను అడ్డుకోవాలనుకోవడం హాస్యాస్పదమన్నారు. 

రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా పక్కనపెట్టి కేవలం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించడం పైనే కూటమి నాయకులు దృష్టి సారించారని మండిపడ్డారు. ప్రజలపై కూటమి నాయకులు దాడు­లు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదని విమర్శించారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనపై రాష్ట్ర ప్రజలు ఇప్పటికే విసుగు చెందారని, ఇకపై జరిగే ఎన్నికల్లో ఆయన గెలిచేది లేదని, వైఎస్‌ జగన్‌ ఓడేది లేదన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement