కలెక్టర్‌కే కథలు | VROs Wrong Reports Filing To Visakhapatnam Collector | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌కే కథలు

Published Fri, Jun 29 2018 12:29 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

VROs Wrong Reports Filing To Visakhapatnam Collector - Sakshi

కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇవ్వాల్సిన టైమ్‌ స్కేల్‌ ప్రమోషన్‌ను అడ్డగోలుగా కట్టబెట్టేశారు..ఈ వ్యవహారంలో నిబంధనలను చాపచుట్టేశారు.. వేలకు వేలు వసూలు చేసి అర్హత లేని పలువురు వీఆర్వోలకు ప్రమోషన్‌ స్కేల్‌ ఇప్పించేసి.. ఒక్కొక్కరికీ లక్షల్లో ఆర్థిక ప్రయోజనం చేకూర్చారు..

కలెక్టరేట్‌ ఏ సెక్షన్‌ సాక్షిగా ఇద్దరు ఉద్యోగులు సాగించిన ఈ దందాను ‘సాక్షి’ బట్టబయలు చేయడంతో కలెక్టరేట్‌ మొత్తం ఉలిక్కిపడింది. స్వయంగా కలెక్టర్‌ తీవ్రంగా స్పందించారు. డీఆర్వో, ఏవోలను పిలిపించి.. ఈ వ్యవహారం నిగ్గు తేల్చాలని.. తప్పు జరిగితే బాధ్యులపై చర్యలతోపాటు అడ్డగోలు ప్రమోషన్‌ పొందిన ఉద్యోగుల నుంచి రికవరీ చేయాలని కూడా ఆదేశించారు.అయితే ఆ సాయంత్రానికే సీను మారిపోయిం ది. దందా చేసిన ఉద్యోగుల తరపున కొందరు రెవె న్యూ ఉద్యోగ సంఘాల నేతలు రంగంలోకి దిగారు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ప్రమోషన్ల వర్తింపు అంతా సవ్యంగానే జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్ల డైందని ఏకంగా కలెక్టర్‌ చేతే ప్రకటన ఇప్పించేశారు..

దందాను బయటపెట్టిన ‘సాక్షి’ ఈ వ్యవహారం లోతుల్లోకి వెళ్లింది. ఎటువంటి అర్హతలు లేకపోయినా.. నిర్ణీత పరీక్షలు రాయకపోయినా.. పలువురు వీఆర్వోలకు ప్రమోషన్లు కట్టబెట్టేశారని పరిశీలనలో తేలింది. కలెక్టర్‌కే కట్టు కథలు చెప్పి.. దందా వ్యవహారాన్ని కంచి చేర్చేస్తున్నారనీ తేలింది.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలోని వీఆర్వోలకు అడ్డగోలుగా టైమ్‌ స్కేల్‌ ప్రమోషన్‌ వర్తింపజేసిన వ్యవహారంలో కలెక్టరేట్‌లో ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన కొందరు అధికారులు ఏకంగా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌నే తప్పుదోవ పట్టించారని తెలుస్తోంది. కలెక్టర్‌ కార్యాలయంలోని ఏ3, ఏ4 ఉద్యోగులు జీవో నెం.93, 96లలోని నిబంధనలకు విరుద్ధంగా టైమ్‌ స్కేల్‌ ఫైళ్లు రూపొందించి ఉన్నతాధికారులతో సంతకాలు పెట్టించిన  వైనాన్ని సాక్షి వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 25న ‘కలెక్టరేట్‌లో ఏ4, ఏ3ల దందా’ శీర్షికతో ప్రచురితమైన ఈ కథనం కలకలం రేపింది. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించిన కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌.. ప్రాథమిక సమాచారం మేరకు వీఆర్వోలకు ప్రమోషన్‌ స్కేలు వర్తింపజేయడంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, ఫైళ్లన్నింటినీ పరిశీలించామని పేర్కొంటూ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ విషయంలోనూ అధికారులు కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించినట్లు స్పష్టమవుతోంది.

జీల్లో ఏముందంటే..
టైమ్‌ స్కేల్‌కు సంబంధించిన జీవోలను పరిశీలిస్తే.. జీవో నెం. 93 ఫైనాన్స్‌ పే కమిషన్‌–2 (తేదీ 30.4.2010) ప్రకారం ఓ వ్యక్తి ఉద్యోగంలో చేరిన తర్వాత సర్వీస్‌ రూల్స్‌లో మార్పులు, చేర్పులు జరిగి.. పదోన్నతికి ఆటంకాలు ఎదురయ్యే సందర్భాల్లో మాత్రమే ఆ ఉద్యోగికి ప్రత్యేక పదోన్నతి స్కేల్‌–1 లేదా 2 ఇవ్వవచ్చు. ఈ జీవో నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో 23.1.2011న ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆర్థిక శాఖ 20.5.2011న జీవో నెం. 96ను ఫైనాన్స్‌ విభాగం (పేకమిషన్‌ –2) జారీ చేసింది. దీని ప్రకారం అప్పటి వరకు అమల్లో ఉన్న 8, 16, 24 సంవత్సరాల్లో ఇస్తున్న స్పెషల్‌ స్కేల్స్‌ను 6, 12, 18, 24 సంవత్సరాల్లో ఇచ్చేలా మార్చారు.

