రామలక్ష్మి (ఫైల్) రామలక్ష్మి మృతదేహం
ఎన్‌ఏడీ జంక్షన్ (విశాఖ పశ్చిమ): వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మహిళా వీఆర్వో మృతి చెందారని కంచరపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. కాలం చెల్లిన ఇంజక్షన్ వేయడం వల్లే చనిపోయారని ఆరోపించారు. కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 7న ఉబ్బసం వ్యాధి ఉందంటూ అనకాపల్లి మండలం తుమ్మపాల ప్రాంతానికి చెందిన వీఆర్వో ఉప్పాడ రామలక్ష్మి(37) సన్‌రైజ్ ఆసుపత్రిలో చేరారు. మూడు రోజులు వైద్యం అనంతరం ఆమె కోలుకుంది.
వైద్యుడు జి.శ్రీధర్ శుక్రవారం డిస్‌ఛార్జ్ చేస్తానని చెప్పాడు. అయితే శుక్రవారం శ్రీధర్ వ్యక్తిగత పనిమీద గోవా వెళ్లిపోయాడు. మధ్యాహ్నం సమయంలో రామలక్ష్మి ఒక్కసారిగా అస్వస్థతకు గురయింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది ఆమెకు ఇంజక్షన్ వేయగా అరగంట గడిచిన తరువాత ఆమె చనిపోయింది. ఇంజక్షన్ వికటించి మృతి చెందిందని.. దీనికి ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. రామలక్ష్మి భర్త ఉప్పాడ నాగేంద్ర జగదీష్ ప్రతాప్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. రామలక్ష్మీకి 5 నెలల కుమార్తె ఉంది. ఆసుపత్రి సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో రామలక్ష్మి కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment