
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ హైదరాబాద్ శివార్లలోని కీసరగుట్ట అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు. తన పుట్టినరోజు (జూలై 24) సందర్భంగా దుబారా ఖర్చులు చేయకుండా సమాజహితం కోసం సాయం చేయాలంటూ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విసిరిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ చాలెంజ్‌కు స్పందనగా ఎంపీ సంతోష్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 2,042 ఎకరాల అడవిలోని కొంత భాగాన్ని ఎంపీ నిధులతో ఎకో టూరిజం ప్రాజెక్టుగా అభివృద్ధి చేసి, మిగతా ప్రాంతాన్ని అటవీ పునరుజ్జీవనం కింద రక్షిత అటవీ ప్రాంతంగా మారుస్తామని ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. త్వరలోనే కీసరగుట్ట అటవీ ప్రాంతంలో పర్యటించి అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు అద్భుతంగా ఉన్నాయని, పట్టణ ప్రాంత వాసులు సేదతీరేందుకు, ఆరోగ్యకర జీవనవిధానం అలవర్చుకునేందుకు ఇవి తోడ్పాటునిస్తాయని ఆయన పేర్కొన్నారు. అటవీ ప్రాంతాలు, అర్బన్ లంగ్ స్పేస్‌ల అభివృద్ధిలో పాలుపంచుకోవాల్సిందిగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ఛాలెంజ్ విసిరారు. తన ట్విట్టర్ ద్వారా మాజీ ఎంపీ కవిత, హీరోలు విజయ్ దేవరకొండ, నితిన్, దర్శకుడు వంశీ పైడిపల్లి, పారిశ్రామికవేత్త ముత్తా గౌతమ్‌లను ట్యాగ్ చేశారు. మంచి నిర్ణయంలో తనను కూడా భాగస్వామ్యం చేసినందుకు సంతోష్ కుమా ర్‌కు వంశీ పైడిపల్లి కృతజ్ఞతలు తెలిపారు.