ఆ పరీక్షలేమీ లేకుండానే..
జీవోలోని పేరా 7 (2)  ప్రకారం 12 ఏళ్ల స్పెషల్‌ ప్రమోషన్‌ స్కేలు పొందాలంటే  విద్యార్హతలు, శాఖాపరమైన పరీక్షల్లో  ఉత్తీర్ణత తప్పనిసరి. అదే జీవోలోని పేరా 7 (3) ప్రకారం నాలుగో తరగతి కేటగిరీ ఉద్యోగులు అంటే.. అటెండర్లు,  డఫేదార్లు, డ్రైవర్లు, ఆపరేటర్లుకు మాత్రం ఈ అర్హతల నుంచి మినహాయించారు. వీఆర్వోలు జూనియర్‌ అసిస్టెంట్‌ స్కేలును పొందుతున్నందున వారికి ఈ మినహాయింపులు అసలు వర్తించవు. అలాగే ప్రభుత్వానికి, వీఆర్వోల సంఘానికి జరిగిన ఒప్పందం ప్రకారం.. వారు సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందాలంటే రెవెన్యూ పరీక్షలు పార్ట్‌–1 (పేపర్‌ కోడ్‌–18, 27), పార్ట్‌ –2 (పేపర్‌ కోడ్‌ 43), పార్ట్‌–3 (పేపర్‌ కోడ్‌ 04), అకౌంట్‌ టెస్టు (పేపర్‌ కోడ్‌–7), సర్వే ట్రైనింగ్,, క్రాప్‌ శాంప్లింగ్‌ శిక్షణ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి.

అయితే ప్రస్తుతం స్పెషల్‌ అడ్‌హాక్‌ పే స్కేలు ఇచ్చిన ఏ ఒక్క వీఆర్వోకూ ఈ అర్హతలు లేవు. అయినా జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు ఆర్‌సీ నెం. 1051/2015/ఏ4(తేదీ 15.3.2015) ద్వారా 32 మందికి ఈ స్కేలును వర్తింపజేశారు. ఈ ఉత్తర్వుల్లోని 22వ పేరులో పేర్కొన్న పొలమరశెట్టి వీరప్పారావు (ప్రస్తుతం అచ్యుతాపురం మండలంలో పని చేస్తున్నారు.) ఏ ఒక్క పరీక్షలోనూ అర్హత సాధించలేదు. ఇతనికి అడ్డగోలుగా 12 సంవత్సరాల ప్రమోషన్‌ స్కేలు ఇచ్చేశారు. అతనొక్కడే కాదు, మిగతా వీఆర్వోల సర్వీసు రిజిస్టర్లను పరిశీలిస్తే ఏ3, ఉద్యోగుల ఘనకార్యం బయటపడుతుంది. వీరివురు సీసీఏ రూల్స్‌ను అతిక్రమించి వీఆర్వోలతో కుమ్మక్కైనట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఏ3, ఏ4 అంటే హడలెందుకు?
వాస్తవానికి సోమవారం ఈ వ్యవహారం మొత్తం సాక్షి వెలుగులోకి తీసుకువచ్చిన వెంటనే సమగ్ర విచారణకు కలెక్టర్‌ ఆదేశించారు. అయితే రెవెన్యూ ఉద్యోగుల సంఘంలోని కొందరు నేతల ఒత్తిడి మేరకు విచారణ అటకెక్కించి .. ప్రాధమిక విచారణ మేరకు అంతా సవ్యంగానే జరిగినట్టు మళ్లీ కలెక్టర్‌ చేతే  ప్రకటన ఇప్పించేశారు. దీంతో ఏ–3. ఏ4లు గండం నుంచి గట్టెక్కినట్టేనని భావించారు. ఈ వ్యవహారం కలెక్టరేట్‌ ఉద్యోగవర్గాల్లో చర్చనీయాంశమైంది. మిగతా జిల్లాల్లో ఈ స్కేల్‌ను  ఎందుకు  వర్తింపజేయడం లేదు..  అంతవరకకెందుకు మన జిల్లాల్లోనే ఇతర ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎందుకు వర్తింపజేయడం లేదో కలెక్టర్‌కే తెలియాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన ఏ3, ఏ4లపై విచారణకు సైతం ఉన్నతాధికారులు వెనుకాడటమే ఇప్పుడు కలెక్టరేట్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement