
కీసరగుట్టలో వైభవంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
వేదపండితుల ఆధ్వర్యంలో భేరీపూజ, ధ్వజారోహణం
నేటిరాత్రి శ్రీరామలింగేశ్వరస్వామివారి కల్యాణం
కీసర, న్యూస్‌లైన్: కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. శంభో శంకర, హరహర మహాదేవ అంటూ భక్తుల నామస్మరణతో కీసరగుట్ట మార్మోగింది. టీటీడీ వేద పాఠశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున అవధాని సర్వోపద్రష్టగా, ఆచార్య పుల్లేటికుర్తి గణపతిశర్మ ఆధ్వర్యంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ తటాకం రమేష్ దంపతులచే మహామండపంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం తదితర కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఆలయ చైర్మన్ దంపతుల సహా యాగశాల ప్రవేశం చేసిన వేదపండితులు అగ్నిప్రతిష్ఠాపన గావించారు. భేరీ పూజ, ధ్వజారోహణ కార్యక్రమాలను కన్నులపండువగా నిర్వహించారు. బ్రహోత్సవాల ప్రారంబోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున జేసీ చంపాలాల్, పీడీ సుధాకర్‌రెడ్డి హాజరయ్యారు. ఆలయ వేదపండితులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం జే సీ చంపాలాల్, పీడీ సుధాకర్‌రెడ్డిలకు వేద పండితులు స్వామివారి ఆశీర్వచనంతోపాటు మహాప్రసాదాన్ని అందజేశారు. మొదటి రోజు పూజా కార్యక్రమాల్లో ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి, తహసీల్దార్ జయమ్మ, ఆలయ ఫౌండర్‌ట్రస్టీ సభ్యులు తటాకం నారాయణ శర్మ, వెంకటేష్ శర్మ, ఉమాపతి శర్మ, శ్రీనివాస్ శర్మ, నాగలింగం శర్మ తదితరులు పాల్గొన్నారు.
నేటి పూజా కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాల్లో రెండోరోజైన బుధవారం ఉదయం రుద్ర స్వాహాకార హో మం, వేదపారాయణం, సాయంత్రం బి ల్వార్చన, రాత్రి ప్రదోషకాల పూజ, హా రతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద విని యోగం జరుగుతాయి. కీసర గ్రామం నుంచి కీసరగుట్టకు శ్రీస్వామివారు విచ్చేసిన అనంతరం రాత్రి 10 గంటలకు శ్రీ భవాని శివదుర్గాసమేత రామలింగే శ్వరస్వామివార్ల కల్యాణం నిర్వహిస్తారు.