మార్చురీ వద్ద న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న బాధిత కుటుంబాలు
సాక్షి, విశాఖపట్నం / పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): ఆభాగ్యులెవరైనా ఆపదలో ఉంటే పట్టించుకోవలసిన బాధ్యత ఆయనది. క్షతగాత్రులు, బాధితులకు తక్షణమే ఆదుకోవలసిన కర్తవ్యం ఆయనది. ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయానికి కృషి చేయాల్సిన విధి కూడా కలెక్టర్‌పైనే ఉంటుంది. మరి అవేమీ పట్టించుకోకుండా, బాధిత కుటుంబాల గోడు గాలికొదిలేస్తే ఆ కలెక్టర్‌ను ఏమనుకోవాలి? కనికరం లేని కలెక్టర్ అని అనుకోవాలి. ఇప్పుడు మన విశాఖ కలెక్టర్ కాటమనేని భాస్కర్‌ను పెదగంట్యాడ మండలం స్వతంత్రనగర్‌లో విష రసాయనాన్ని తాగి అశువులు బాసిన గిరిజన బాధిత కుటుం బ సభ్యులు అలాగే అనుకుంటున్నారు. మానవ త లేకుండా వ్యవహరించారని ఆక్రోశిస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే?
స్వతంత్రనగర్ ఎస్టీకాలనీలో రసాయనాన్ని తా గి ఏడుగురు గిరిజనులు మృత్యువాతపడ్డారు. సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో కలెక్టర్‌ను కలిసి బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరడానికి సీపీఎం నాయకులను వెంటబెట్టుకుని వెళ్లారు. తనను కలవకుండా అరగంట సేపు బయటనే కూర్చోబెట్టారు. విషణ్ణవదనాలతో వీరంతా కలెక్టర్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో 11 గంటలకు చాంబర్ నుంచి బయటకు వచ్చారు. గడియారం వైపు చూపిస్తూ ‘ఇప్పుడే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. పరిహారం గురించి అడక్కండి. నేనేమీ చేయలేను. నన్ను ఇందులో ఇన్‌వాల్వ్ చేయకండి.. ఇక్కడ్నుంచి వెళ్లిపోండి.. ఎలక్షన్ అయ్యాక వస్తే న్యాయం చేస్తాను..’ అంటూ వెళ్లిపోబోయారు. కోడ్‌కు మానవత్వంతో కూడిన పరిహారానికి సంబంధం లేదని బాధిత కుటుంబీకులు, సీపీఎం నాయకులు ఆయనను ప్రాధేయపడ్డారు. అయినా కలెక్టర్ మనసు కరగలేదు. తాము 10.30 గంటలకే ఆయన్ను కలిసినప్పుడే తమ వినతిని స్వీకరించి ఉంటే ఆయన చెప్పినట్టుగా కోడ్ అడ్డంకి ఉండేది కాదని, ఉద్దేశపూర్వకంగానే కలెక్టర్ అమానవీయంగా వ్యవహరించారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు సంభవించి ప్రాణనష్టం జరిగినప్పుడు ఇలాగే తప్పించుకుంటారా? అంటూ సీపీఎం నాయకులు సీహెచ్ నర్సింగరావు, గంగారావు తదితరులు ప్రశ్నించారు. అనంతరం వెనుతిరిగి కేజీహెచ్ మార్చురీ వద్ద తమకు న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు.
ఎన్నికల కోడ్ అడ్డమన్నారు
కలెక్టరేట్‌కు ఉదయం 10.30 గంటలకే చేరుకున్నాం. మమల్ని కలెక్టర్ చాంబర్‌లోకి వెళ్లనివ్వకపోవడంతో వరండాలో వేచి ఉన్నాం. 11 గంటల సమయంలో ఆయన గది నుంచి వెలుపలకి వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ప్రకటించినందున బాధితులకు న్యాయం చేస్తామని చెప్పడం కుదరదని, ఎన్నికలు పూర్తయిన తరువాత మృతుల కుటుంబాలకు తగిన న్యాయం చేస్తామని చెప్పారు. ఇది చాలా అన్యాయం.
– వాడపిల్లి అప్పన్న,13 జిల్లాల గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment