
చనిపోతున్నాను..
డబ్బుల విషయమై గొడవ జరగడంతో మనస్తాపం చెందిన ఓ యువ కుడు స్నేహితుడికి ఫోన్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు మెదక్‌జిల్లా వాసి.
మిత్రుడికి ఫోన్ చేసి ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు
డబ్బుల విషయమై గొడవ..
మనస్తాపంతో బలవన్మరణం
మృతుడు మెదక్ జిల్లావాసి
కీసరలో ఘటన
కీసర, న్యూస్‌లైన్: డబ్బుల విషయమై గొడవ జరగడంతో మనస్తాపం చెందిన ఓ యువ కుడు స్నేహితుడికి ఫోన్ చేసి ఆత్మహ త్యకు పాల్పడ్డాడు. మృతుడు మెదక్‌జిల్లా వాసి. ఈ సంఘటన సోమవారం కీసరగుట్ట సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా ములుగు మండలం తుంకిబొల్లారం గ్రామానికి చెందిన అక్కిరెడ్డి భాస్కర్‌రెడ్డి (25) ఆర్నెల్లుగా కీసర గ్రామంలోని ఓ పెట్రోల్ బంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తూ స్థానికంగా అద్దెకు ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం డబ్బుల విషయమై పెట్రోల్ బంక్‌లో క్యాషియర్‌కు, భాస్కర్‌రెడ్డికి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందాడు. రాత్రి 11 గంటల సమయంలో భాస్కర్‌రెడ్డి ములుగులోని తన మిత్రుడు మహేందర్‌కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు.
‘జీవితంపై విరక్తి కలిగింది.. నేను చనిపోతున్నా..’ అని తెలిపాడు. సోమవారం ఉదయం తిరిగి 10:30 గంటల సమయంలో కూడా మరోమారు మహేందర్‌కు ఫోన్ చేసి తను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పి అనంతరం ఫోన్ స్విఛాఫ్ చేశాడు. మహేందర్ సమాచారంతో సోమవారం ఉదయం భాస్కర్‌రెడ్డి తల్లిదండ్రులు, బంధువులు కీసరకు చేరుకొని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పెట్రోల్ బంక్ సిబ్బంది కూడా బంక్ మూసేసి భాస్కర్‌రెడ్డి కోసం గాలించసాగారు. భాస్కర్‌రెడ్డి సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా పోలీసులు, కుటుంబీకులు కీసరగుట్ట సమీపంలో వెతికారు. మొండిగుట్ట దగ్గర ఆయన పురుగుమందు తాగి విగతజీవిగా పడి ఉన్నాడు. ఎస్‌ఐ శ్రీహరి ఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. భాస్కర్‌రెడ్డి అవివాహితుడు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో భాస్కర్‌రెడ్డి తండ్రి ఎల్లారెడ్డి, కుటుంబీకులు ఘటనా స్థలంలో గుండెలుబాదుకుంటూ రోదించారు. ‘ ఈ చిన్న విషయానికే ఆత్మహత్య చేసుకున్నవారా..?’ అని కన్నీటిపర్యంతమయ్యారు. ఎల్లారెడ్డి ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.