
కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ నుంచి బాధ్యతలు స్వీకరిస్తున్న నూతన కలెక్టర్ కాటమనేని భాస్కర్
సాక్షి, విశాఖపట్నం: నాకంటూ ప్రత్యేకంగా ప్రాధాన్యతలు ఏమీ లేవు.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాధాన్యతలే నా ప్రాధాన్యతలు.. ఆయన చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను జిల్లాలో అమలు చేయడమే నా పని‘ అని విశాఖ జిల్లా నూతన కలెక్టర్ కాటమనేని భాస్కర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకనుగుణంగా పనిచేయడమే నా బాధ్యతన్నారు. జిల్లాలో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను సమన్వయం పరుస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. అలాగే అన్ని శాఖల సమన్వయంతో ప్రజలు సంక్షేమ ఫలాలు అందే విధంగా పాటుపడతానన్నారు. సుదీర్ఘకాలం పాటు విశాఖ కలెక్టర్‌గా పనిచేసి పశ్చిమగోదావరి జిల్లాకు బదిలీపై వెళ్తున్న కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ నుంచి కలెక్టర్ చాంబర్‌లో సోమవారం ఉదయం 10 గంటలకు నూతన కలెక్టర్‌గా కాటమనేని బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో సాధ్యమైనంత ఎక్కువ మంది అర్హులకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించడమే తన లక్ష్యమన్నారు. జిల్లాలో నెలకొన్న సమస్యలపై తనకు ఎలాంటి అవగాహన లేదని, పూర్తి స్థాయిలో అధ్వయనం చేయాల్సి ఉందనన్నారు. సమస్యలపై స్టడీ చేసిన తర్వాత పరిష్కారానికి కృషిచేస్తానన్నారు.
ఒక్క రోజులో సమస్యలన్నీ పరిష్కరించలేం..
ప్రజలు తమ సమస్యలు నేరుగా చెప్పుకునే మీ కోసం, ప్రజావాణి (గ్రీవెన్స్‌సెల్) కార్యక్రమాలకు తాను అధిక ప్రాధాన్యత నిస్తానని కలెక్టర్ భాస్కర్ స్పష్టం చేశారు. ఒక్క రోజులో సమస్యలన్నింటిని పరిష్కరించడం సాధ్యం కాదన్నారు. ప్రతి అర్జీని నిశితంగా, క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. ఆర్థికంగా, ఆర్థికేతర, సామాజిక కోణాల్లో సమస్యలను విభజించి సత్వర పరిష్కారానికి నోచుకునేలా కృషి చేస్తామన్నారు. జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులు ప్రజలకు సేవ చేయడం కోసమేనని, ఆ దిశగా పనిచేయాలన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంలో అలక్ష్యం, అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవన్నారు. భూ వివాదాలు, వ్యక్తిగత ఫిర్యాదులు, కోర్టు వివాదాలు కలెక్టర్ వరకు ఎందుకు వస్తున్నాయనే దానిపై ఆయా శాఖాధికారులతో చర్చించి చర్యలు చేపడతామన్నారు. మండల స్థాయి నుంచి కలెక్టర్ స్థాయి వరకు వచ్చే ప్రతి ఫిర్యాదు పరిష్కారం కావాల్సిందేనన్నారు.ఈ ఆఫీసింగ్‌పై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తానన్నారు.
సాగునీటి పథకాలపై అవగాహనలేదు
జిల్లాలో సాగునీటి పథకాలపై తనకు ఎలాంటి అవగాహన లేదని, తెలియని విషయాలు తెలిసినట్టుగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని కలెక్టర్ భాస్కర్ అన్నారు. జిల్లాలో అన్ని సమస్యలు అర్ధం చేసుకున్న తర్వాతే మాట్లాడతానన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు పనులు ఎంతో వేగంగా జరిగేలా కృషి చేశామని, అయితే ఇంకా చేయాల్సింది ఎంతో ఉందన్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిపై సంబంధిత శాఖాధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో డీఆర్‌వో సి.చంద్రశేఖరరెడ్డి, ఆర్డీవో తేజ్‌భరత్ తదితరులు పాల్గొన్నారు.