
రామాయంపేట, నిజాంపేట(మెదక్): నిజాంపేట మండలం రజాక్‌పల్లి పంచాయతీ పరిధిలోని ఖాసీంపూర్ తండాలో డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో ఉరి వేసుకొని మృతి చెందింది. తండాకు చెందిన నాజం కూతురు నీరజ(18) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. తల్లి బుజ్జి గతంలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతిపై కూడా అనుమానాలున్నాయి. నీరజకు ఇద్దరు సోదరులున్నారు. కొంతకాలంగా కుటుంబ సమస్యల కారణంగా ఇంట్లో గొడవలు జరుగుతున్నట్టు తెలిసింది.
ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిటికీ ఊచలకు ఉరివేసుకున్న నీరజ మృతదేహాన్ని పక్కవారు గుర్తించి తండావాసులకు తెలిపారు. తక్కువ ఎత్తులో ఉన్న కిటికీ ఊచలకు ఉరివేసుకున్న నీరజ కాళ్లు రెండు నేలను తాకుతుండటంతో ఆమె మృతిపై తండావాసులు అనుమానం వ్యక్తంచేశారు. నీరజ ఆత్మహత్య అనుమానాస్పదంగా మారగా, తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
నిజాంపేట పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నీరజ కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తూ తండా వాసులు తరలివచ్చి పోస్టుమార్టం ప్రక్రియను అడ్డుకున్నారు. నిజాంపేట ఎస్సై ప్రకాశ్ మృతురాలి బంధువులకు నచ్చచెప్పినా వినకపోవడంతో, పోస్టుమార్టం సోమవారం నాటికి వాయిదా వేశారు. ఈ మేరకు కేసు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment