సాక్షి, హైదరాబాద్ : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లిలో నాగుపాము హల్‌చల్ చేసింది. స్కూటీలో దూరి ఓ వ్యక్తికి చెమటలు పట్టించింది. యాదాద్రి జిల్లా చీకటి మామిడికి చెందిన రాములు ఎఫ్‌సీఐలో ఉద్యోగం చేస్తున్నాడు. రోజూమాదిరిగానే మంగళవారం ఉదయం స్కూటీ తీసుకుని ఉద్యోగానికి బయలుదేరాడు. రాంపల్లి మహంకాళి ఆలయం వద్దకు రాగానే ఆయన చేతిని ఏదో తాకుతున్నట్టుగా అనిపించింది. దాంతో స్కూటీని ఆపి చూడగా హెడ్‌లైట్‌లో నక్కి ఉన్న నాగుపాము పిల్ల కనిపించింది.
ఒక్కసారిగా షాక్‌కు గురైన రాములు స్కూటీని పక్కనపడేసి.. అక్కడే ఉన్న మహంకాళి ఆలయ చైర్మన్ రామారం వినోగ్‌గౌడ్‌కు విషయం చెప్పాడు. వినోగ్‌గౌడ్ పాములు పట్టే ఎరుకలి మైసయ్యను పిలిపించాడు. స్కూటీ హెడ్‌లైట్‌లో దాగున్న పామును బయటకు తీయించి అడవిలో వదిలేశారు. రాములుకు ప్రథమ చికిత్స చేయించారు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని అతను ఊపిరి పీల్చుకున్నాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment